ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ కోర్టుకు ఎక్కింది. విమాన ఇంజిన్లు, విదేశీ మరమ్మతుల తర్వాత తిరిగి దిగుమతి చేసుకున్న విడిభాగాలపై చెల్లించిన రూ .900 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఆన్లైన్ లీగల్ సమాచార పోర్టల్ బార్ & బెంచ్ కథనం ప్రకారం.. జస్టిస్ ప్రతిభా ఎం సింగ్, జస్టిస్ శైల్ జైన్ లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ కేసును విచారించింది. అయితే, తన కుమారుడు ఇండిగోలో పైలట్ గా పనిచేస్తున్నాడని పేర్కొంటూ జస్టిస్ జైన్ ఈ కేసు నుండి వైదొలిగారు. ఈ విషయాన్ని ఇప్పుడు వేరే ధర్మాసనం ముందు ఉంచనున్నట్లు నివేదిక తెలిపింది.
ఇండిగో వాదన ఇదీ..
మరమ్మతుల తర్వాత తిరిగి చేసుకునే దిగుమతులను సర్వీస్గా పరిగణించాలే తప్ప తాజా వస్తువుల దిగుమతిగా కాదు.. అనేది ఇండిగో వాదన. తదనుగుణంగానే పన్ను విధించాలని ఈ ఎయిరలైన్స్ కోరుతోంది. సంక్షిప్త విచారణ సందర్భంగా, ఇండిగో తరపున సీనియర్ న్యాయవాది వి.లక్ష్మీకుమారన్.. కస్టమ్స్ సుంకం రాజ్యాంగ విరుద్ధమని, అదే లావాదేవీపై "డబుల్ లెవీ" అని వాదించారు.
ఇండిగో ఇప్పటికే పునర్-దిగుమతి చేసుకునే సమయంలోనే ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని చెల్లించిందని, మరమ్మతులను సర్వీసుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఆ మేరకు రివర్స్ ఛార్జ్ మెకానిజం కింద విడిగా జీఎస్టీని చెల్లించిందని చెప్పారు. అయితే, కస్టమ్స్ అధికారులు పునర్-దిగుమతిని తాజాగా వస్తువుల దిగుమతిగా పరిగణించి మళ్లీ సుంకాన్ని డిమాండ్ చేశారని విన్నవించారు.
మరమ్మతు తర్వాత పునర్-దిగుమతులపై రెండుసార్లు సుంకం విధించలేరని కస్టమ్స్ ట్రిబ్యునల్ గతంలో తీర్పు ఇచ్చిందని విమానయాన సంస్థ తెలిపింది. అయితే, ట్రిబ్యునల్ తరువాత మినహాయింపు నోటిఫికేషన్ ను సవరించింది, అటువంటి మార్పులు భవిష్యత్తులో పనిచేస్తాయని స్పష్టం చేసింది. అదనపు లెవీని అనుమతించే నోటిఫికేషన్ లోని భాగాన్ని ట్రిబ్యునల్ కొట్టివేసిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని ఇండిగో కోర్టుకు తెలిపింది.
అదనపు సుంకం చెల్లించి తీరాల్సిందేనని కస్టమ్స్ అధికారులు బలవంతం చేశారని, అంత వరకూ విమానాన్ని నిరవధికంగా గ్రౌండ్ చేయనీయకపోవడంతో తప్పని పరిస్థితిలో 4,000 కంటే ఎక్కువ ఎంట్రీ బిల్లుల ద్వారా రూ.900 కోట్లకు పైగా డిపాజిట్ చేసినట్లు ఇండిగో వివరించింది.


