ప్రయోగాత్మక పరీక్షలకు టెస్ట్‌బెడ్
బీవోఎఫ్‌ఏ నివేదిక
చాట్‌జీపీటీ, జెమినీ, పర్‌ప్లెక్సిటీలాంటి ప్లాట్‌ఫాంల వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎల్‌ఎల్‌ఎం (లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్) మార్కెట్‌గా భారత్ ఎదిగిందని బ్రోకరేజీ సంస్థ బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ ఒక నివేదికలో తెలిపింది. దీనితో స్వతంత్రంగా పనులను చక్కబెట్టగల ఏజెంటిక్ ఏఐ యాప్‌లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత్ టెస్ట్ బెడ్‌గా ఉపయోగపడగలదని పేర్కొంది. అయితే, దీనివల్ల దేశీయంగా స్టార్టప్ వ్యవస్థపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని బీవోఎఫ్‌ఏ సెక్యూరిటీస్ వివరించింది.
టెలికం సంస్థలు కాంప్లిమెంటరీగా సబ్‌స్క్రిప్షన్లను ఆఫర్ చేస్తుండటమనేది ఎల్‌ఎల్‌ఎం ఆధారిత యాప్‌ల వినియోగం పెరగడానికి ఒకానొక కారణంగా ఉంటోంది. అలాగే, నెలకు 2 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో 20 జీబీ డేటా ప్లాన్లు చౌకగా లభిస్తుండటం సైతం ఇందుకు దోహదపడుతోంది. నివేదిక ప్రకారం..
14.5 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో భారత్‌లో చాట్‌జీపీటీ అగ్రగామి ఎల్‌ఎల్‌ఎంగా నిలుస్తోంది. 10.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే సగటున 6.5 కోట్ల మంది భారతీయులు చాట్‌జీపీటీని ఉపయోగిస్తుండగా, 1.5 కోట్ల మంది యూజర్లతో జెమినీ రెండో ప్లేస్‌లో ఉంటోంది.
చాట్‌జీపీటీ యూజర్లలో 16 శాతం మంది భారతీయులు ఉన్నారు. తద్వారా సదరు ప్లాట్‌ఫాంనకు అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా భారత్ నిలుస్తోంది. దాని పోటీ సంస్థలకు కూడా భారత్ అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉండటం గమనార్హం. సగటున నెలవారీ గూగుల్ జెమినీ యూజర్లలో 30 శాతం మంది, పర్‌ప్లెక్సిటీ యూజర్లలో 38 శాతం మంది భారత్ నుంచే ఉంటున్నారు.
జూలైలో చాట్‌జీపీటీ డౌన్‌లోడ్స్ 2.4 కోట్ల గరిష్ట స్థాయికి చేరాయి. ఎయిర్‌టెల్ బండిల్డ్ ప్యాకేజ్ దన్నుతో అక్టోబర్‌లో పర్‌ప్లెక్సిటీ డౌన్‌లోడ్స్ 2 కోట్ల గరిష్ట స్థాయిని తాకాయి.
ఎల్‌ఎల్‌ఎం యాప్‌ల వినియోగం అందరికీ ప్రయోజనకరంగా ఉంటోంది. ప్రాంతీయ భాషల్లోనూ ఇవి అందుబాటులో ఉండటంతో వినియోగదారులు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు, భాషపరమైన పరిమితులను అధిగమించి కొత్త విషయాలను నేర్చుకునేందుకు ఉపయోగకరంగా ఉంటోంది. అటు తమ మోడల్స్‌ను మరింత మెరుగుపర్చుకునేందుకు కావల్సిన డేటా ఎల్‌ఎల్‌ఎంలకు లభిస్తోంది. ఇక టెల్కోల విషయం తీసుకుంటే తీవ్రమైన పోటీ ఉండే రంగంలో.. వీటిని ఆఫర్ చేయడం ద్వారా యూజర్లపై వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకునేందుకు వీలవుతోంది.
స్థానిక ఎల్‌ఎల్‌ఎంలు భారీ స్థాయికి ఎదిగేంత వరకు దేశీ స్టార్టప్‌లపై గ్లోబల్ ఎల్‌ఎల్‌ఎంల ప్రభావం కొనసాగుతుంది. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లాంటి ఉత్పత్తుల ద్వారా మెటా, గూగుల్‌లాంటి దిగ్గజాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించవచ్చు.
ఇదీ చదవండి: మురిపిస్తున్న ముగింపు!


