బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నేడు (గురువారం) ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని పూర్తిగా చదవకుండానే నిష్క్రమించారు. కేవలం రెండు లైన్లు మాత్రమే చదివి, తన ప్రసంగాన్ని ముగించడం సభలో తీవ్ర కలకలం రేపింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA)నకు సంబంధించిన వివాదాస్పద చట్టంపై ప్రభుత్వం ప్రస్తావించిన కొన్ని పేరాలపై గవర్నర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రచారంలో భాగంగా ఉన్నాయంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ ఘటన బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పెరుగుతున్న అగాధానికి అద్దం పడుతోంది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన మరుసటి రోజే కర్ణాటకలో ఈ తరహా ఘటన జరగడం గమనార్హం. అంతకుముందు కేరళ గవర్నర్ కూడా తన ప్రసంగంలోని కొన్ని భాగాలను చదవకుండా వదిలేశారు.
#WATCH | Bengaluru | Karnataka Governor Thawarchand Gehlot walks out of the Karnataka Legislative Assembly; Congress leader BK Hariprasad seen trying to stop the Governor pic.twitter.com/QZjWSlZJgx
— ANI (@ANI) January 22, 2026
కర్ణాటక ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వ విధానాలలోని దాదాపు 11 పేరాలను తొలగించాలని గవర్నర్ గెహ్లాట్ ముందే సూచించారు. అయితే, ప్రభుత్వం వాటిని మార్చకపోవడంతో ఈ ప్రతిష్టంభన నెలకొంది. కాగా గవర్నర్ తీరుపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగాన్ని చదవకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 మరియు 163 ఉల్లంఘన అని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా నిర్వర్తించాల్సిన బాధ్యతను గవర్నర్ విస్మరించారని, దీనిపై నిరసన తెలపడంతో పాటు సుప్రీం కోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని సీఎం తెలిపారు.


