భారత్–బంగ్లాదేశ్ సంబంధాలు 1971 నాటి బంగ్లా విముక్తి పోరాటం తర్వాత అత్యంత కీలకమైన ఘట్టంలో ఉన్నాయి. భారత్ అనుకూల అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో హఠాత్తుగా కుప్పకూలి, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక గత దశాబ్దపు సోనాలీ అధ్యాయ్ (స్వర్ణ అధ్యాయం) ఛాయలు కనుమరుగ య్యాయి. ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నదనే దానితో నిమిత్తం లేకుండా రెండు దేశాల మధ్య పొత్తు కొనసాగవలసి ఉంది. ఆర్థిక కారణాల రీత్యానూ ఇది రెండు దేశా లకు అవసరం. ప్రాంతీయ సుస్థిరతకు అదే ప్రాణాధారం.
ఇండియాపై పెరిగిన వ్యతిరేకత
ఈ ఏడాది (2025) బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావనలు అసాధారణ స్థితికి చేరుకున్నాయి. యువజన నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హతుడైన తర్వాత నిరసన ప్రదర్శనలు ముమ్మర మైనాయి. అతని మృతి వెనుక భారత్ హస్తం ఉందని బంగ్లాదేశ్‌లో చాలామంది ఆరోపిస్తున్నారు. నిరసనకారులు భారత దౌత్య కార్యా లయాలను లక్ష్యంగా చేసుకున్నారు. హిందు యువకుడు దీపూ చంద్ర దాస్ దారుణ హత్య సభ్య ప్రపంచాన్ని నిర్ఘాంతపరచింది. బంగ్లాదేశ్‌లో 2026 ఫిబ్రవరిలో జాతీయ ఎన్నికలు జరగవలసి ఉంది. రాజకీయ ప్రయోజనాలను మూటగట్టుకునేందుకు భారత వ్యతిరేక భావనలను ఎగదోస్తున్నారనే అభిప్రాయం ఉంది. షేక్ హసీనాను అప్పగించడానికి భారత్ తిరస్కరించడం కూడా రెండు దేశాల మధ్య ఘర్షణకు ఒక ప్రధానాంశంగా మారింది. ఢాకాలో అధికారం చేతులు మారడంతో, జమాత్–ఏ–ఇస్లామీ వంటి భారత వ్యతిరేక ఇస్లామీయ వర్గాలకు ఊతం లభించింది.
రెండు దేశాల మధ్య భద్రతాపరమైన సహకారానికి ఒకప్పుడు ‘అగ్ర ప్రాధాన్యం’ లభించేది. బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత అక్కడి ఇస్లా మీయ వర్గాల పునరేకీకరణకు వీలు కల్పించి ఈశాన్య ప్రాంతంలో ఆంతరంగిక భద్రతకు బెడదగా పరిణమిస్తుందని భారత్ కలవర పడుతోంది. ఉగ్రవాద ప్రసంగాలు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, అస్సాంలలో మతపరమైన ఘర్షణలను రేకెత్తించవచ్చు.
ముప్పేట ముప్పు
‘పొరుగు దేశాలకే మొదట పెద్ద పీట’ అనే భారత్ విధానం కొన్నేళ్ళుగా అవామీ లీగ్‌తో మైత్రి అనే లంగరుపైనే ఎక్కువగా ఆధారపడుతూ వచ్చింది. భారత్ చర్చలు జరిపేటపుడు సంప్ర దాయసిద్ధమైన మిత్రులతోనే కాకుండా, యువజన నాయకులను, పౌర సమాజాన్ని కూడా ఆ ప్రక్రియలోకి తేవాలి. ఎన్నికల్లో ప్రధాన పాత్ర వహిస్తుందని భావిస్తున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) వంటి ప్రతిపక్షాలను కూడా కూడగట్టుకోవాలి.
దక్షిణాసియాలో భారత్‌కు బంగ్లాదేశ్ అతి పెద్ద వాణిజ్య భాగ స్వామి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం భారత్‌ను మూల బిందు వుగా చేసుకున్న విధానం నుంచి మరలి చైనా, పాకిస్తాన్, పశ్చిమ దేశాలతో సంబంధాలను పటిష్టపరచుకుంటోంది. బంగ్లాదేశ్ కూడా పాకిస్తాన్ తరహాలో సైద్ధాంతిక లేదా సైనిక అమరిక వైపు మొగ్గు చూపుతున్న సందేహాలు రేకెత్తుతున్నాయి. ఘర్షణ వైఖరిని అవలంబిస్తున్న బంగ్లాదేశ్ మనకు ‘మూడు వైపుల’ నుంచి ముప్పును తేవొచ్చు. పశ్చిమ (పాకిస్తాన్), ఉత్తర (చైనా), తూర్పు (బంగ్లాదేశ్) సరిహద్దుల వైపు భారత్ సైన్యాన్ని, వనరులను విస్తరింపజేయక తప్పని స్థితి ఏర్పడుతోంది.
భారతదేశపు ప్రధాన భూభాగాన్ని దాని ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలతో అనుసంధానపరచే 22 కిలోమీటర్ల సన్నని భూభాగమైన సిలీగుడీ కారిడార్ అత్యంత సున్నితమైన భౌగోళిక ప్రాంతం. దీన్నే ‘చికెన్ నెక్’ అంటారు. పాక్–చైనాలతో సాన్నిహిత్యం బంగ్లాదేశ్‌ను ఈ కారిడార్‌కు సమీపంలో సైనిక మౌలిక వసతుల కల్పన అభి వృద్ధికి పురికొల్పవచ్చు. భారత్‌ను సాగర జలాల నుంచి చుట్టు ముడుతూ ప్రత్యర్థి దేశాలు చిట్టగాంగ్, మోంగ్లా వంటి వ్యూహాత్మక రేవులను వినియోగించుకోవచ్చు. చైనా సాయంతో పెకువా జలాంత ర్గామి కేంద్రాన్ని బంగ్లాదేశ్ అభివృద్ధి చేస్తూండటంతో బంగాళా ఖాతంలో భారత నౌకాదళ ఆధిపత్యానికి గండి పడుతోంది.
అన్ని పక్షాలను కలుపుకొంటేనే...
బంగ్లా భూభాగాన్ని ఉపయోగించుకుని అస్సాం సమైక్య విమో చన కూటమి (ఉల్ఫా) వంటి తిరుగుబాటు గ్రూపులు తిరిగి తలెత్త వచ్చు. హసీనా ప్రభుత్వం దాన్ని చాలా వరకు నిరోధించింది. పాకి స్తాన్ ఐఎస్‌ఐ కార్యకలాపాలు బంగ్లాదేశ్‌లో ఊపందుకుంటే – నకిలీ కరెన్సీ, ఆయుధాలు, మతోన్మాద శక్తులు భారతీయ సరిహద్దు రాష్ట్రా ల్లోకి చొరబడటం పెరుగుతుంది. తీస్తా నదీ ప్రాజెక్టులో కూడా పెట్టు బడులకు చైనా ముందుకొస్తోంది.
ఈ చిక్కుముడులను విప్పుకుంటూ, బంగ్లాతో సంబంధాలను మళ్ళీ బలోపేతం చేసుకునేందుకు తగిన ఆచరణాత్మక పంథాను, బహుళ దృక్కోణ వైఖరిని రూపొందించుకునే దిశగా భారత్ కృషి చేయాలి. భారత్ తమ దేశంలో ఒక పార్టీకే అనుకూలంగా ఉందనే అభిప్రాయాన్ని తొలగించాలి. గంగా జలాల ఒడంబడిక వంటి కీలక అంశాలపై సకాలంలో పారదర్శకమైన చర్చలు చేపట్టాలి. ఇతర నదీ జలాల పంపకాలపై విస్తృత నిర్వహణా వైఖరిని అనుస రించాలి. బంగ్లాకు అది సున్నితమైన జాతీయ అంశం కనుక ఈ విష యంలో జాగు చేస్తే, అది ఆ దేశంలో భారత్ వ్యతిరేక అభిప్రా యాలను ఎగదోసేందుకు తోడ్పడుతుంది.
సంక్షుభిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థికంగా పరస్పరం ఆధారపడి ఉండటమనే అంశం భవిష్యత్ సంబంధాలకు బలమైన లంగరుగా పనిచేయగలదు. ద్వైపాక్షిక వాణిజ్యం 2024–25లో 13.46 బిలియన్ల డాలర్ల మేరకు ఉన్నట్లు అంచనా. ఏమాత్రం అభివృద్ధి చెందని దేశ స్థాయి నుంచి 2026లోనన్నా బయటపడాలని బంగ్లా తాపత్రయపడుతోంది. అది భారతదేశంతో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే, వాణిజ్యపరమైన ప్రత్యేక హక్కులను కాపాడుకున్నట్లవుతుంది. భారత్–బంగ్లా స్నేహ పూర్వక పైపులైను, (అఖౌడా–అగర్తలా వంటి) సీమాంతర రైలు సంధానం వంటివి భారత్ ‘తూర్పు కార్యాచరణ’ విధానానికీ, బంగ్లా వృద్ధికీ అవసరం. 
వ్యాసకర్త కువైట్, మొరాకోల్లో భారత మాజీ రాయబారి
(‘ఫస్ట్ పోస్ట్’ సౌజన్యంతో)


