దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నగదు లావాదేవీలపై కఠినమైన కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఈ మార్పులు వ్యక్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ నిర్వహించే రోజువారీ నగదు ప్రవాహంపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.
కొత్త నిబంధనల ప్రకారం, లెక్కల్లో చూపని నగదుపై జరిమానాలు, సర్‌ఛార్జీలు, సెస్సులు కలిసి మొత్తం 84% వరకు పన్ను భారం పడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.
అహుజా పేర్కొన్నట్లుగా, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా స్వాధీనం సందర్భాల్లో వ్యక్తి వద్ద లెక్కలు లేని నగదు పట్టుబడితే ఈ అధిక పన్ను రేటు వర్తిస్తుంది. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త మార్పుల నేపథ్యంలో ఇటు వ్యక్తులతోపాటు వ్యాపార సంస్థలు నగదు వినియోగంపై మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
కొత్త నిబంధనలు ఇవే..
కొత్త నియమాల ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తాల నగదు లావాదేవీలను నిశితంగా పర్యవేక్షించనున్నాయి.
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి.
రూ. 20 లక్షలకు పైగా ఉపసంహరణ జరిగితే, బ్యాంకులు తక్షణమే టీడీఎస్ (TDS) కట్ చేస్తాయి.
తరచుగా పెద్ద మొత్తాల నగదు ఉపసంహరణలు జరిగితే, వాటి మూలం అనుమానాస్పదంగా కనిపిస్తే, ఆదాయపు పన్ను శాఖ సోదాలు లేదా జప్తు చర్యలు కూడా ప్రారంభించవచ్చు.
వీటికి 100% జరిమానా తప్పదు
కొన్ని ప్రత్యేక నగదు లావాదేవీలపై ఇకపై 100 శాతం జరిమానా వర్తించనుంది. అటువంటి లావాదేవీలు ఇవే..
స్థిరాస్తి విక్రయం సమయంలో రూ. 20,000 కంటే ఎక్కువ నగదు స్వీకరిస్తే, ఆ మొత్తంపైనే 100% జరిమానా ఉంటుంది.
ఒకే రోజులో ఒక కస్టమర్ నుండి రూ. 2 లక్షలకు పైగా నగదు అందుకుంటే ఆ మొత్తంపైనే జరిమానా విధిస్తారు.
వ్యక్తులు నగదు రూపంలో రుణాలు పొందడం ఇకపై పూర్తిగా నిషేధం. దీనిని ఉల్లంఘిస్తే రుణ మొత్తం అంతటిపై 100% జరిమానా పడుతుంది.
ఈ జాగ్రత్తలు అవసరం
ప్రభుత్వం కట్టుదిట్టమైన నగదు నియంత్రణ వ్యవస్థను నెలకొల్పుతున్న నేపథ్యంలో ఈ జాగ్రత్తలు అవసరం
పెద్ద మొత్తాల నగదు లావాదేవీలు తప్పకుండా బ్యాంకింగ్ ఛానళ్ల ద్వారా జరపాలి.
నగదు రసీదులు స్పష్టమైన ఆధారాలతో ఉండాలి.
అక్రమ, లెక్కల్లో లేని నగదు ఖచ్చితంగా గణనీయమైన పన్ను భారం, జరిమానాలు తెచ్చిపెడుతుంది.


