
న్యూఢిల్లీ: మౌలిక రంగ దిగ్గజం రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో తాజాగా ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం డసాల్ట్ ఏవియేషన్ 2 శాతం వాటాను పెంచుకోనుంది. తద్వారా డసాల్ట్ రిలయన్స్ ఏరోస్పేస్(జేవీ)లో ప్రస్తుత 49 శాతం వాటాను 51 శాతానికి చేర్చుకోనుంది. ఇందుకు వీలుగా రిలయన్స్ ఇన్‌ఫ్రా అనుబంధ సంస్థ రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ 2 శాతం వాటాను డసాల్ట్‌కు బదిలీ చేయనుంది.
ప్రస్తుతం జేవీలో రిలయన్స్ ఏరోస్ట్రక్చర్ వాటా 51 శాతంకాగా.. డసాల్ట్ 49 శాతం వాటా కలిగి ఉంది. వాటా బదిలీ తదుపరి జేవీలో డసాల్ట్ మెజారిటీ వాటా(51 శాతం) పొందనుంది. వెరసి డసాల్ట్ ఏవియేషన్‌కు అనుబంధ సంస్థగా జేవీ అవతరించనుంది. నవంబర్1కల్లా వాటా బదిలీ పూర్తికానున్నట్లు అంచనా. ఈ డీల్‌కు రిలయన్స్ ఏరో రూ. 176 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది.