చరిత్రకు పూర్వమే కొన్ని నదులకు చిరునామాగా, వైవిధ్యభరిత ప్రకృతికి ఆలవాలంగా, రకరకాల జీవరాశులకు ఆలంబనగా నిలిచిన ఆరావళి ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకున్నట్టే. ఆ పర్వత శ్రేణిపై గత నెల 20న తామిచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సుప్రీకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయం పర్యావరణ ఉద్యమకారులకూ, ఆ ప్రాంత ప్రజానీకానికీ ఉపశమనం కలిగించింది. 250 కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించి వాయవ్య భారత్‌ను 670 కిలోమీటర్ల పొడవునా కంటికి రెప్పలా చూసుకుంటున్న ఆరావళికి కష్టం వచ్చిందంటే జనం తల్లడిల్లారు.
టేపు తీసుకుని కొలతలు కొలిచి, ఎన్ని డిగ్రీల కోణంలో వాలాయో గమనించి ఆ కొండల్ని కత్తిరించాలని చూసినవారి ఎత్తు గడలకు విస్తుపోయారు. అందుకే పర్యావరణ ఉద్యమకారుల నాయకత్వంలో పార్టీల కతీతంగా గొంతెత్తారు. చివరకు జనానిదే పైచేయి అయింది. ఈ అంశంలో మరిన్ని వివరణలు, భిన్న కోణాల్లో పరిశీలనలూ అవసరమవుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడి ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ మరింత సమగ్రంగా,మరింత సంపూర్ణంగా దీన్ని పరిశీలించాల్సి ఉంటుందని భావించింది.
ఎన్నో పురుటినొప్పులు పడి, ఎన్నెన్నో ఉత్పాతాలు చవిచూసి, ఎన్నో విధాల భౌగోళిక మార్పులు జరిగి ప్రకృతి సంపద ఈ రూపంలో మన కళ్లముందుంది. అధికారం ఉండొచ్చు, కుబేరుణ్ణి తలదన్నేంత ఐశ్వర్యం ఉండొచ్చు – కానీ ఈ సంపదను అవసరా లకు పొదుపుగా వినియోగించుకుంటూ సురక్షితంగా భవిష్యత్తరాలకు అప్పగించటం మనిషి జన్మెత్తినవారి బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా పాలకులుగా ఉన్నవారూ, పారిశ్రామిక వేత్తలూ దీన్నెక్కడా గమనించుకుంటున్నట్టు లేరు. అందుకే అడవులు మటుమాయమవు తున్నాయి. కొండలు కరిగిపోతున్నాయి. నదులు ఇంకిపోతున్నాయి. జీవ వైవిధ్యం గతి తప్పుతోంది. కొన్ని రకాల జంతువులు, పక్షులు ఇప్పటికే అంతరించిపోయాయి. నదుల గమనాలు మారాయి. రుతువులు తీరు మార్చుకుంటున్నాయి. రకరకాల కాలుష్యం కాటేస్తోంది.
ఆరావళి మాత్రమే కాదు... దేశంలో చిన్నా పెద్దా కొండలు, గుట్టలు దీనంగా వేడుకుంటున్నాయి. మానవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్న తమ ఉసురు తీయ డానికి సిద్ధపడుతున్న వైనం చూసి దుఃఖిస్తున్నాయి. అయినా ఆగిందేమీ లేదు. బంగారం మొదలుకొని డోలమైట్, గ్రాఫైట్, మాంగనీస్, బొగ్గు, రాగి, బాక్సైట్ వంటి రకరకాల ఖనిజాలు వాటిల్లో నిక్షిప్తమై ఉండటమే అందుకు కారణం. అభివృద్ధికి అవసరమనుకుంటే పరిమిత స్థాయిలో వాటిని వినియోగించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ప్రకృతి విపత్తులకు దారితీసే స్థాయికి అది చేరుకోవటం వల్ల అసలు అభివృద్ధి పరమార్థమే దెబ్బతింటోంది. ఆ ప్రాంతాల్లో నివసించే ఆదివాసుల జీవిక ధ్వంసమవుతోంది.
ఇన్ని దశాబ్దాలుగా మౌనంగా వీక్షించిన వాయవ్య భారతం ఇప్పుడైనా గొంతెత్తగలిగింది గనుకే ప్రస్తుతానికిది ఆగింది. ఆరావళి పర్వత పంక్తులు చంబల్, సబర్మతి, లూని వంటి నదులకు జీవం పోస్తున్నాయి. అక్కడ అడవులున్నాయి, గడ్డిభూములు న్నాయి. సారవంతమైన నేలలు సరేసరి. అపురూపమైన జంతు, వృక్షజాలాలున్నాయి. దేశ రాజధాని నగరం ఈ మాత్రమైనా ఊపిరి పీల్చుకోగలుగుతున్నదంటే అది ఆరావళి చలవే. అంతేకాదు... భూగర్భ జలాలు సమృద్ధిగా లభించేలా చేస్తున్నాయి. ఇప్పటికే కొన సాగుతున్న మైనింగ్‌ను నిలిపేయటంతోపాటు కొత్తగా మైనింగ్ లైసెన్సులు జారీ చేయకుండా చర్యలు తీసుకుంటేనే ఈ మాత్రమైనా మిగులుతాయి.
ఆ దిశగా తీసుకోవా ల్సిన చర్యల్లో సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులు తొలి అడుగు కావాలి. ఆరావళిలో కోల్పో యింది కోల్పోగా ప్రస్తుతం మిగిలినదాన్నయినా ఎలా రక్షించుకోవాలన్న ఆర్తి ఉంటే తప్ప ఇదంతా సాధ్యపడదు. వాయవ్య భారతమే కాదు... దేశంలోని అన్ని ప్రాంతాలూ తమ గొంతు బలంగా వినిపించినప్పుడే కొనసాగుతున్న విధ్వంసానికి తెరపడుతుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. భూ ఆకృతి సంబంధిత అంశంగా చూసి కొలతలతో, కోణాలతో యాంత్రికంగా చూడక, మనిషి ఇరుసుగా ప్రకృతిని వీక్షించగలిగితే తరతరాల పాటు ఈ అపురూప సంపద మానవాళికి ఆసరా అందిస్తుంది.


