భారత కరెన్సీ రూపాయి విలువ రోజురోజుకీ బలహీనపడుతోంది.. డాలర్ మారకంలో భారత రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయికి చేరడంతో సామాన్య కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశాలపై ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా జీతాలు, ఈఎంఐలు (EMIs), రోజువారీ ఖర్చులు అన్నీ ఒకేసారి ఒత్తిడిలో పడుతున్నాయి.
ఈఎంఐలపై ప్రభావం ఇలా..
రూపాయి విలువ పడిపోతే లోన్లపై ప్రభావం రెండు విధాలుగా కనిపిస్తుంది.
విదేశీ కరెన్సీ లోన్లు
డాలర్లు లేదా ఇతర విదేశీ కరెన్సీలో లోన్ తీసుకున్నవారికి నేరుగా దెబ్బ పడుతుంది. ఉదాహరణకు డాలర్ ధర రూ.80 నుంచి రూ.90కి పెరిగితే, రీపేమెంట్ భారం సుమారు 12.5 శాతం పెరుగుతుంది.
దేశీయ లోన్లు
ఇక్కడ ప్రభావం పరోక్షంగా ఉంటుంది. రూపాయి బలహీనపడటంతో దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఫలితంగా ఇంధనం, మందులు, ఎలక్ట్రానిక్స్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీనిని నియంత్రించేందుకు ఆర్‌బీఐ వడ్డీ రేట్లు పెంచితే, ఫ్లోటింగ్ రేట్ లోన్ల ఈఎంఐలు పెరుగుతాయి.
ఉదాహరణకు మీరు రూ.50 లక్షల హోం లోన్ తీసుకున్నారనుకోండి.. 20 ఏళ్లు టెన్యూర్, 8% వడ్డీతో ప్రస్తుతం ఈఎంఐ సుమారు రూ.41,045 గా ఉంటే వడ్డీ రేటు 0.5% పెరిగితే ఈఎంఐ రూ.42,366కి చేరుతుంది. అంటే నెలకు రూ.1,321 అదనపు భారం. మొత్తం కాలంలో రూ.3.17 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్న మాట.
జీతాలపై రూపాయి ప్రభావం
రూపాయి పతనం వల్ల జీతాలు వెంటనే తగ్గవు కానీ సమస్య అక్కడే మొదలవుతుంది.
ప్రైవేట్ ఉద్యోగులకు
కంపెనీల ఖర్చులు పెరగడంతో ఇంక్రిమెంట్లు ఆలస్యం కావచ్చు.
కొత్త నియామకాలు తగ్గే అవకాశం
కొన్నిచోట్ల బోనసులు, వేరియబుల్ పే తగ్గవచ్చు
ఐటీ, ఎగుమతి రంగాలలోని డాలర్లలో ఆదాయం వచ్చే కంపెనీలకు కొంత లాభం ఉన్నా, ఆ ప్రయోజనం ఉద్యోగుల జీతాల పెంపులోకి వెంటనే రావడం కష్టం
ప్రభుత్వ ఉద్యోగులకు
జీతాలు స్థిరంగానే ఉన్నా, ద్రవ్యోల్బణం పెరగడం వల్ల జీతం విలువ తగ్గినట్లే అవుతుంది. డీఏ పెంపు ఆలస్యమైతే భారమవుతుంది.
రూపాయి పతనం అంటే కేవలం ఎగుమతులు–దిగుమతుల సమస్య కాదు. ఇది జీతం విలువను తగ్గించి, ఈఎంఐ భారం పెంచి, కుటుంబ బడ్జెట్‌ను కుదించే నిశ్చబ్ద దెబ్బ. నేరుగా అయినా, పరోక్షంగా అయినా సామాన్యుడిపై ప్రభావం తప్పదు.


