బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించిన కేంద్రం
దేశీయంగానే 75 శాతం చిప్స్ తయారీ లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ప్రపంచంలో ’ఆత్మనిర్భర్ భారత్’నినాదానికి బలం చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్స్ రంగానికి వెన్నెముక లాంటి సెమీకండక్టర్ల (చిప్స్) తయారీలో దేశాన్ని అగ్ర స్థానానికి చేర్చేందుకు ’ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0’(ఐఎస్‌ఎం 2.0)కు శ్రీకారం చుట్టింది. 2026–27 బడ్జెట్‌లో ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. పరిశోధన, శిక్షణ, పరికరాల తయారీపై దృష్టి సారిస్తూ, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దేశీయ టెక్నాలజీని అభివద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని కేంద్రం ప్రకటించింది.
ఆ మూడు దేశాలదే పెత్తనం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల తయారీలో తైవాన్, చైనా, కొరియా దేశాల ఆధిపత్యం నడుస్తోంది. కోవిడ్ సమయంలో చిప్స్ సరఫరా చైన్ దెబ్బతినడంతో మొబైల్స్ నుంచి కార్ల తయారీ వరకు అన్నీ స్తంభించిపోయాయి. ఈ చేదు అనుభవాల దష్ట్యా, సరఫరా గొలుసులో చైనాపై ఆధారపడకూడదని భారత్ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ‘మేక్ ఇన్ ఇండియా –మేక్ ఫర్ ది వరల్డ్’లక్ష్యంతో అడుగులు వేస్తోంది.
అప్పుడు ఐఎస్‌ఎం 1.0 సూపర్ హిట్..
కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రారంభించిన తొలి దశ (ఐఎస్‌ఎం 1.0) విజయవంతమైంది. రూ.76 వేల కోట్ల ప్రోత్సాహకాలతో మొదలైన ఈ ప్రయాణంలో డిసెంబర్ 2025 నాటికి ఏకంగా రూ.1.60 లక్షల కోట్ల పెట్టుబడులతో 10 భారీ ప్రాజెక్టులు ఆమోదం పొందాయి. ఇప్పుడు ఐఎస్‌ఎం 2.0 ద్వారా కేవలం చిప్స్ అసెంబ్లింగ్ మాత్రమే కాకుండా ముడి సరుకులు, పరికరాలు, డిజైనింగ్ కూడా భారత్‌లోనే జరిగేలా ప్రణాళిక రచించారు.
2026–27 బడ్జెట్ లక్ష్యం ఇదే..
సెమీకండక్టర్, డిస్‌ప్లే తయారీ ఎకోసిస్టమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 8,000 కోట్ల భారీ ప్రణాళిక రూపొందించారు. రూ. 4,000 కోట్ల పెట్టుబడితో మరో కొత్త చిప్ తయారీ యూనిట్ ద్వారా 1,500 మందికి ఉపాధి కల్పించానున్నారు. రూ. 11,000 కోట్ల పెట్టుబడితో 9 కొత్త ఏటీఎంపీ/ఓశాట్ అసెంబ్లింగ్ యూనిట్ల ద్వారా 3,000 మందికి ఉపాధి ఇవ్వనున్నారు. అంతేగాక 30 డిజైన్ కంపెనీలకు ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు 10 కొత్త చిప్ ఐపీ కోర్లను అభివృద్ధి చేయనున్నారు.
మన సొంత చిప్ ’ధ్రువ్–64’విదేశీ టెక్నాలజీపై ఆధారపడకుండా సీ–డాక్ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ’ధ్రువ్– 64’మైక్రోప్రాసెసర్ ఒక గేమ్ ఛేంజర్. 5జీ, ఆటోమొబైల్, రక్షణ రంగాల్లో దీని వినియోగం కీలకం కానుంది.
2035 నాటికి టాప్ ప్లేస్‌లో..
భారత సెమీకండక్టర్ మార్కెట్ 2030 నాటికి 100–110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలున్నాయి. 2029 నాటికి దేశీయ అవసరాల్లో 70–75 శాతం చిప్స్ మన దగ్గరే తయారయ్యేలా చూడటం, 2035కల్లా ప్రపంచంలోని టాప్ సెమీకండక్టర్ దేశాల సరసన భారత్ నిలవడం ఈ మిషన్ అంతిమ లక్ష్యమని కేంద్రం ప్రకటించింది. రాబోయే రోజుల్లో దేశీయంగా 3–నానోమీటర్, 2–నానోమీటర్ అత్యాధునిక చిప్స్ తయారీ ప్రణాళిక కార్యరూపం దాల్చుతుందని ధీమా వ్యక్తం చేసింది.


