న్యూఢిల్లీ: భారతీయ సంస్థ ఏజీటీసీ బయోటెక్, ఇజ్రాయెల్‌కు చెందిన లగ్జంబర్గ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా సెమియోఫోర్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 50:50 వాటాలతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ద్వారా 18 అధునాతన ఫెరోమోన్, సెమియోకెమికల్ ఆధారిత పంట సంరక్షణ టెక్నాలజీలను ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యీకరించనున్నారు.
ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో అభివృద్ధి చెందిన సెమియోకెమికల్ టెక్నాలజీ తొలిసారిగా ఇజ్రాయెల్‌కు లైసెన్స్ అవుతున్నది. దీన్ని రెండు దేశాల మధ్య శాస్త్రీయ సహకారానికి మైలురాయిగా భావిస్తున్నారు. పంటలపై రసాయన అవశేషాలు లేకుండా, తేనెటీగలకు హానికరం కాని, వాతావరణానుకూల పద్దతిలో పురుగు నియంత్రణను సాధించడమే ఈ సాంకేతికాల ప్రధాన లక్ష్యం. దీంతో రసాయన పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
సెమియోఫోర్ భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో నియంత్రణ అనుమతులు, మౌలిక వసతులు, మార్కెటింగ్ కోసం 10 మిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ద్రాక్ష, యాపిల్, పత్తి, మొక్కజొన్న వంటి పలు పంటలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఉత్పత్తుల ద్వారా ప్రతి ఉత్పత్తి 75–100 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం రాబట్టే అవకాశం ఉందని కంపెనీలు ప్రకటించాయి.
ఈ జాయింట్ వెంచర్ ప్రకటన న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఎస్&టీ క్లస్టర్స్ కాన్ఫరెన్స్ లో భారత, ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. 2026లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి, 2027 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని సెమియోఫోర్ లక్ష్యంగా పెట్టుకుంది.


