తక్షణం రాయితీలు ఇవ్వాలని కోరుతూ ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దళిత పారిశ్రామికవేత్తలు
పెట్టుబడుల రాయితీల కోసం ఏపీఐఐసీ ఎదుట ఐదురోజులుగా దళిత పారిశ్రామికవేత్తల నిరసన
సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: దళిత పారిశ్రామికవేత్తలపై చంద్రబాబు సర్కారు చిన్నచూపు చూస్తోందని.. కొత్త పారిశ్రామిక విధానాల్లో దళితుల ప్రోత్సాహకాలకు కోత పెట్టిన టీడీపీ కూటమి సర్కారు ఇప్పుడు పాత ప్రోత్సాహకాలను విడుదల చేయకుండా వేధిస్తోందని.. అవి ఇవ్వకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని దళిత పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. నిండా అప్పుల్లో మునిగిపోయి పిల్లలకు కడుపు నిండా తిండిపెట్టలేకపోతున్నామంటూ ఐదు రోజులుగా గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐసీసీ కార్యాలయం ముందు చలిలో సైతం ధర్నా చేస్తున్నా సర్కారు కనికరించడంలేదంటూ సోమవారం కారెం సత్యనారాయణమ్మ, వరుకోటి నీరజ, పార్ల నాగలక్ష్మి వాపోయారు.
సబ్సిడీలు విడుదల చేయాలంటూ తాము డిసెంబరు 4 నుండి కుటుంబ సమేతంగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సోమవారం అన్ని జిల్లాల నుంచి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు. మొత్తం 8వేల మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఇబ్బంది పడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని వారు మండిపడ్డారు. చట్టప్రకారం తమకు రావల్సిన పెట్టుబడుల రాయితీలు విడుదల చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమని.. ఆ చావేదో ఇక్కడే చస్తామంటూ వారు ఏపీఐఐసి గేట్లు మూసివేసి రోడ్డుపైనే బైఠాయించారు.
అధికారంలోకి రాగానే తమ బకాయిలు చెల్లించడమే కాకుండా ఏ సంవత్సరం డబ్బులు ఆ సంవత్సరమే ఇస్తామంటూ చంద్రబాబు ఇచి్చన వాగ్దానాన్ని విస్మరించడంపై మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, పరిశ్రమల శాఖ మంత్రులు టీజే భరత్, కొండపల్లి శ్రీనివాస్, విద్యాశాఖ మంత్రి లోకేశ్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజ్, డైరెక్టర్ శుభమన్ బన్సాల్ తక్షణం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
సబ్సిడీ ఇవ్వకుండా వేధిస్తున్నారు
ఈ సందర్భంగా కారెం సత్యనారాయణమ్మ మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం పథకం కింద రెండు బస్సులను కొనుగోలు చేసి ఏపీఎస్‌ఆర్టీసీలో అద్దెకు తిప్పుతున్నామని, దీనికి ప్రభుత్వం ప్రకటించిన రూ.42.63 లక్షల సబ్సిడీ ఇవ్వకుండా చంద్రబాబు సర్కారు వేధిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేవరకు ఇక్కడ నుంచి కదిలేది లేదన్నారు. ఇప్పటికే బ్యాంకులకు రెండు నెలలుగా ఈఎంఐలు కట్టలేదని, ఇప్పుడు మూడోనెల కూడా కట్టకపోతే ఎన్‌పీఏ కింద ప్రకటించి బస్సులను తీసుకుపోతారని ఆమె చెప్పారు.
అలాగే, ఈనెలలో రెండు లక్షల బీమా ప్రీమియం చెల్లించాలని, కనీసం అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదని ఆమె వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీల కింద అక్టోబరులో రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు విడుదల చేసినప్పటికీ మా వర్గాలకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని ఆమె ఆరోపించారు. ఆర్టీసీ బస్సులకు కేటాయించిన రూ.56 కోట్ల నిధులు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు.
లిఖితపూర్వక హామీ ఇచ్చేవరకు కదిలేది లేదు
ఇక మెగా పరిశ్రమలకు రూ.వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం తమలో 90 శాతం మందికి విడుదల చేయలేదని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆరోపించారు. తక్షణం 100 శాతం రాయితీలను విడుదల చేయాలంటూ పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్ రామలింగరాజుకు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) వినతిపత్రం సమరి్పంచింది. ఎప్పటిలోగా విడుదల చేస్తారో లిఖితపూర్వకంగా చెప్పాలని.. అప్పటివరకు ఏపీఐఐసీ కార్యాలయం నుంచి కదిలేదిలేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఆమరణ నిరాహారదీక్షకు వెనుకాడబోమని జేఏసీ స్పష్టంచేసింది.
అయితే, ధర్నా చేస్తున్న దళిత పారిశ్రామికవేత్తలను తరలించడానికి పోలీసు బలగాలు పెద్దఎత్తున వచ్చాయి. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈడ్పుగంటి అనార్‌బాబు, ఈరా రాజశేఖర్, పినమాల నాగకుమార్, కనపర్తి విజయరాజు, కొడాలి రాంబాబు, భక్తవత్సలం, సరిహద్దు దయాకర్ డాక్టర్ ఎం.గీత, మూడా, రమణమూర్తి నాయక్, పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.


