జీడీపీ వృద్ధి 7.5 శాతం
కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అంచనా
ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో (2025–26) జీడీపీ 7.5 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని కేర్ ఎడ్జ్ రేటింగ్స్ అంచనా వేసింది. ‘బలమైన స్థూల, ఆర్థిక పరిస్థితులతో భారత్ ఆర్థిక వ్యవస్థ 2026–27లోకి అడుగుపెడుతోంది. వెలుపలి అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2026–27లోనూ రికార్డు స్థాయిలో 7 శాతం వృద్ధిని సాధించొచ్చు’ అని కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త రజనీ సిన్హా పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉండడం, వడ్డీ రేట్లు దిగిరావడం, పన్నుల భారం తగ్గడం వృద్ధికి మద్దతునిస్తాయన్నారు. యూఎస్–భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే వృద్ధికి అది మరింత ప్రేరణనిస్తుందన్నారు. డాలర్‌తో రూపాయి విలువ 91 స్థాయికి పడిపోగా.. 2026–27 నాటికి 89–90 స్థాయికి పుంజుకుంటుందని కేర్ ఎడ్జ్ అంచనా వేసింది. మూలధన నిధుల వ్యయ చక్రం కోలుకుంటుందన్న దానికి ఆరంభ సంకేతాలు కనిపిస్తున్నాయంటూ.. క్యాపిటల్ గూడ్స్ కంపెనీల బలమైన ఆర్డర్లను నిదర్శనాలుగా పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) బలంగా ఉండడాన్ని ప్రస్తావించింది. కొత్త కార్మిక చట్టం దేశ, విదేశీ ఇన్వెస్టర్లకు మరింత నమ్మకాన్నిస్తుందని అభిప్రాయపడింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వృద్ధి రేటు బలంగా నమోదైనప్పటికీ, ద్వితీయ ఆరు నెలల్లో 7 శాతానికి పరిమితం కావొచ్చని.. పూర్తి ఆర్థిక సంతవ్సరానికి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా టారిఫ్‌లు భారత రత్నాభరణాలు, టెక్స్‌టైల్స్ ఎగుమతులపై ప్రభావం చూపించాయని.. అదే సమయంలో హాంగ్‌కాంగ్, యూఏఈకి వీటి ఎగుమతులు పెరిగినట్టు తెలిపింది. ఎగుమతుల్లో మారిన ఈ వైవిధ్యాన్ని ఇక ముందు ఎలా ఉంటుందో పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. కరెంట్ ఖాతా లోటు జీడీపీలో ఒక శాతానికి పరిమితం అవుతుందని, ద్రవ్యలోటును 2026– 27లో 4.4 శాతానికి, తదుపరి ఆర్థిక సంత్సరంలో మరో 0.2% తక్కువకు ప్రభు త్వం కట్టడి చేస్తుందని అంచనా వేసింది.
భారత్ వృద్ధి 7 శాతం: గీతా గోపీనాథ్
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్తిక సంవత్సరంలో 7 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ మాజీ ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ అభిపఆరయపడ్డారు. ఐఎంఎఫ్ అంచనా 6.6 శాతం అన్నది భారత జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వివరాలు వెల్లడికి ముందు వేసిన అంచనాగా పేర్కొన్నారు. భారత్ వచ్చే 20 ఏళ్ల పాటు 8 శాతం వృద్ధిని కొనసాగిస్తే, వికసిత్ భారత్ లక్ష్యాన్ని 2047 కంటే ముందే సాధించొచ్చన్నారు. ఇందుకు వీలుగా సంస్కరణలను నిలకడగా చేపట్టాల్సి ఉంటుందన్నారు. అమెరికా–భారత్ వాణిజ్య సంక్షోభానికి ముందు అంచనా వేసిన దానికంటే మెరుగ్గానే భారత్ పనితీరు చూపిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో చాట్‌జీపీటీ, పర్‌ప్లెక్సిటీ జోరు


