భారత్.. జనవరి 26న 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈసారి ప్రధాన కవాతు థీమ్ వందేమాతరం. 'స్వాతంత్ర్య మంత్రం -వందేమాతరం, శ్రేయస్సు మంత్రం - ఆత్మనిర్భర్ భారత్' అనే ఇతివృత్తం ఆధారంగా కర్తవ్య పథ్‌లో 30 శకటాలను ప్రదర్శించనున్నారు. ప్రధాన వేదికపై పూలతో వందేమాతరం రచయిత బంకిం చంద్ర ఛటర్జీకి నివాళులర్పిస్తారు.
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొంటారు. కవాతులో తొలిసారిగా బాక్ట్రియన్ ఒంటె, కొత్త బెటాలియన్ భైరవ్ కూడా మార్చ్ పాస్ట్ చేయనున్నారు. అయితే ఈసారి ఫ్లైపాస్ట్లో రాఫెల్, ఎస్యూ-30, అపాచీ వంటి 29 విమానాలు ఉన్నాయి. అయితే, ఈసారి తేజస్ యుద్ధ విమానం పరేడ్‌లో ఉండదు.
ఈసారి పరేడ్‌లో కొత్తగా ఏమున్నాయంటే?
👉ఆహ్వాన పత్రికలపై వందేమాతరం 150 ఏళ్ల లోగో ఉంటుంది. పరేడ్ ముగిశాక వందేమాతరం బ్యానర్లతో కూడిన బెలూన్లను గాల్లోకి వదులుతారు
👉పాత పద్ధతికి భిన్నంగా వివిఐపీ లేబుళ్లకు బదులుగా, ఎన్‌క్లోజర్లకు భారతీయ నదుల పేర్లు పెట్టారు
👉మొదటిసారిగా ఆర్మీకి చెందిన రిమౌంట్ అండ్ వెటర్నరీ వింగ్ జంతువులు పాల్గొంటాయి. ఇందులో రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు జాస్కరీ గుర్రాలు, నాలుగు వేట పక్షులు, 10 మిలిటరీ డాగ్స్ ఉంటాయి.
👉అక్టోబర్ 2025లో ఏర్పాటు చేసిన 'భైరవ లైట్ కమాండో బెటాలియన్' మొదటిసారి పరేడ్‌లో పాల్గొంటుంది. ఇది ఇన్ఫాంట్రీ, స్పెషల్ ఫోర్సెస్ మధ్య వారధిగా పనిచేస్తుంది.
👉జనవరి 29న జరిగే బీటింగ్ రిట్రీట్ వేదికపై ఎన్‌క్లోజర్లకు భారతీయ వాయిద్యాల (ఫ్లూట్, డమరుకం, వీణ, తబలా మొదలైనవి) పేర్లు పెట్టనున్నారు
👉రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 17, కేంద్ర మంత్రిత్వ శాఖల నుండి 13 శకటాలు ప్రదర్శిస్తారు
👉బ్రహ్మోస్, ఆకాష్ మిసైల్ సిస్టమ్, అడ్వాన్స్‌డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్, ధనుష్ గన్‌లు, డ్రోన్‌ల ప్రదర్శన ఉంటుంది
👉సైనికులు యుద్ధ క్షేత్రంలో ఏ విధంగా ముందుకు సాగుతారో అదే తరహాలో (Battle Gear) ధరించి కర్తవ్య పథ్‌పై మార్చ్ చేస్తారు
👉దాదాపు 2,500 మంది కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తారు
భైరవ బెటాలియన్ అంటే..
ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారతీయ సైన్యపు కొత్త విభాగం. 2025లో సరిహద్దుల రక్షణ కోసం రుద్ర బ్రిగేడ్, దివ్యాస్త్ర బ్యాటరీ, భైరవ బెటాలియన్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి బెటాలియన్‌లో సుమారు 250 మంది సైనికులు ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి 15 బెటాలియన్లు సిద్ధంగా ఉన్నాయి. వీరిని రాజస్థాన్, జమ్మూ, లడఖ్ మరియు ఈశాన్య భారత ప్రాంతాల్లో మోహరించారు.
రిహార్సల్స్ కారణంగా జనవరి 17, 19, 20, 21 తేదీల్లో ఉదయం 10:15 నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఢిల్లీలోని విజయ్ చౌక్ నుండి ఇండియా గేట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాష్ట్రపతి భవన్ (సర్క్యూట్ 1) జనవరి 21 నుండి 29 వరకు ప్రజలను అనుమతించరు.


