దేశంలోని 31 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులకు కృత్రిమమేధ(ఏఐ) ప్రయోజనాలను అందించడానికి కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో కలిసి మైక్రోసాఫ్ట్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ-శ్రమ్, నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్‌సీఎస్) పోర్టల్‌ల్లో అత్యాధునిక ఏఐ చాట్‌బాట్‌లను విడుదల చేయనున్నట్లు తెలిపింది.
భారతదేశంలో కృత్రిమ మేధ(AI) ప్రభావాన్ని ఒక ప్రజా ఉద్యమంలా విస్తరించాలనే లక్ష్యంతో మైక్రోసాఫ్ట్ ప్రభుత్వంలో ఈమేరకు భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు చెప్పింది. ఇటీవల మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ అనంతరం మైక్రోసాఫ్ట్ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. 2026 నుంచి 2029 వరకు 17.5 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీని ద్వారా దేశంలో ఏఐ మౌలిక సదుపాయాలు, నైపుణ్యాల కల్పన, డేటాను బలోపేతం చేయనున్నట్లు చెప్పింది.
ఈ-శ్రమ్, ఎన్‌సీఎస్ పోర్టల్స్‌లో ఏఐ చాట్‌బాట్‌లు
ఇండియా ‘ఏఐ-ఫస్ట్ కంట్రీ’గా మారాలంటే ప్రతి ఒక్కరికీ దీని ప్రయోజనాలను అందించాలని సత్య నాదెళ్ల ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ‘ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేయడం నుంచి ఎన్‌సీఎస్‌లో మెరుగైన ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు రూపొందించడం వరకు ఏఐ సాయంతో కేంద్ర మంత్రిత్వ శాఖతో కలిసి పని చేయనున్నాం’ అని చెప్పారు.
ఈ చాట్‌బాట్‌లు కార్మికులకు తక్షణ సహాయం అందిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగాల సరిపోలికను మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. ఇవి మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్‌లో హోస్ట్ చేయబడి ప్రభుత్వ ప్లాట్‌ఫామ్ ‘భాషిణి’ని ఏకీకృతం చేస్తామని కంపెనీ చెప్పింది. దీనివల్ల 22 స్థానిక భాషల్లో రియల్-టైమ్ ట్రాన్స్‌లేషన్ అందుతుందని తెలిపింది. ఇది ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఈ-శ్రమ్‌లో నమోదు ప్రక్రియను సులభతరం చేస్తుందని చెప్పింది. ఈ పోర్టల్‌ల నుంచి సేకరించిన డేటా, భారతదేశం, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలతో కార్మికుల నైపుణ్యాలను సరిపోల్చడానికి కార్మిక విధానాలను రూపొందించడంలో ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని చెప్పింది.
ఇదీ చదవండి: 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాలు


