పార్లమెంట్ ఉభయసభల్లో చర్చలపై పార్టీ ఎంపీలతో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: వందేమాతరం, ఎన్నికల సంస్కరణలపై ఉభయ సభల్లో ఇటీవల జరిగిన చర్చల సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వ వాదనల్లో పస లేదని నిరూపించామని రాహుల్ గాంధీ తెలిపారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత కూడా అయిన రాహుల్ శుక్రవారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి ఎదురైన దాడితో ప్రభుత్వం ఒత్తిడికి గురైన ట్లుగా కనిపించిందన్నారు. ‘వందేమాతరం, ఎస్‌ఐఆర్ అంశాలపై ఉభయసభల్లో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి.
ఆ రెండు చర్చలలోనూ, మేము ప్రభుత్వ వాదనలను తిప్పికొట్టినందుకు సంతోషంగా ఉంది. ఎస్‌ఐఆర్ చర్చ సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలవర పడ్డారని, పార్లమెంటులో దుర్భాషను కూడా ఉపయోగించారు’అని ఎంపీలతో భేటీ అనంతరం రాహుల్ మీడియాతో అన్నారు. ఓటు చోరీ అంశంపై ప్రభుత్వానికి ప్రమేయం ఉందన్న విషయం యావత్ దేశానికే తెలుసన్నారు. ఇండిగో సంక్షోభం, వాయు కాలుష్యం, కార్మిక చట్టాలు వంటి ప్రజా సమస్యలను ప్రస్తావించడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందన్నారు.


