అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారతదేశంలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపడం దేశ డిజిటల్ విప్లవంలో ఒక కీలక ఘట్టం. ఇంటర్నెట్, క్లౌడ్ సేవలు, కృత్రిమ మేధస్సు (AI), ఆన్‌లైన్ చెల్లింపులు (UPI), ఈ-కామర్స్ వంటి ఆధునిక డిజిటల్ సేవలకు డేటా సెంటర్లు మూలస్తంభాలు. భారతదేశంలో ప్రస్తుతం డేటా సెంటర్ల సంఖ్య ప్రపంచంలోని వాటితో పోలిస్తే అతి తక్కువగా (కేవలం 3% వాటా) ఉన్నప్పటికీ 2030 నాటికి వీటి సామర్థ్యం పెరుగుతుందని అంచనా. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి కొన్ని కీలకమైన పర్యావరణ, మౌలిక సదుపాయాల సవాళ్లను కూడా ముందుకు తెస్తోంది.
డేటా సెంటర్ల ఏర్పాటుతో లాభాలు
డేటా సెంటర్ల కోసం భారత్‌లోకి దాదాపు రూ.2.6 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. మల్టీనేషనల్ కంపెనీల నుంచి విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగి అనుబంధ రంగాలకు లబ్ధి చేకూరుతుంది. ఐటీ, నెట్‌వర్క్ నిర్వహణ, భద్రత, నిర్వహణ వంటి రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.
సప్లయ్ చైన్, రవాణా, హోటల్ వంటి సేవల రంగాలలో పరోక్ష ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ల అవసరాల కోసం ఫైబర్ కనెక్టివిటీ, విద్యుత్ సరఫరా వ్యవస్థలు మెరుగుపడతాయి. ఇది స్థానిక స్టార్టప్‌లు, చిన్న వ్యాపారాలకు మెరుగైన డిజిటల్ మౌలిక సదుపాయాలను అందించి, టెక్నాలజీ రంగంలో పురోగతికి దోహదపడుతుంది.డేటా స్థానికీకరణ ద్వారా భారతీయ డేటా భద్రత మెరుగుపడుతుంది.
సవాళ్లు లేవా..?
డేటా సెంటర్ల కోసం విద్యుత్, నీరు చాలా అవసరం. భారతదేశంలో ఇప్పటికే ఈ వనరుల లభ్యత, వినియోగంపై ఆందోళనలు ఉన్నాయి. డేటా సెంటర్లలో సర్వర్‌లు నిరంతరం పనిచేయడం వల్ల భారీగా వేడిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని చల్లబరచడానికి, సర్వర్‌లకు శక్తిని అందించడానికి అధిక విద్యుత్ అవసరం. భారతదేశం అధికంగా థర్మల్ విద్యుత్‌పై ఆధారపడుతున్నందున డేటా సెంటర్ల ఏర్పాటుతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.
పెద్ద డేటా సెంటర్‌లు పట్టణ విద్యుత్ సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెంచి విద్యుత్ కొరతకు దారి తీయవచ్చు. అయితే గూగుల్ వంటి కంపెనీలు తమ సెంటర్లకు పునరుత్పాదక శక్తి (Green Energy)వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం సానుకూల అంశం. అయితే, మొత్తం డిమాండ్‌ను థర్మల్ విద్యుత్ నుంచి పునరుత్పాదక ఇంధనానికి మార్చడం తక్షణ సవాలు. దీనికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపడేలా ప్రభుత్వాలు, కంపెనీలు చర్యలు తీసుకోవాలి.
నీటి నిర్వహణ
సర్వర్ల వేడిని తగ్గించడానికి శీతలీకరణ (Cooling) ప్రక్రియకు లక్షలాది లీటర్ల నీరు అవసరం. గూగుల్ వంటి సంస్థలు వార్షికంగా బిలియన్ల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నట్లు అంచనాలున్నాయి. ఇప్పటికే నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల స్థానిక ప్రజలకు, వ్యవసాయానికి నీటి లభ్యతపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. కంపెనీల నుంచి నీటి వినియోగంపై పారదర్శకత లేకపోవడం, నియంత్రణ సంస్థల నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడం ఈ సమస్యను మరింత పెంచుతుందని గుర్తుంచుకోవాలి.
సింగపూర్, అమెరికాలో వ్యతిరేకత
సింగపూర్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ దేశాల్లో డేటా సెంటర్ల విస్తరణను ప్రజలు, పర్యావరణవేత్తలు పరిమితం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు భారతదేశంలోని సమస్యల తరహాలోనే ఉన్నాయి. అధిక విద్యుత్ వినియోగం కోసం శిలాజ ఇంధనాలపై ఆధారపడినప్పుడు కార్బన్ ఉద్గారాలను పెంచుతుండడం. స్థానిక నీటి వనరులపై ఒత్తిడి పెంచి, ఇతర అవసరాలకు కొరత ఏర్పరచడం.
అంతా ఆటోమేషన్..
డేటా సెంటర్ల నిర్వహణ ఆటోమేటెడ్‌గా ఉంటుంది. దాంతో ఉద్యోగాలు ఎక్కువగా రాకపోవడం, ఆర్థిక ప్రయోజనం స్థానికులకు తక్కువగా ఉండటంతో ఇప్పటికే ఇవి ఉన్న ప్రాంతాల్లో వ్యతిరేకత నెలకొంటుంది. ఈ పరిణామాలను భారత్ నిశితంగా పరిశీలించి అందుకు తగిన విధంగా పాలసీను రూపొందించాలి. సాంకేతిక పురోగతికి డేటా సెంటర్లు అవసరమే అయినా, వనరుల స్థిరత్వం, పర్యావరణ భద్రత విషయంలో దీర్ఘకాలిక ప్రణాళిక చాలా అవసరం.
ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం


