ప్రీలాంచ్.. మోసాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. సాహితీ, జయత్రి, భువన్ తేజ, ఆర్జే, ఏవీ, జేవీ, క్రితిక, భారతీ, జీఎస్‌ఆర్, శివోం, ఓబిలీ ఇన్‌ఫ్రా.. ఇలా లెక్కలేనన్ని రియల్ ఎస్టేట్ చీటర్లు కస్టమర్లను నట్టేట ముంచేశారు. ప్రీలాంచ్, సాఫ్ట్ లాంచ్, బైబ్యాక్, ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ), వన్‌టైం పేమెంట్ (ఓటీపీ).. పేరేదైనా కానివ్వండి వీటి అంతిమ ఎజెండా మాత్రం మోసమే. కళ్లబొళ్లి మాటలతో కొనుగోలుదారులను నట్టేట ముంచేయడమే వీటి లక్ష్యం.

ఈ ఫొటోలో కనిపిస్తున్నది అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్–343లోని ఖాళీ స్థలం. కానీ, ఈ స్థలంలోనే 32 అంతస్తుల హైరైజ్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నామని ఓ బిల్డర్ తెగ బిల్డప్ ఇచ్చాడు. స్థల యజమానితో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ రాసుకొని, నిర్మాణ అనుమతులు తీసుకోకుండానే ప్రీలాంచ్‌లో విక్రయాలు మొదలుపెట్టాడు. చ.అ.కు రూ.2,500 చొప్పున సుమారు 2 వేల మంది కస్టమర్ల నుంచి రూ.504 కోట్లు వసూలు చేశాడు. ఇప్పటికీ నాలుగేళ్లయినా ఇటుక కూడా పేర్చలేదు. లబోదిబోమంటూ కస్టమర్లు ఆఫీసు చుట్టూ తిరిగినా లాభం లేకపోవడంతో ఆఖరికి ఠాణా మెట్లెక్కారు. పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన సదరు బిల్డర్ పరారీలో ఉన్నాడు. కష్టార్జితాన్ని పోగొట్టుకున్న కస్టమర్లు దిక్కుతోచని స్థితిలో నడిరోడ్డుపై ఉన్నారు. – సాక్షి, సిటీబ్యూరో
ఇటీవల కాలంలో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ మోసాలు విపరీతంగా వెలుగులోకి వస్తున్నాయి. గత 2–3 ఏళ్ల కాలంలో నగరంలో సుమారు రూ.25–30 వేల కోట్ల స్థిరాస్తి మోసాలు జరిగినట్లు పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిర్మాణ అనుమతులు, రెరా నమోదిత ప్రాజెక్ట్‌లలో మాత్రమే కొనుగోలు చేయాలని, బిల్డర్ల ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
నగరం నలువైపులా..
చిన్న కంపెనీలు మాత్రమే కాదు బడా కంపెనీలు కూడా ప్రీలాంచ్ విక్రయాలు చేస్తున్నాయి. కోకాపేట, ఖానామేట్, నానక్‌రాంగూడ, కొల్లూరు, పుప్పాలగూడ, నార్సింగి, ఫైనాన్షియల్ వంటి హాట్ ఫేవరేట్ ప్రాంతాలైన పశ్చిమ హైదరాబాద్‌లో ఎక్కువగా ప్రీలాంచ్ విక్రయాలు సాగుతున్నాయి. హైరైజ్ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని నమ్మబలికి, కస్టమర్ల నుంచి ముందుగానే సొమ్మంతా వసూలు చేస్తున్నారు. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌లన్నీ కేవలం బ్రోచర్ల మీదనే ఉంటాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదు ఏదీ ఉండదు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే చాలు సొంతిల్లు సొంతమవుతుందని నమ్మబలుకుతారు. అధిక కమీషన్‌కు ఆశపడి చాలా మంది ఏజెంట్లు ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. ప్రీలాంచ్ ప్రాజెక్ట్‌ల ప్రచార దందా సోషల్ మీడియా వేదికగానే సాగుతుంది. కొన్ని కంపెనీలైతే ఏకంగా కస్టమర్ కేర్ సెంటర్లను తెరిచి మరీ దందా సాగిస్తున్నాయి.
ఇంతకంటే తక్కువకు ఇస్తున్నాడంటే మోసమే..
నిర్మాణ వ్యయం అనేది భవనం ఎత్తును బట్టి ఉంటుంది. ఎత్తు పెరిగే కొలదీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణ సామగ్రి ధరల ప్రకారం.. సెల్లార్ + గ్రౌండ్ + ఐదంతస్తుల భవన నిర్మాణానికి చ.అ.కు రూ.3,500 ఖర్చవుతుంది. 5 నుంచి 15 అంతస్తుల వరకు రూ.4,500, 15–25 ఫ్లోర్ల వరకు రూ.5,500, ఆపైన భవన నిర్మాణాలకు చ.అ.కు రూ.6 వేలు వ్యయం అవుతుంది. ఈ గణాంకాలు చాలు ఏ డెవలపర్ అయినా ఇంతకంటే తక్కువ ధరకు ఫ్లాట్‌ను అందిస్తామని ప్రకటించాడంటే అనుమానించాల్సిందే. 100 శాతం నిర్మాణం పూర్తి చేయలేడు ఒకవేళ చేసినా నాసిరకంగానే ఉంటుందని ఓ బిల్డర్ తెలిపారు.
ప్రభుత్వానికీ నష్టమే..
ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల రూపంలోనే ఎక్కువ ఆదాయం సమకూరుతుంటుంది. కానీ, నిర్మాణ సంస్థలు హెచ్‌ఎండీఏ పరిధిలో చెల్లించాల్సిన రిజి్రస్టేషన్ చార్జీలను దొడ్డిదారిన తగ్గించుకుంటున్నాయి. ఫ్లాట్ల విక్రయాలకు బదులుగా ప్రాజెక్ట్ కంటే ముందే అన్‌డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్(యూడీఎస్)ను కస్టమర్లకు రిజి్రస్టేషన్లు చేస్తున్నారు. ఫ్లాట్ కొంటే చెల్లించాల్సిన 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలకు బదులుగా యూడీఎస్‌లో సప్లమెంటరీ రిజిస్ట్రేషన్ కింద 1 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రమే చెల్లిస్తున్నారు. యూడీఎస్‌లో చ.అ. ధర తక్కువగా ఉండటం, రిజి్రస్టేషన్ చార్జీలు లేకపోవటంతో కొనుగోలుదారులు ఈ తరహా ప్రాజెక్ట్‌లకు ఆకర్షితులవుతున్నారు. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు.
కస్టమర్లకు సూచనలివీ
నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లలోనే కొనుగోలు చేయాలి.
ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి.
డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి.
గతంలో పూర్తి చేసిన ప్రాజెక్ట్‌లను నేరుగా వెళ్లి పరిశీలించాలి. అందులోని కస్టమర్లతో మాట్లాడాలి.
పాత ప్రాజెక్ట్‌లలో ధరల వృద్ధి ఎలా ఉంది? బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదో తెలుసుకోవాలి.
ప్రాజెక్ట్ రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలపై ఆరా తీయాలి.
డెవలపర్ లేదా కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ గురించి కూడా పరిశీలించాలి.
ఇదీ చదవండి: ఆ సంవత్సరం.. రియల్ ఎస్టేట్‌కు బంగారం!
ఇలా చేస్తే కట్టడి..
జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ టౌన్‌ప్లానింగ్ విభాగాల్లో అధికారుల కొరతను తీర్చాలి. నిర్మాణ అనుమతుల్లో జాప్యాన్ని తగ్గించాలి.
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, రెరా విభాగాలను అనుసంధానించాలి. దీంతో ఆయా విభాగాల అనుమతులు జారీ అయితే రిజిస్ట్రేషన్ చేసేలా ఉండాలి.
రెరాలో నమోదు కాకుండా విక్రయాలు జరిపే ఏజెంట్లు, మధ్యవర్తులపై క్రమశిక్షణరాహిత్య చర్యలు తీసుకోవాలి.
రెరా అధికారులు, సిబ్బంది తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఏ బిల్డర్లు ఎలాంటి మోసాలకు పాల్పడుతున్నారో తెలుస్తుంది.
ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించి ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సోషల్ మీడియాలో సాగే ప్రీలాంచ్, యూడీఎస్ ప్రచారాలు, రాయితీలపై ఆరా తీయాలి.
రెరా అథారిటీ ప్రత్యేకంగా ఒక వాట్సాప్ నంబర్ క్రియేట్ చేసి ఫ్లాట్లు, ప్లాట్లు కొనే వారు ముందస్తుగా తమకు సమాచారం ఇవ్వాలని కోరాలి. ఈ నంబరు మొత్తం మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగాలి. స్థిరాస్తిని కొనేముందు కొనుగోలుదారులు తప్పకుండా రెరాను సంప్రదించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల వెలుగు చూసిన ప్రీలాంచ్ మోసాల్లో కొన్ని: (రూ.కోట్లలో)



