ఛత్తీస్‌గఢ్: మరో 10 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సుక్మా పోలీసుల ఎదుట లొంగిపోయిన వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మావోయిస్టులపై రూ.33 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 263 మంది మావోయిస్టులు హింసను విడిచిపెట్టారని పోలీసు అధికారులు తెలిపారు. పూనా మార్గెం పునరావాస, సామాజిక సమ్మిళితం కార్యక్రమంలో భాగంగా మావోయిస్టులు లొంగిపోయారని అధికారులు వెల్లడించారు.
లొంగిపోయిన మావోయిస్టులు ఏకే-47 తుపాకీ, రెండు సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్(SLRs), ఒక స్టెన్‌గన్, ఒక బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ (BGL)ను అప్పగించారు. గత 11 నెలల్లో కనీసం 1,514 మంది మావోయిస్టులు బస్తర్ ప్రాంతంలో ఆయుధాలను వదిలేశారని బస్తర్ ఐజీ సుందరరాజ్ పట్టీలింగం తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 2,400 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
కాగా, ఈ నెల (డిసెంబర్ 8)న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్‌లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు.


