రాహుల్ ‘అమ్మేశారు’విమర్శలపై రిజిజు
విపక్ష నేతవి పచ్చి అబద్ధాలంటూ ధ్వజం
రికార్డుల నుంచి తొలగించాలని కోరతామని వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించి బుధవారం లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. ‘‘భరతమాతను ఎవరూ విక్రయించలేరు. ఆ ఆలోచన కూడా ఎవరూ చేయలేరు. అలా మన దేశాన్ని అమ్మేయగల, కొనగల వాడెవడూ ఇంకా పుట్టలేదు’’అంటూ రాహుల్ వ్యాఖ్యలను సభలోనే తిప్పికొట్టారు.
దేశం ఇప్పటిదాకా చూసిన అత్యంత బలమైన ప్రధాని మోదీయేనని మంత్రి పేర్కొన్నారు. నిండు సభలో అబద్ధాలు చెప్పడం, వాటిపై సంబంధిత మంత్రి సమాధానం కూడా వినకుండా ని్రష్కమించడం రాహుల్‌కు అలవాటేనని మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘రాహుల్ ఏ ప్రపంచంలో విహరిస్తుంటారో తెలియదు! విపక్ష నేతకు ఉండాల్సిన సీరియస్‌నెస్ ఆయనలో ఇసుమంతైనా లేదు.
బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బదులిస్తున్నప్పుడు సభలో ఉండాల్సిందిగా సూచించినా ఆగకుండా వెళ్లిపోయారు. ఒక సభ్యుడు తన ప్రసంగం పూర్తవగానే సభ నుంచి నిష్క్రమించడం నిబంధనలకు విరుద్ధం’’అని దుయ్యబట్టారు. అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో రిజిజు మీడియాతో కూడా మాట్లాడారు. విపక్ష నేత ప్రసంగం పూర్తిగా అబద్ధాలమయమంటూ దుయ్యబట్టారు. వాటిని రికార్డుల నుంచి తొలగించాల్సిందిగా స్పీకర్‌ను కోరతామని పేర్కొన్నారు. అంతేగాక సభలో చేసిన వ్యాఖ్యలను రాహుల్ ధ్రువీకరించాలంటూ నోటీసిస్తామని కూడా చెప్పారు.
ఆర్మీ మాజీ చీఫ్ ఎం.ఎం.నరవణె పుస్తకంలోని అంశాలను సభలో ప్రస్తావిస్తానని రాహుల్ పట్టుబట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘‘ప్రధాని, రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్ నడుమ జరిగే సంభాషణలను బహిరంగంగా చర్చించడం నిషిద్ధం. అలా చేస్తే దేశ భద్రత పరిస్థితేమిటి? ఇలాంటి సున్నితమైన అంశంపై రాహుల్ చిన్నపిల్లాడిలా ప్రవర్తించారు. దాన్ని రాజకీయ మైలేజీ కోసం వాడుకోజూశారు. దీన్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. తాను ఎంపీనని, దేశ ప్రజల పట్ల తనకు నిర్దిష్ట బాధ్యతలున్నాయని ఆయన గుర్తుంచుకుంటే మంచిది’’అన్నారు. దేశాన్ని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుందని రిజిజు మండిపడ్డారు.
స్పీకర్‌తో దుర్భాషలు
20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాను ఆయన చాంబర్లోనే తీవ్ర పదజాలంతో దుర్భాషలాడారని రిజిజు ఆరోపించారు. కె.సి.వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ వాద్రా వంటి సీనియర్ నేతలు వాళ్లను వారించకపోగా మరింతగా ప్రోత్సహించారని ఆక్షేపించారు. ‘‘ఆ సమయంలో నేనూ అక్కడే ఉన్నా. బిర్లాపై కాంగ్రెస్ ఎంపీలు ఎలాంటి దారుణమైన పదాలు వాడారో చెప్పలేను! దాంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సహృదయుడు కాట్టి ఊరుకున్నారు గానీ లేదంటే వారిపై కఠిన చర్య తీసుకునేవారే’’అని చెప్పారు.
#WATCH | Delhi: Union Parliamentary Affairs Minister Kiren Rijiju says, "... At least 20-25 Congress MPs entered the Lok Sabha Speaker's chamber and abused him. I was also there. The Speaker is a very soft person, otherwise strict actions would have been taken. Senior Congress… pic.twitter.com/4SQ8eGEZ3X
— ANI (@ANI) February 11, 2026


