ధార్: మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలోగల వివాదాస్పద భోజ్‌శాల ఆలయం-కమల్ మౌలా మసీదు సముదాయంలో ప్రార్థనల విషయమై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే శుక్రవారం(జనవరి 23) వసంత పంచమి పర్వదినం కావడం, అదే రోజున ముస్లిం సోదరుల జుమ్మా ప్రార్థనలు ఉండటంతో ఇరు వర్గాలకు అనుమతినిస్తూ, సర్వోన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో హిందువులు, ముస్లింలు ఎవరి సంప్రదాయాల ప్రకారం వారు ప్రార్థనలు చేసుకునేందుకు మార్గం సుగమమైంది.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వసంత పంచమి నాడు భోజ్‌శాల ఆలయంలో హిందువులు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అదే సమయంలో కమల్ మౌలా మసీదు సముదాయంలో ముస్లింలకు మధ్యాహ్నం 1 గంట నుండి 3 గంటల వరకు శుక్రవారపు ప్రార్థనలు (నమాజ్) చేసుకునేందుకు అనుమతి లభించింది. అయితే, నమాజ్ కోసం వచ్చే వారి సంఖ్యను ముందుగానే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన శాంతిభద్రతలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
‘హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్’ (హెచ్‌ఎఫ్‌జే) అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తన వాదనలో 2003 నాటి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఉత్తర్వులలో వసంత పంచమి శుక్రవారం వచ్చినప్పుడు అనుసరించాల్సిన విధానంపై స్పష్టత లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 23న కేవలం హిందువులకు మాత్రమే అక్కడ రోజంతా పూజలు చేసుకునే ప్రత్యేక హక్కు కల్పించాలని వారు కోర్టును అభ్యర్థించారు.
2003లో ఏఎస్ఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, భోజ్‌శాల సముదాయంలో ప్రతి మంగళవారం హిందువులకు, ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుండి 3 గంటల వరకు ముస్లింలకు ప్రార్థనలు చేసుకునే అనుమతి ఉంది. అలాగే వసంత పంచమి నాడు హిందువులకు పూజలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, వసంత పంచమి వేడుక శుక్రవారమే వచ్చినప్పుడు ఇరు వర్గాల ప్రార్థనలకు సంబంధించి పాత ఉత్తర్వుల్లో స్పష్టత లేకపోవడంతో, తాజాగా వెలువడిన సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది కూడా చదవండి: karnataka: అసెంబ్లీలో హైడ్రామా.. మధ్యలోనే వెళ్లిపోయిన గవర్నర్


