దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఈ ఏడాది హైరింగ్ మెరుగ్గా నమోదైంది. గతేడాదితో పోలిస్తే నియామకాలు 16 శాతం పెరిగాయి. 2025లో మొత్తం ఐటీ ఉద్యోగాల డిమాండ్ 18 లక్షలకు చేరినట్లు వర్క్‌ఫోర్స్, టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ క్వెస్ కార్ప్ ఒక నివేదికలో తెలిపింది.
దీని ప్రకారం ఐటీ హైరింగ్ మార్కెట్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అత్యధికంగా 27 శాతం వాటా దక్కించుకున్నాయి. 2024లో నమోదైన 15 శాతంతో పోలిస్తే గణనీయంగా ఉద్యోగులను తీసుకున్నాయి. ఇక ప్రోడక్ట్, సాస్ (సాఫ్ట్‌వేర్ యాజ్ ఎ సర్వీస్) సంస్థలు కూడా చెప్పుకోతగ్గ స్థాయిలో రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, ఐటీ సర్వీసెస్, కన్సల్టింగ్ విభాగాల్లో మాత్రం నియామకాల వృద్ధి ఒక మోస్తరుగానే నమోదైంది.
నిధుల ప్రవాహం నెమ్మదించడంతో స్టార్టప్‌లలో హైరింగ్ కనిష్ట స్థాయి సింగిల్ డిజిట్‌కి పడిపోయినట్లు నివేదిక వివరించింది. అప్పటికప్పుడు పూర్తి స్థాయి ఉద్యోగ విధులను నిర్వర్తించేందుకు సన్నద్ధంగా ఉన్న వారితో పాటు మిడ్ కెరియర్ ప్రొఫెషనల్స్ (4–10 ఏళ్ల అనుభవం) ఉన్నవారి ప్రాధాన్యం లభించింది. మొత్తం హైరింగ్‌లో వీరి వాటా 65 శాతానికి పెరిగింది. 2024లో ఇది 50 శాతం.
నివేదికలో మరిన్ని విశేషాలు..
మొత్తం డిమాండ్‌లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాల్లో హైరింగ్ వాటా 15 శాతంగా ఉంది.
కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నియామకాలు మొత్తం ఐటీ హైరింగ్‌లో 10–11 శాతంగా నమోదయ్యాయి. 2024లో ఇది సుమారు 8 శాతంగా నిల్చింది. ఐటీలో నెలకొన్న డిమాండ్‌ని బట్టి చూస్తే ఐటీ కొలువుల్లో కాంట్రాక్ట్ నియామకాల వాటా పెరిగింది.
ఏఐ, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ నైపుణ్యాలు ఉన్న వారిపై కంపెనీలు ప్రధానంగా దృష్టి పెట్టాయి.
వచ్చే ఏడాది (2026) ఆసాంతం ఐటీ హైరింగ్ ఇదే విధంగా ఉండొచ్చు. డిజిటల్‌లో స్పెషలైజ్డ్ ఉద్యోగ విధులు, ద్వితీయ శ్రేణి నగరాల పరిధిని దాటి క్రమంగా విస్తరిస్తుండటం వంటి అంశాలు ఇందుకు దన్నుగా ఉంటాయి. ఏఐ, క్లౌడ్, సైబర్‌సెక్యూరిటీ, డేటా ఆధారిత ఉద్యోగాలకు డిమాండ్ నెలకొనవచ్చు. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), తయారీ, సాస్, టెలికం రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉండొచ్చు.
సర్వీసుల్లో ఫ్రెషర్స్, మహిళల నుంచి దరఖాస్తుల వెల్లువ
సర్వీసుల ఆధారిత ఉద్యోగాలవైపు మహిళలు, ఫ్రెషర్స్ మొగ్గు చూపడంతో ఈ ఏడాది ఉద్యోగాలకు దరఖాస్తులు 29 శాతం పెరిగాయి. అప్నాడాట్‌కో నివేదిక ప్రకారం 9 కోట్లకు పైగా జాబ్ అప్లికేషన్లు వచ్చాయి. మెట్రోల పరిధిని దాటి హైరింగ్, డిజిటల్ రిక్రూట్‌మెంట్ సాధనాల వినియోగం పెరిగింది. ఫైనాన్స్, అడ్మిని్రస్టేటివ్ సర్వీసులు, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్, హెల్త్‌కేర్ సపోర్ట్ ఉద్యోగాలకు మహిళల నుంచి దరఖాస్తులు 36 శాతం పెరిగి 3.8 కోట్లుగా నమోదయ్యాయి.
ఇది చదివారా? సత్య నాదెళ్లకు అదో సరదా..
ఇక సర్వీస్, టెక్నాలజీ ఆధారిత రంగాల్లో ఫ్రెషర్ల నుంచి దరఖాస్తులు సుమారు 10 శాతం పెరిగాయి. అప్నాడాట్‌కో పోర్టల్‌లోని ఉద్యోగ దరఖాస్తుల డేటా విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. దీని ప్రకారం ఏటా 1 కోటి మంది యువతీ, యువకులు ఉద్యోగాల్లో చేరుతున్నారు. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), రిటైల్, లాజిస్టిక్స్, ఈ–కామర్స్, ఆరోగ్య సంరక్షణ, మొబిలిటీ, ఐటీ సర్వీసులు తదితర విభాగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది.
చిన్న, మధ్య తరహా సంస్థల్లో (ఎస్‌ఎంబీ) జాబ్ పోస్టింగ్స్ 11 శాతం పెరిగి 10 లక్షలుగా నమోదైంది. అటు పెద్ద సంస్థల్లో జాబ్ పోస్టింగ్స్ 14 శాతం పెరిగి 4 లక్షలుగా నమోదయ్యాయి. ప్రథమ శ్రేణి నగరాల నుంచి సుమారు 2 కోట్ల దరఖాస్తులు, ద్వితీయ..తృతీయ శ్రేణి నగరాల నుంచి 1.8 కోట్ల అప్లికేషన్లు వచ్చాయి. మహిళల జీతభత్యాలు సగటున 22 శాతం పెరిగాయి.


