ప్రస్తుతం భారతదేశంలో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రిక్, సీఎన్జీల విషయాన్ని పక్కన పెడితే.. డీజిల్, పెట్రోల్ ఉత్పత్తి మనదేశంలో చాలా తక్కువ. దేశంలోని కార్లకు సరిపడా ఫ్యూయెల్ కావాలంటే.. ఇతర దేశాల నుంచి తప్పకుండా దిగుమతి చేసుకోవాల్సిందే. దీనికోసం లక్షల కోట్ల డబ్బు ఖర్చు చేయాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని.. దీనికి ప్రత్యామ్నాయ ఆలోచనలు చేశారు. ఈ ఆలోచనల్లో పుట్టుకొచ్చించిందే బ్లెండెడ్ ఇథనాల్.
భారతదేశంలో బ్లెండెడ్ ఇథనాల్ ప్రయోగం ఇప్పుడు వచ్చింది కాదు. 2001లోనే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్రం 5 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపి మహారాష్ట్ర & ఉత్తరప్రదేశ్‌లో వినియోగించడం ప్రారంభించారు. ఆ తరువాత 2002లో ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌ను ఇంకొన్ని రాష్ట్రాల్లో కూడా ఉపయోగించడం ప్రారంభించారు. 2019లో E10, 2022 డిసెంబర్ 15న E20 (20 శాతం ఇథనాల్ - 80 శాతం పెట్రోల్)ను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రవేశపెట్టారు.

పెట్రోల్ వినియోగాన్ని కొంత వరకు తగ్గించడానికి.. ఈ ప్రయోగం సరైనదే అయినప్పటికీ, కొంతమంది వినియోగదారుల్లో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. కానీ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మాత్రం.. ఇథనాల్ వినియోగం వల్ల సమస్యలు లేవని, దీనివల్ల పెట్రోల్ దిగుమతి తగ్గిందని.. తద్వారా రూ. 1.40 లక్షల కోట్లు అదా అయిందని లోక్‌సభలో వెల్లడించారు. నిపుణులు కూడా ఇథనాల్ వినియోగం వల్ల లాభాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇథనాల్ వినియోగం వల్ల నిజంగా లాభాలు ఉన్నాయా?, వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలు ఉన్నాయా?.. అనేది ఇక్కడ వివరంగా పరిశీలిస్తే..
నిపుణులు చెబుతున్న ఉపయోగాలు
కాలుష్యం తక్కువ: పెట్రోల్ వినియోగించినప్పుడు వెలువడే.. కాలుష్య కారకాల కంటే ఇథనాల్ ఉపయోగించడం వల్ల వెలువడే పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. కార్బన్ డై ఆక్సైడ్, హైడ్రోకార్బన్లు వంటి ఇతర హానికర కారకాల విడుదల కొంత తక్కువగా ఉంటుంది. గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు కూడా కొంత తగ్గుతాయి
ఖర్చు తక్కువ: పెట్రోల్ ధరతో పోలిస్తే.. ఇథనాల్ ధర కొంత తక్కువే. దీనివల్ల డబ్బు కొంత ఆదా చేసుకోవచ్చు.

ఇంజిన్ పనితీరు: కొంతమంది E10/E20 వంటి ఇథనాల్ మిశ్రమాలు ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.
చమురు దిగుమతులను తగ్గిస్తుంది: భారతదేశం సుమారు 85 శాతం డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకుంటుంది. ఇథనాల్ స్థానికంగా తయారవుతుంది, కాబట్టి ఫ్యూయెల్ దిగుమతి కొంతవరకు తగ్గించుకోవచ్చు. తద్వారా ఖర్చు తగ్గుతుంది. ఇది పునరుత్పత్తి అయ్యే ఇంధనం కాబట్టి.. భవిష్యత్తులో ఇంధన సంక్షోభం వచ్చే అవకాశం లేదు.
వాహన వినియోగదారులు చెప్పినట్లు నష్టాలు
మైలేజ్: ఇథనాల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందనేది వాహనదారులు చెబుతున్న ప్రధాన అంశం. ఇది పెట్రోల్ కంటే కూడా 30 శాతం తక్కువ ఎనర్జీ ఉత్పత్తి చేయడమే కాకుండా.. మైలేజ్ 4 శాతం నుంచి 5 శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. రోజువారీ వినియోగదారుడికి ఇది ప్రధానమైన నష్టం.

వాహనాల్లో సమస్యలు: 2005 కన్నా పాత కార్లు, బైకులకు ఇథనాల్ సరిపడకపోవచ్చు. దీనివల్ల రబ్బరు హోస్‌లు, ఫ్యూయల్ పంపులు, ఇతర వాహన భాగాలు దెబ్బతింటాయి. దీనివల్ల ఫ్యూయెల్ లీక్స్, ఇంజిన్ స్టార్టింగ్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా.. ఇథనాల్ వల్ల ఇంధన ట్యాంక్‌లో తేమ పెరగడం, ఫ్యూయల్ సిస్టమ్‌లో తుప్పు పెరగడం వంటివి జరుగుతాయి.
చివరగా..
ఇథనాల్ వినియోగం వల్ల.. వచ్చే నష్టాల కంటే, లాభాలే ఎక్కువ. అయితే వాహనదారులు చెప్పిన సమస్యలు కూడా వచ్చే అవకాశం లేదని గడ్కరీ పేర్కొన్నారు. ఒకవేళా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఇథనాల్ ఉపయోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ మాత్రమే కాకుండా.. బ్రెజిల్, అమెరికా, చైనా, పోలాండ్, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన దాదాపు 70 కంటే ఎక్కువ దేశాలు ఉన్నాయి.


