అభిప్రాయం
భారతదేశ చరిత్రకు ఆరావళి పర్వత శ్రేణి ఒక మౌన సాక్షి. కోట్లాది సంవత్సరాలుగా ఏర్పడిన ఈ పురాతన పర్వత వ్యవస్థ ఉత్తర భారతదేశానికి సహజ రక్షణ కవచంగా నిలిచింది. కానీ నేడు అభివృద్ధి ముసుగులో మైనింగ్ దోపిడీకి బలవుతోంది. ఇది కేవలం పర్యా వరణ సమస్య కాదు; ప్రజల జీవన హక్కులపై దాడి.
ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆరావళి పర్వతాలను (Aravalli Range) ప్రధానంగా ఎత్తు (100 మీటర్లు) ఆధారంగా నిర్వచించింది. ఇది కీలక ప్రాంతాలను రక్షణ పరిధి నుంచి తొలగించే ప్రమాదాన్ని తెచ్చింది. ఈ నిర్ణయం చట్టపరంగా సాంకేతికంగా ఉన్నా, దాని ప్రభావాలు దేశ భవిష్యత్తును ప్రభావితం చేయనున్నాయి.
ఆరావళి ఒక పర్వత శ్రేణి కాదు, ఒక జీవవ్యవస్థ. అవి కేవలం రాళ్ల సమూహం కాదు, భూగర్భ జలాలకు సహజ భండారం; ఎడారీకరణను అడ్డుకునే చివరి గోడ; అడవులు, వన్యప్రాణులకు నివాస స్థలం; ఢిల్లీ – ఎన్‌సీఆర్‌కు సహజ గాలి శుద్ధి యంత్రం. భౌగోళిక నిర్మాణం, అడవుల విస్తరణ, శిలా స్వభావం, నీటి ప్రవాహం వంటివన్నీ కలిసి ఆరావళిని జీవవ్యవస్థగా నిలబెట్టాయి. ఎత్తు ఆధారంగా ఈ వ్యవస్థను విభజించడం అంటే శాస్త్రానికే అవమానం. ఆరావళిలో మైనింగ్ నష్టాలు తాత్కాలికం కావు. పర్వతాలను పేల్చడం ద్వారా శిలా నిర్మాణాలు శాశ్వతంగా ధ్వంసమవుతాయి. భూగర్భ జలాల సహజ ప్రవాహం తెగిపోతుంది. అడవులు తిరిగి పునరుద్ధరించలేని విధంగా నశిస్తాయి. ‘సస్టెయిబుల్ మైనింగ్’ భావన ఒక మిథ్య.
హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల్లో నీటి కొరత ఇప్పటికే తీవ్రమ వుతోంది. మైనింగ్ వల్ల సహజ వ్యవస్థ దెబ్బతింటే, కోట్లాది ప్రజలు తాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరావళి పర్వత శ్రేణుల అడవులు... ధూళిని, ఇసుక గాలులను అడ్డుకుంటూ సహజ రక్షణ గోడలా పనిచేస్తాయి. ఆ గోడను కూల్చేసి, కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రభుత్వ ద్వైదీ భావానికి ప్రతీక. ఆరావళి పర్వతాలు పశ్చిమ రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చే వేడి గాలులను అడ్డుకునే చివరి అవరోధం. ఈ అవరోధం బలహీనపడితే, ఎడారీకరణ హరియాణా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వైపు విస్తరించే ప్రమాదం ఉంది. ఇది భవిష్యత్ తరాలపై విధించే శిక్షతో సమానం.
చదవండి: విభేదాలు ప్రమాదకరం కాదు!
ప్రకృతి వనరులు కొద్దిమంది కార్పొరేట్ లాభాల కోసం త్యాగం చేయ బడితే, అది ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అభివృద్ధి అంటే నీటి భద్రత, ప్రజారోగ్యం, పర్యావరణ సమతుల్యత, భవిష్యత్ తరాల భద్రతకు హామీ ఇచ్చేదిగా ఉండాలి. ఆరావళిని కాపాడటం అంటే ఒక పర్వత శ్రేణిని కాపాడటం కాదు, దేశపు జీవనాధారాలను కాపాడటం. నిజమైన అభివృద్ధి ఎప్పుడూ పర్యావరణాన్ని కాపాడుతూ ముందుకు సాగుతుంది.
- కె. నారాయణ
చైర్మన్, కంట్రోల్ కమిషన్; కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా


