విశ్లేషణ
బొగ్గు గనులు ‘ఇంధన భద్రత’గా మారాయి. రేవులు ‘వ్యూహాత్మక మౌలిక వసతులు’ అయ్యాయి. సఫారీ పార్కులు ‘సంరక్షణ’ ముద్ర వేసుకుంటున్నాయి. వీటిని ఒకే తాటిపైకి తెస్తున్నది జాగ్రఫీ కాదు, వాటి రాజకీయ ఆర్థిక వ్యవస్థ. హరిత ఆవరణ వ్యవస్థ అడవులు,కొండలు, దీవులను అభివృద్ధి పేరిట పెట్టుబడి ఆస్తులుగా మార్చేస్తోంది. హరియాణాలో ఆరావళి పర్వత శ్రేణిలో 3,800 ఎకరాలకు పైగా ప్రాంతాన్ని మెగా సఫారీ పార్కుగా మార్చాలన్న ప్రతిపాదన అందుకు తిరుగులేని నిదర్శనం. ఎకో టూరిజం, జీవవైవిధ్య పెంపుదల పేరు చెప్పి అది టూరిస్టులకు కన్నుల పండువను, డెవలపర్లకు లాభాలను వాగ్దానం చేస్తోంది. కానీ, అది అడవుల ఆవరణకు, జల వనరులకు, గ్రామాల ఉమ్మడి ఆస్తులకు ముప్పుగా పరిణమిస్తోంది.
ఇది ఆరావళికి మాత్రమే పరిమితమైంది కాదు. హసదేవ అరండ్‌లో బొగ్గు బ్లాకుల నుంచి దేహింగ్ పటకాయీలో చమురు, మైనింగ్; గ్రేట్ నికోబార్‌లో ట్రాన్స్– షిప్‌మెంట్ పోర్టు వరకు, భారతదేశపు అత్యంత బలహీనమైన జీవావరణ వ్యవస్థలు, అభివృద్ధికి పొలిమేరలుగా పునర్నిర్మాణం చెందుతున్నాయి. సఫారీ అనేది మినహాయింపు కాదు. అదొక నమూనా!
జీవనాధార వ్యవస్థకు ముప్పు
ఆరావళి పర్వతాలు గుజరాత్‌లో మొదలై రాజస్థాన్, హరి యాణా గుండా సాగి ఢిల్లీ వరకు 670 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థగా దీన్ని చెబుతారు. ఇది భౌగోళిక అవశేషం కాదు. జీవావరణ మౌలిక వ్యవస్థ. థార్ ఎడారి తూర్పు వైపు మరింత విస్తరించకుండా ఇవి దాన్ని కాస్త మందగింపజేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా వాయవ్య భారతాన భూగర్భ జలాల రీఛార్జీకి ఇవి ఉపయోగ పడుతున్నాయి. గురుగ్రామ్, ఫరీదాబాద్, నుహ్ వంటి జిల్లాల్లో భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటాయి. ఆ జిల్లాలకు ఆరావళి పర్వతాలే జీవనాడి. అవి రుతుపవన వర్షాలను పీల్చుకుంటూ భారీ స్పాంజ్‌లుగా ఉపయోగపడుతున్నాయి. నీటికి ఎంతో కటకటలాడే ప్రాంతంలో జలవనరులు అంతో ఇంతో నిండటానికి తోడ్పడుతున్నాయి.
పరిస్థితులు నానాటికీ తీసికట్టుగా ఉన్న ఈ నేపథ్యంలో, పులిమీద పుట్రలా సుప్రీం కోర్టు భౌగోళిక శాస్త్ర ప్రమాణాలను ఉటంకిస్తూ, ‘సైన్స్’ పేరుతో ఆరావళి పర్వతాల రూపురేఖలకు ఆ మధ్య కొత్త నిర్వచనం ఇచ్చింది. చుట్టుపక్కల భూమి కన్నా కనీసం 100 మీటర్లు, అంతకన్నా ఎక్కువ ఎత్తులో ఉంటేనే, మూడు డిగ్రీల ఏటవాలు కనబడితేనే ఆరావళిలో భాగంగా పరిగణించాలని పేర్కొంది. ఈ విషయంలో అది రెగ్యులేటరీ అస్పష్టతను తొలగించేందుకు కేంద్రం ఇచ్చిన నిర్వచనం పైనే ఆధారపడింది. కాగితాలపై ఇది సాంకేతిక సునిశితత్వంగా కనిపించవచ్చు. వాస్తవంలో, ఇది లీగల్ భూకంపం లాంటిది.
ఆరావళులలో చాలా భాగాలు ముఖ్యంగా హరియాణా, రాజస్థాన్ లోనివి తక్కువ ఎత్తులోనే ఉంటాయి. అవి కోర్టు చెప్పిన ఎత్తును అందుకోలేకపోవచ్చు. కానీ, జీవావరణ పరంగా అత్యంత కీలకమైనవి. పర్వతాలను పునర్ నిర్వచించడం ద్వారా భారీ భూభాగాలను పరిరక్షణ నుంచి మినహాయిస్తే, అవి గనుల తవ్వ కాలు, రియల్ ఎస్టేట్, హైవేలు, సఫారీ లాంటి ప్రాజెక్టులకు ఆల వాలం అవుతాయి. (అయితే, సుప్రీంకోర్టు తాజాగా తన తీర్పును పునఃపరిశీలిస్తోంది.)
చెప్పేదొకటి... చేసేదొకటి!
వన్య ప్రాణులను సంరక్షిస్తామని సఫారీ ప్రాజెక్టు చెబుతోంది. కానీ, పెళుసుగా ఉన్న ప్రాంతంలో రోడ్లు, లాడ్జీలు, పార్కింగ్ లాట్లు, ఇతర ఎన్‌క్లోజర్లు నిర్మించడం ద్వారా చేసే పనులు సంరక్షణ కిందకు రావు. అడవులకు కంచె నిర్మిస్తారు. ప్రజలను వాటిని దాటి వెళ్ళ నివ్వరు. ఉన్నత వర్గాల సరదాలకు అనుగుణంగా ప్రకృతిని తాము ఎంచుకున్న పద్ధతిలో నిర్వహిస్తారు. గురుగ్రామ్, నుహ్‌లలోని స్థానిక ప్రజానీకం పశుగ్రాసం, కట్టెలు, నీరు, రుతువులను బట్టి లభించే ఉపాధి మార్గాలకు ఆరా వళులపైనే ఆధారపడుతోంది. ఇది ఉన్నవి లాగేసుకోవడం ద్వారా వేరే వారికి పోగేసిపెట్టడమే! దాన్ని ‘ఎకో–టూరిజం’గా రీప్యాకేజీ చేయడమే.
మధ్యభారతంలోని విస్తారమైన అడవుల్లో ఛత్తీస్‌గఢ్‌లోని హసదేవ అరండ్ ఒకటి. టేకు చెట్లకు, ఇనుమద్ది, సాళువ, గుగ్గిలం చెట్లుగా పిలిచే రకం చెట్లకు ఇది ప్రసిద్ధి. ఇంధన భద్రత పేరుతో బొగ్గుకు ఈ ప్రాంతాన్ని త్యాగం చేశారు. అధికారుల ప్రోద్బలంతో మైనింగ్ బ్లాకులు తెరిచారు. ఆరావళికి ఎకో–టూరిజం మాదిరిగానే హసదేవకు బొగ్గు ఎసరు పెట్టింది. రెండు ఉదంతాల్లో పేర్లు మారినా వాటిల్లే హాని ఒక్కటే!కాగితాలపై పచ్చదనం... ఆచరణలో అరాచకం అస్సాంలోని దేహింగ్ పటకాయీని ‘అమెజాన్ ఆఫ్ ది ఈస్ట్’గా అభివర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి పేరెన్నికగన్న ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాల అన్వేషణకు, బొగ్గు గనుల తవ్వకానికి అనుమ తించారు. రెగ్యులేటరీ మినహాయింపులనిచ్చారు. అనుమతులకు ముందే పనులు చకచకా సాగిపోయాయి. మొదట తవ్వి తీయడం, తరువాతే పరిశీలనలు. టెక్నోక్రాటిక్ పరిభాషతో ఆ ప్రాజెక్టులను సమర్థిస్తున్నారు. ప్రభావం మదింపు, నిపుణుల కమిటీలు, నష్టాన్ని తగ్గించే ప్రణాళికలు అంటారు. కానీ, ఈ మంత్రాంగాలు సంరక్షణ చర్యలగా కన్నా, ముందే నిర్ణయించిన ఫలితాలను చట్టబద్ధం చేసే సాధనాలుగానే ఎక్కువ ఉపయోగపడతాయి.
జాతీయ భద్రత, వ్యూహాత్మక మౌలిక వసతుల పేరుతో గ్రేట్ నికోబార్‌లో మెగా ట్రాన్స్–షిప్‌మెంట్ పోర్టును, విమానాశ్రయాన్ని, టౌన్ షిప్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వర్షారణ్యాలకు, కోరల్ ఎకోసిస్టవ్‌ులకు, స్థానిక శోంపెన్ జనజాతి మనుగడకు ముప్పుగా పరిణమించింది. ఇక్కడ గ్రీన్ ఎన్‌క్లోజర్ భౌగోళిక రాజ కీయాల ముసుగు వేసుకుంటుంది. పెట్టుబడిదారీ వ్యవస్థకు జీవా వరణం సలాం చేయవలసిందే. ఈ ఉదంతాలన్నింటిలోనూ చట్టం లోపించలేదు. దాన్ని జాగ్రత్తగా వాడుకున్నారు. ఆరావళి, హసదేవ, ఇతర దుర్బల మండ లాలను కాపాడేందుకు సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ అడపాదడపా జోక్యం చేసుకుంటూనే ఉన్నాయి. 1900 నాటి పంజాబ్ భూసంరక్షణ చట్టం వంటివి భూ వినియోగ మార్పుపై కొన్ని పరిమితులను విధించగలిగాయి. అయినా, కమిటీలు, పునర్ వర్గీకరణలు, నీరుగార్చిన మదింపులు, ఇప్పుడు ఏకంగా మారిన నిర్వచనాలను కవచాలుగా ధరించి మెగా ప్రాజెక్టులు ముందుకు సాగుతున్నాయి.
దేవాశీస్ చక్రవర్తి
వ్యాసకర్త అంతర్జాతీయ మీడియా స్కాలర్,
సామాజిక శాస్త్రవేత్త (‘యూరేసియా రివ్యూ’ సౌజన్యంతో)


