బ్యాంకింగ్ రంగ పీఎస్‌యూ దిగ్గజం స్టేట్ బ్యాంక్(ఎస్‌బీఐ)కు చెందిన ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్ ఎస్‌బీఐ వెంచర్స్ మూడో పర్యావరణహిత ఫండ్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. ఈ నిధులను సంబంధిత స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉంది.
దీంతో పర్యావరణ పరిరక్షిత వృద్ధికి మద్దతివ్వనున్నట్లు ఎస్‌బీఐ వెంచర్స్ ఎండీ, సీఈవో ప్రేమ్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఐవీసీఏ గ్రీన్ రిటర్న్స్ రెండో సదస్సు సందర్భంగా ఇది కొత్త ఫైనాన్షియల్ అవకాశమని తెలియజేశారు. దీనిలో దేశ, విదేశీ ఇన్వెస్టర్లను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. ఇందుకు అనుగుణంగా పెట్టుబడులను ఆకట్టుకునేందుకు వచ్చే ఏడాది మొదట్లో రోడ్‌షోలకు తెరతీయనున్నట్లు తెలియజేశారు.
మార్చికల్లా
కొత్త కేలండర్ ఏడాది(2026) తొలి త్రైమాసికం(జనవరి–మార్చి)లో క్లయిమేట్ ఫండ్‌ను ఆవిష్కరించడం ద్వారా రూ. 2,000 కోట్ల సమీకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభాకర్ వెల్లడించారు. నిధులను ప్రధానంగా తొలి దశ, వృద్ధిస్థాయిలో ఉన్న క్లయిమేట్ ఫోకస్‌డ్ స్టార్టప్‌లలో పెట్టుబడులకు వినియోగించనున్నట్లు వివరించారు. వాతావరణ మార్పులకు అనుగుణమైన సాంకేతికతలు, ఏఐ ఆధారిత క్లయిమేట్ ఆవిష్కరణలకు తెరతీసే స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు.


