breaking news
India-Israel
-
భారత్–ఇజ్రాయెల్ భాగస్వామ్యంలో కొత్త కంపెనీ
న్యూఢిల్లీ: భారతీయ సంస్థ ఏజీటీసీ బయోటెక్, ఇజ్రాయెల్‌కు చెందిన లగ్జంబర్గ్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా సెమియోఫోర్ లిమిటెడ్ అనే కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. 50:50 వాటాలతో ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ద్వారా 18 అధునాతన ఫెరోమోన్, సెమియోకెమికల్ ఆధారిత పంట సంరక్షణ టెక్నాలజీలను ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యీకరించనున్నారు.ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో అభివృద్ధి చెందిన సెమియోకెమికల్ టెక్నాలజీ తొలిసారిగా ఇజ్రాయెల్‌కు లైసెన్స్ అవుతున్నది. దీన్ని రెండు దేశాల మధ్య శాస్త్రీయ సహకారానికి మైలురాయిగా భావిస్తున్నారు. పంటలపై రసాయన అవశేషాలు లేకుండా, తేనెటీగలకు హానికరం కాని, వాతావరణానుకూల పద్దతిలో పురుగు నియంత్రణను సాధించడమే ఈ సాంకేతికాల ప్రధాన లక్ష్యం. దీంతో రసాయన పురుగుమందుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.సెమియోఫోర్ భారత్, ఇజ్రాయెల్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి మార్కెట్లలో నియంత్రణ అనుమతులు, మౌలిక వసతులు, మార్కెటింగ్ కోసం 10 మిలియన్ అమెరికా డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ద్రాక్ష, యాపిల్, పత్తి, మొక్కజొన్న వంటి పలు పంటలను లక్ష్యంగా చేసుకున్న ఈ ఉత్పత్తుల ద్వారా ప్రతి ఉత్పత్తి 75–100 మిలియన్ డాలర్ల వరకు ఆదాయం రాబట్టే అవకాశం ఉందని కంపెనీలు ప్రకటించాయి.ఈ జాయింట్ వెంచర్ ప్రకటన న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఎస్&టీ క్లస్టర్స్ కాన్ఫరెన్స్ లో భారత, ఇజ్రాయెల్ ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. 2026లో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించి, 2027 నాటికి పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని సెమియోఫోర్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు నిబంధనల సడలింపు
న్యూఢిల్లీ: ఇజ్రాయెలీ ఇన్వెస్టర్లకు సంబంధించి ‘లోకల్ రెమెడీస్ ఎగ్జాషన్’ నిబంధన వ్యవధిని అయిదేళ్ల నుంచి ప్రస్తుతం మూడేళ్లకు కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇజ్రాయెల్‌తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం (బీఐఏ) కుదుర్చుకుంది. ఈ నిబంధన ప్రకారం, వివాదాలేవైనా తలెత్తితే విదేశీ ఇన్వెస్టర్లు ముందుగా ఆతిథ్య దేశంలోని న్యాయ వ్యవస్థ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలి. ఆ తర్వాతే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కి వెళ్లాలి.సాధారణంగా భారత్ ఇందుకోసం అయిదేళ్ళ వ్యవధిని నిర్దేశిస్తోంది. తాజాగా కుదుర్చుకున్న బీఐఏలో గతానికి భిన్నంగా పోర్ట్‌ఫోలియో పెట్టుబడులను కూడా చేర్చారు. యూఏఈతో భారత్ కుదుర్చుకున్న బీఐఏ తరహాలోనే ఇజ్రాయెల్ బీఏఐ కూడా ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. భారత్ ఈ డీల్ కుదుర్చుకున్న తొలి ఓఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్, డెవలప్మెంట్) కూటమి దేశం ఇజ్రాయెల్ కావడం గమనార్హం.ఇటు భారత సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లకుండా అటు ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఈ ఒప్పందం ఉంటుంది. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్ వరకు ఇజ్రాయెల్ నుంచి భారత్‌కి 337.77 మిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయి. -
క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని గురువారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్-భారత్ కలిసి తయారుచేసిన ఈ మిస్సైల్ ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. ఉదయం 8.15 నిమిషాలకు ఇంట్రిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో మానవరహిత వాహనం 'బాన్షీ' టార్గెట్ గా మిస్సైల్ ను ప్రయోగించారు. మిస్పైల్ లోని మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్ అండ్ త్రెట్ అలర్ట్ రాడార్ (ఎమ్ఎఫ్ఎస్టీఏఆర్) టెక్నాలజీ ద్వారా టార్గెట్ లక్ష్యంగా ప్రయాణిస్తుందని, అలానే 'బాన్షీ'ని ఛేదించినట్లు వివరించారు. ఇదే టెక్నాలజీతో మీడియం, లాంగ్ రేంజ్ లలో ఏడాదికి 100కు పైగా మిస్సైల్స్ ను ఉత్పత్తి చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ప్లాంటును నెలకొల్పినట్లు చెప్పారు. గతంలో ఇదేకోవకు చెందిన లాంగ్ రేంజ్ ఎయిర్ మిసైళ్లను కోల్ కతా తీరంలో భారత నేవీ పరీక్షించింది. మీడియం రేంజ్ మిస్సైళ్లు 50-70 కిలోమీటర్ల దూరంలో గల టార్గెట్లను ఛేదిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్స్ పూర్తయిన తర్వాత మిగతా ఇవి కూడా భారత అమ్ములపొదిలోకి చేరుతాయి. కాగా, ప్రయోగసమయంలో చుట్టుపక్కల ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్య్సకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మీడియం రేంజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంకావడంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, మిస్సైల్ తయారీలో సాయంచేసిన సంస్థలకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. I congratulate @DRDO_India & Industry teams for the successful flight test of MRSAM (Medium Range Surface to Air Missile) weapon system. — Manohar Parrikar (@manoharparrikar) 30 June 2016


