‘జనగణమన’కు ముందే  వందేమాతరం | All 6 Stanzas Of Vande Mataram Now Must Sung At All Govt Official Events, More Details Inside | Sakshi
Sakshi News home page

‘జనగణమన’కు ముందే  వందేమాతరం

Feb 11 2026 11:28 AM | Updated on Feb 12 2026 5:28 AM

All 6 Stanzas of Vande Mataram now must govt Events

తొలగించిన 4 చరణాలతో కలిసి మొత్తం 6 చరణాలు ఆలపించాల్సిందే 

జాతీయ గీతాన్ని కించపరిస్తే మూడేళ్ల దాకా జైలుశిక్ష : కేంద్ర హోంశాఖ

న్యూఢిల్లీ: బంకించంద్ర చటర్జీ రచించిన దేశభక్తిని ఉప్పొంగించే జాతీయగేయం వందేమాతరాన్ని ఇకపై మొత్తం ఆరు చరణాలను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆలపించాలని కేంద్ర హోం శాఖ దేశ పౌరులకు బుధవారం సూచించింది. దశాబ్దాల క్రితం తొలగించిన 4 చరణాలతో కలిపి పూర్తిగా ఆరు చరణాలనూ పాడాల్సిందేనని స్పష్టంచేసింది. జాతీయగీతం జనగణమన కంటే ముందుగా జాతీయగేయమైన వందేమాతరంను ఆలపించాలని స్పష్టంచేసింది. 

ఈ మేరకు జాతీయగేయంను ఆలపించడంలో అనుసరించాల్సిన ప్రామాణిక నియమనిబంధనలను జనవరి 28వ తేదీతో రూపొందించిన ఒక ఉత్తర్వును కేంద్రం బుధవారం విడుదలచేసింది. అందులో అనుసరించాల్సిన పూర్తి ప్రొటోకాల్స్‌ను పొందుపరిచింది. ‘‘రాష్ట్రపతి పాల్గొనే కార్యక్రమాలు, త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించే సందర్భాలు, గవర్నర్‌ ప్రసంగాల వంటి పలు కీలక ప్రభుత్వ కార్యక్రమాల్లో కచ్చితంగా జాతీయగేయం వందేమాతరంను మూడు నిమిషాల 10 సెకన్లలో పూర్తిగా ఆరు చరణాలను ఆలపించాలి. 

మృదంగనాదం మొదలైన తర్వాత వందేమాతర ఆలాపన ఆరంభంకావాలి. కొన్ని కార్యక్రమాల్లో జాతీయ గేయం, జాతీయగీతం రెండూ పాడాల్సి వస్తే తొలుత జాతీయగేయమైన వందేమాతరం ఆలపించాలి. వందేమాతరం ఆలపించేటప్పుడు అందరూ కచ్చితంగా నిలబడాలి. ఎక్కడ జాతీయగేయాన్ని ఆలపిస్తున్నా, రికార్డింగ్‌ను ప్లే చేస్తున్నా అక్కడి ప్రేక్షకులంతా నిలబడాలి. 

అయితే సినిమా వంటి న్యూస్‌రీల్‌ లేదా డాక్యుమెంటరీని ప్లే చేసేటప్పుడు జనం పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి హఠాత్తుగా అందరూ నిల్చుని పాడాలంటే ఎగ్జిబిషన్‌/సినిమా హాల్‌లో కొంత గందరగోళం తలెత్తే ఆస్కారముంది. అందుకే ఈ చోట్లలో మాత్రం నిలబడటం తప్పనిసరేం కాదు. పాఠశాలల్లో మాత్రం రోజూ దినచర్యను తప్పకుండా జాతీయగేయంతోనే ఆరంభించాలి’’అని కేంద్ర హోంశాఖ తన ఉత్తర్వులో పేర్కొంది. మోదీ సర్కార్‌ 150వ వందేమాతర వార్షికోత్సవాలను జరుపుతున్న వేళ ఈ ఉత్తర్వులు వెలువడటం గమనార్హం. 

ముద్రిత చరణాలను పంచండి 
‘‘ఆడిటోరియం వంటి ఎన్‌క్లోజర్‌ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో జనం ఒకేసారి జాతీయగేయం పాడే సందర్భాల్లో ఒకే గొంతుకగా వందేమాతరం వినిపించేందుకు వీలుగా పబ్లిక్‌ ఆడిషన్‌ సిస్టమ్‌లో ప్లే చేయాలి. లేదంటే ఒక శ్రుతిలో అందరూ పాడేందుకు వీలుగా ప్రింట్‌ చేసిన చరణాలను అందరికీ అందజేయాలి. మంత్రులు పాల్గొనే అధికార కార్యక్రమాల్లో కుదిరితే వందేమాతరం ఆలపించొచ్చు. అన్ని పాఠశాలల్లో మాత్రం పనిదినాలను విద్యార్థులంతా కలిసి జాతీయగేయం పాడి మొదలెడితే సముచితంగా ఉంటుంది. 

జాతీయ గేయం, జాతీయగీతం, భరతమాత, జాతీయపతాకాలపై విద్యార్థుల్లో గౌరవం పెరిగేలా పాఠశాల యాజమాన్యాలు తగు నిర్ణయాలు తీసుకోవచ్చు’’అని కేంద్రం పేర్కొంది. అయితే జాతీయ చిహ్నం, జాతీయ గేయం, జాతీయ గీతం, రాజ్యాంగాలను బహిరంగంగా కించపరిచే వాళ్లను శిక్షించేందుకు అమలుచేసే ‘ది ప్రివెన్షన్‌ ఆఫ్‌ ఇన్సల్ట్స్‌ టు నేషనల్‌ హానర్స్‌ యాక్ట్‌’ను జాతీయగేయంకు ఆపాదించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఎవరైనా జాతీయగేయాన్ని కించపరిచినా, అవమానకరంగా మాట్లాడినా గరిష్టంగా మూడేళ్ల కారాగారశిక్ష పడే ఆస్కారముంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement