చాట్‌జీపీటీ తయారీదారు ఓపెన్‌ఏఐ(OpenAI)కు సంబంధించిన కొన్ని ఆర్థిక లావాదేవీల వివరాలు లీకయ్యాయి. ఈ పత్రాలు కంపెనీకి పెరుగుతున్న ఆదాయాలు, భారీ ఖర్చులను తెలియజేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దాంతోపాటు ఓపెన్‌ఏఐ తన పెట్టుబడిదారుగా ఉన్న టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో పంచుకుంటున్న ఆర్థిక లావాదేవీలు కూడా ఈ పత్రాల్లో దర్శనిమివ్వడం గమనార్హం.
మైక్రోసాఫ్ట్‌తో ఆదాయ భాగస్వామ్యం
ఈ పత్రాలను ఎవరు లీక్ చేశారు.. ఎలా చేశారనే వివరాలు తెలియరాలేదు. పేరు వెల్లడించని బాధ్యులను ఉటంకిస్తూ టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం, మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడి ఒప్పందంలో భాగంగా ఓపెన్‌ఏఐ తన మొత్తం ఆదాయంలో 20% మైక్రోసాఫ్ట్‌తో పంచుకుంటుంది. అయితే ఇది ఏకపక్షంగా లేదు. ఓపెన్‌ఏఐ సాంకేతికతపై ఆధారపడిన, మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్, అజూర్ సర్వీస్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను మైక్రోసాఫ్ట్ తిరిగి ఓపెన్‌ఏఐకి చెల్లిస్తుందని అదే వర్గాలు తెలిపాయి.
దాంతో నికర ఆదాయాన్ని అంచనా వేయడం కష్టంగా మారింది. ఈ అంతర్గత చెల్లింపులు నికరంగా ఆదాయ వాటాలు లెక్కించేందుకు ముందే జరుగుతుంటాయి. దీని వల్ల కంపెనీల మధ్య మొత్తం ఆదాయ వాటాలు ఎలా ఉన్నాయో నిర్ధారించడం సంక్లిష్టంగా మారుతుంది.
ఇదీ చదవండి: ఏడు పవర్‌ఫుల్ ఏఐ టూల్స్..


