2028 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 1.5 లక్షల కోట్ల ఏయూఎంని (నిర్వహణలోని అసెట్స్) లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు పిరమల్ ఫైనాన్స్ రిటైల్ లెండింగ్ సీఈవో జగదీప్ మల్లారెడ్డి తెలిపారు. ప్రస్తుతం రిటైల్ ఏయూఎం రూ. 75,000 కోట్లుగా ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇది సుమారు రూ. 8,300 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.
తమ వ్యాపారంలో సుమారు 11–12 శాతం వాటా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో విస్తరణపై మరింత దృష్టి పెడుతున్నామని ఆయన పేర్కొ న్నారు. ప్రధాన నగరాల్లో 59 శాఖలు ఉన్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా కొత్తగా 50–75 శాఖలు ప్రారంభించనున్నామని, వీటిలో కొన్ని ఇక్కడ కూడా ఉంటాయని జగదీప్ పేర్కొన్నారు.
ప్రస్తుత గృహ, ఎస్‌ఎంఈ, వ్యక్తిగత, వాహన రుణాలందిస్తున్న తమ సంస్థ త్వరలో పసిడి రుణాలను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఈ పండుగ సీజన్‌లో సెమీ అర్బన్ మార్కెట్లలో డిమాండ్ నెలకొనడంతో రిటైల్ రుణాల మంజూరు 45 శాతం పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.


