
న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు సంబంధించి ‘లోకల్ రెమెడీస్ ఎగ్జాషన్’ నిబంధన వ్యవధిని అయిదేళ్ల నుంచి ప్రస్తుతం మూడేళ్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐఏ) కుదుర్చుకుంది. ఈ నిబంధన ప్రకారం, వివాదాలేవైనా తలెత్తితే విదేశీ ఇన్వెస్టర్లు ముందుగా ఆతిథ్య దేశంలోని న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కి వెళ్లాలి.
సాధారణంగా భారత్ ఇందుకోసం అయిదేళ్ళ వ్యవధిని నిర్దేశిస్తోంది. తాజాగా కుదుర్చుకున్న బీఐఏలో గతానికి భిన్నంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను కూడా చేర్చారు. యూఏఈతో భారత్ కుదుర్చుకున్న బీఐఏ తరహాలోనే ఇజ్రాయెల్ బీఏఐ కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. భారత్ ఈ డీల్ కుదుర్చుకున్న తొలి ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్, డెవలప్‌మెంట్) కూటమి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం.
ఇటు భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ ఒప్పందం ఉంటుంది. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు ఇజ్రాయెల్ నుంచి భారత్‌కి 337.77 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి.