
చాలా ఏళ్ల తర్వాత అనిల్ అంబానీకి భారీ విజయం దక్కింది. ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్‌పై రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డ్ (మధ్యవర్తిత్వ పరిహారం) పొందినట్లు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ ఇన్‌ఫ్రా) తెలిపింది. 2018లో ఆరావళి పవర్ ఓ ఒప్పందాన్ని నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేయడంతో మధ్యవర్తిత్వం ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.
రూ.526 కోట్ల ఆర్బిట్రేషన్ అవార్డు
‘ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ మెజారిటీ తీర్పుతో ఆ రద్దు చెల్లదని తేల్చి, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అనుకూలంగా రూ.526 కోట్లు పరిహార తీర్పును ప్రకటించింది’ ఆర్ ఇన్‌ఫ్రా తెలిపింది. ఈ అవార్డు ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రోత్ క్యాపిటల్ కోసం వినియోగించనున్నట్లు కంపెనీ పేర్కొంది.
ఏమిటీ వివాదం?
రిలయన్స్ ఇన్‌ఫ్రాతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఆరావళి పవర్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏపీసీపీఎల్) 2018లో రద్దు చేసుకుంది. అయితే ఇది అసంబద్ధమంటూ రిలయన్స్ ఇన్‌ఫ్రా మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించింది. ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆరావళి పవర్ రద్దు నోటీసు జారీ చేయడం, అదే సంవత్సరం మధ్యవర్తిత్వాన్ని కూడా కోరడంతో వివాదం ప్రారంభమైంది.
ఆర్‌ఇన్‌ఫ్రా సంస్థపై గత ఏడాది డిసెంబర్‌లో పొందిన రూ .600 కోట్ల మధ్యవర్తిత్వ పరిహారాన్ని అమలు చేయాలని కోరుతూ ఆరావళి పవర్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు జూలై 1న ఆర్ఇన్‌ఫ్రా ప్రతిస్పందనను కోరింది.
విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాలు, నిర్మాణం, రక్షణ రంగాల్లో నిమగ్నమైన ఆర్‌ఇన్‌ఫ్రా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌లో కీలక సంస్థగా ఉంది. ఆగస్టు 13 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,501 కోట్లుగా ఉంది.