భారీ సంస్కరణలకు సంబంధించి తదుపరి అజెండాలో కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయడం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. వాటిని మరింత పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఆదాయ పన్ను రేట్లు, వస్తు..సేవల పన్నుల (జీఎస్‌టీ) క్రమబద్ధీకరణ తదితర సంస్కరణలను అమలు చేసినట్లు ఆమె వివరించారు. ఇక కస్టమ్స్ డ్యూటీ రేట్లను క్రమబదీ్ధకరించడంపై దృష్టి పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో దీనిపై ప్రకటనలు ఉండొచ్చని ఆమె వివరించారు. గత రెండేళ్లుగా కస్టమ్స్ సుంకాన్ని తాము గణనీయంగా తగ్గించామని తెలిపారు.
అంతర్జాతీయ వాణిజ్యంలో భారత పోటీతత్వాన్ని పెంచేందుకు కస్టమ్స్ విధానాల్లో ఆధునీకరణ అత్యవసరమైందని నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారని మంత్రి సూచించారు. సరుకుల క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయడం, పేపర్‌లెస్ విధానాలను మరింత విస్తరించడం, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరిచే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలతో ఎగుమతులు, దిగుమతుల సంబంధిత ఖర్చులు తగ్గి దేశీయ పరిశ్రమలకు మరింత అవకాశాలు కలుగుతాయని తెలిపారు.
అదేవిధంగా ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశ ర్యాంకును మెరుగుపరిచేందుకు కస్టమ్స్ విభాగం కీలకంగా మారబోతోందని ఆమె అన్నారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా పారదర్శకమైన, అంచనాలు స్పష్టంగా ఉండే కస్టమ్స్ విధానాలు ఎంతో అవసరమని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. వ్యాపార వర్గాల నుంచి వచ్చిన సూచనలను ప్రభుత్వం ఇప్పటికే పరిశీలనలోకి తీసుకుని రాబోయే బడ్జెట్‌లో వాటికి అనుగుణంగా విధానాలు ప్రకటించే అవకాశం ఉన్నదని ఆమె వెల్లడించారు.


