ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. భారతీయ-అమెరికన్ అయిన ఆయన మైక్రోసాఫ్ట్‌లో అంచెలంచెలుగా ఎదిగి ఆ సంస్థకు ఈసీవో అయ్యారు. అపారమైన తన శక్తి సామర్థ్యాలతో కంపెనీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు.
ప్రతి మనిషికీ వృత్తితోపాటు ఓ వ్యాపకమూ ఉంటుంది. ‘మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాల’ అంటాడు ఓ సినిమాలో విలన్ రావు గోపాలరావు. కానీ ఈ దిగ్గజ టెక్ సీఈవోది ‘క్రీడా పోషణ’. క్రీడాకారుడు కాకపోయినా క్రికెట్ ఆటను విశ్లేషించే మొబైల్ యాప్ ఒకదానిని సత్య నాదెళ్ల రూపొందించారు. అంతేకాదు.. కాస్త సమయం దొరికినప్పుడల్లా కోడ్ రాస్తుంటారాయన. అది ఆయనకో సరదా...
ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. బెంగుళూరులో జరిగిన మైక్రోసాఫ్ట్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. థాంక్స్ గివింగ్ సందర్భంగా తాను చిన్నప్పటి నుండి ఇష్టపడే క్రీడ క్రికెట్ ను విశ్లేషించడానికి ఇంటి వద్ద తాను స్వయంగా డీప్ రీసెర్చ్ ఏఐ యాప్‌ను తయారు చేసినట్లు చెప్పుకొచ్చారు.
సత్య నాదెళ్ల ఈ వారం భారత్ వస్తున్నారు. ఇక్కడి వ్యాపార, రాజకీయ ప్రముఖులను కలుసుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ ఇటీవలె భారత్‌లో రాబోయే నాలుగేళ్లలో ఏఐ, క్లౌడ్ రంగాల్లో 17.5 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.


