వీటి ద్వారా దేశ రహస్యం బయటకు వెళుతోంది
వాడొద్దంటూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎలాంటి సమాచారం కావాలన్నా సెకన్లలో ఇచ్చే ఏఐ, చాట్ జీపీటీలు అత్యంత ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది. ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగిస్తున్న కారణంగా.. దేశానికి సంబంధించిన రహస్య సమాచారమంతా బయటకు వెళుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. కొందరు అధికారులు ఏఐ, చాట్‌జీపీటీ ద్వారా ప్రభుత్వానికి చెందిన సమాచారాన్ని మరింత ఎక్కువగా, చక్కగా తీర్చిదిద్దేందుకు ఈ రెండింటిలో షేర్ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
దీని కారణంగా మన దేశంలో ఏం జరుగుతోంది, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న పనులు, ఇతర కీలకమైన సమచారం అంతా ఏఐ, చాట్‌జీపీటీ పక్క దేశాలకు చేరుతున్నట్లు ఇటీవల రాజ్యసభలో వెల్లడించింది. ఇలా చేయడం ద్వారా దేశానికే ముప్పు ఉంటుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. వీటిని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరూ ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని ఈ రెండు వేదికల్లో షేర్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.


