దువ్వూరి సుబ్బారావు, లతా వెంకటేష్
వ్యూ పాయింట్:
పాడ్‌కాస్ట్: లత అండ్ ద లీడర్స్
అతిథి: దువ్వూరి సుబ్బారావు, ఆర్బీఐ మాజీ గవర్నర్
హోస్ట్: లతా వెంకటేష్, కన్సల్టింగ్ ఎడిటర్, సీఎన్‌బీసీ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ మధ్య జరిగే ‘ఘర్షణ’లు తరచుగా వార్తల్లోకి వస్తుంటాయి. ‘‘కానీ, ఇది సంక్షోభానికి సంకేతం కాదు. పాలన లక్షణం’’ అంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. ఈ ఘర్షణలను ఆయన, వైవా హిక జీవితంలోని విభేదాలతో పోల్చారు. ‘‘కొన్నిసార్లు అవి తీవ్రంగా ఉండొచ్చు. అయితే అవి ఒకే లక్ష్యం పట్ల ఉమ్మడి నిబద్ధతతో జరుగుతాయి’’ అని దువ్వూరి చెబుతున్నారు. దేశ ఆర్థిక స్థిరత్వం, అభివృద్ధి కోసం జరిగే సంస్థాగత చర్చ ల్లోని ఘర్షణలు చివరికి మంచే చేస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన ఈ పాడ్‌కాస్ట్‌లో వెలిబుచ్చారు.
ఘర్షణ ఉండటం మంచి లక్షణం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖల మధ్య అనివార్యంగా కొంత ఘర్షణ ఉండనే ఉంటుంది. నా అనుభవాన్ని బట్టి, అలా ఉండటం అవసరం కూడా! ఈ రెండు సంస్థలు ఆర్థిక వ్యవస్థను భిన్న దృక్పథాలతో చూస్తాయి. ఆర్బీఐ ద్రవ్య స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ భద్రతపై దృష్టి పెడితే; ప్రభుత్వం సహజంగానే అభివృద్ధి, ఉపాధి, ప్రజలకు జవాబుదారీగా ఉండటం వంటి బాధ్యతలపై దృష్టి సారిస్తుంది. ఈ భిన్న దృక్పథాలు కలిసి పని చేయవలసి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒకసారి అభిప్రాయ భేదాలు రావడం సహజమే. ఇది వ్యవస్థలోని లోపం కాదు. ఇండియా వంటి విస్తృతమైన ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలో ఉన్న సంక్లిష్టతకు ఒక లక్షణం మాత్రమే.
ప్రత్యర్థులు కారు, భాగస్వాములు
నేను తరచూ, ఆర్బీఐ–ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలను దాంపత్య జీవితంలోని చిన్న గొడవలతో పోలుస్తాను. మీరు బలంగా వాదించవచ్చు. ఒక్కోసారి తీవ్రమైన ఆవేశంతో కూడా! కానీ, అందువల్ల మీరు ప్రత్యర్థులు అవుతారని కాదు. చివరికి, ఇద్దరూ ఒకే పక్షంలో ఉన్నారన్న గ్రహింపు వస్తుంది. విభేదాలు ప్రమాదకరం కాదు. వాటిని శత్రుత్వంగా లేదా సంస్థాగత వైఫల్యంగా భావించడమే ప్రమాదకరం. పరస్పర గౌరవం ఉన్నంత కాలం ఈ చర్చలు, లేదా ఘర్షణలు నిర్మాణాత్మకంగానే ఉంటాయి.
సంఘర్షణ, సంభాషణలో భాగమే!
ఆర్బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ రెండూ కూడా భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, సమృద్ధి అనే ఒకే భారీ లక్ష్యం కోసం పని చేస్తాయి. ఆ ఉమ్మడి లక్ష్యాన్ని పంచుకుంటాయి. మా విధానాలు వేరుగా ఉండవచ్చు. మా కాల పరిమితులు కలవకపోవచ్చు, కానీ చేరుకోవాల్సిన గమ్యం ఒక్కటే. ఈ ఉమ్మడి లక్ష్యాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు, విభేదాలు సంభాషణల ద్వారా పరిష్కా రమవుతాయి. ఆ సంభాషణలకు మరొక స్వరూపమే సంఘర్షణ.
ఇటు దృఢత్వం... అటు సంక్షేమం
చాలామంది ఈ ఉద్రిక్తతలు లేదా ఘర్షణలు, వ్యక్తిగత విభేదాల వల్ల వస్తాయని అనుకుంటారు. అలా జర గడం చాలా అరుదు. అసలు కారణం, సంస్థలకు అప్పగించిన బాధ్యతలే. ఆర్బీఐ గవర్నర్‌గా ప్రజాదరణ లేని, స్వల్పకాలికంగా అసౌకర్యాన్ని కలిగించే నిర్ణయాలైనా సరే తక్షణం తీసుకోవలసి వస్తుంది. ధరల స్థిరత్వం, ఆర్థిక వ్యవస్థ దృఢత్వాన్ని కాపాడటం ఆర్బీఐ బాధ్యత. అదే సమయంలో, ఆర్థిక మంత్రి తక్షణ ఆర్థిక ఒత్తిడులకు, ప్రజల అంచనాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ భిన్నమైన బాధ్యతలే విధానపరమైన విభేదాలకు దారితీస్తాయి.
చదవండి: సర్దుబాటుతోనే సాన్నిహిత్యం!
విభేదాలు పదును పెడతాయి!
పరిపక్వతతో, పరస్పర గౌరవంతో ఈ ఘర్షణను నిర్వహిస్తే, అది విధాన రూపకల్పనను మరింత బలపరు స్తుంది. వాదనలు... ఇరు పక్షాలనూ తమ ఆలోచనలను పదును పెట్టుకునేలా చేస్తాయి. అంచనాలను, అభ్యంతరాలను ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఊహించని ప్రభావాలను పరిగణనలోకి తీసుకునేలా ప్రేరేపిస్తాయి. సులభమైన ఏకాభిప్రాయం కంటే లోతైన చర్చల నుంచే మెరుగైన విధానాలు వెలువడతాయి. ముఖ్యంగా... సంస్థల మధ్య నమ్మకం ఉండటం, అంతరాయం లేని స్పష్టమైన సంభాషణ కొనసాగడం అత్యంత ముఖ్యం.
- ఎడిటోరియల్ టీమ్


