జీసీసీలకు డిమాండ్‌ భళా | Colliers India report GCCs are emerging biggest driver realty demand | Sakshi
Sakshi News home page

జీసీసీలకు డిమాండ్‌ భళా

Feb 26 2026 7:29 AM | Updated on Feb 26 2026 12:13 PM

Colliers India report GCCs are emerging biggest driver realty demand

ఐదేళ్లలో 101 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ లీజు

అమెరికా కంపెనీలదే ఆధిపత్యం

మొత్తం ఆఫీస్‌ లీజింగ్‌ 280 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ

కొలియర్స్‌ ఇండియా నివేదిక 

గ్లోబల్‌ కేపబులిటీ సెంటర్ల (అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు/జీసీసీలు) ఏర్పాటుకు అమెరికా కంపెనీలు భారత్‌ను ఎంతో కీలకంగా చూస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో 2020 నుంచి 2025 మధ్య హైదరాబాద్‌ సహా దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో.. 101 మిలియన్‌ చదరపు అడుగుల (ఎస్‌ఎఫ్‌టీ) కార్యాలయ వసతులను జీసీసీల ఏర్పాటుకు విదేశీ సంస్థలు లీజుకు తీసుకోవడం గమనార్హం. ఈ కాలంలో మొత్తం ఆఫీస్‌ లీజింగ్‌ 280.2 మిలియన్‌ ఎప్‌ఎఫ్‌టీగా ఉన్నట్టు రియల్‌ ఎస్టేట్‌రంగ కన్సల్టెంట్‌ కొలియర్స్‌ ఇండియా తెలిపింది.

బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్, కోల్‌కతా, ముంబై, పుణె నగరాల డేటా ఆధారంగా ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నగరాల్లో మొత్తం ఉపాధి డిమాండ్‌లో 36 శాతం జీసీసీల నుంచే వస్తున్నట్టు తెలిపింది. గత ఐదేళ్లలో 101 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీల జీసీసీల లీజింగ్‌లో 71 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని అమెరికా కంపెనీలు తీసుకున్నాయి.

‘భారత ఆఫీస్‌ మార్కెట్‌ ఇటీవలి సంవత్సరాల్లో పెద్ద ఎత్తున విస్తరించింది. కరోనా అనంతరం డిమాండ్‌ ఎప్పటికప్పుడు గరిష్టాలకు చేరుతోంది. ముఖ్యంగా జీసీసీలు ఈ విస్తరణకు చోదకంగా ఉన్నాయి. వ్యయాలు ఆదా చేసుకునే కేంద్రాలుగా కాకుండా.. ఆవిష్కరణల ఆధారిత అంతర్జాతీయ అనుసంధాన విజ్ఞాన, పరిశోధన కేంద్రాలుగా అవతరించాయి’ అని కొలియర్స్‌ ఇండియా తెలిపింది.

ఏటా 35–40 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీ

2025లో విదేశీ సంస్థలు భారత్‌లో 29.2 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీలను తీసుకునేందుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం గమనార్హం. ఈ ఏడు నగరాల్లో స్థూల ఆఫీస్‌ లీజింగ్‌ 71.5 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీలో ఈ మొత్తం 41 శాతంగా ఉంది. విదేశీ సంస్థలు భారత్‌లో జీసీసీల ఏర్పాటుకు ఏటా 35–40 మిలియన్‌ ఎస్‌ఎఫ్‌టీని లీజుకు తీసుకుంటాయని కొలియర్స్‌ ఇండియా ఆఫీస్‌ సరీ్వసెస్‌ ఎండీ అరి్పత్‌ మెహరోత్రా అంచనా వేశారు. ‘‘యూఎస్‌ సంస్థల నుంచి టెక్నాలజీ ఆధారిత జీసీసీల ఏర్పాటు డిమాండ్‌ స్థిరపడొచ్చు. ఐరోపా సమాఖ్య, బ్రిటన్‌కు చెందిన సంస్థల నుంచి ఇంజనీరింగ్, తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్‌కు సంబంధించి జీసీసీల ఏర్పాటుకు డిమాండ్‌ పెరుగుతుంది’’అని చెప్పారు.

ఈ నివేదికపై భివ్‌ వర్క్‌స్పేస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో సురేష్‌రావు పప్లికర్‌ స్పందిస్తూ.. భారత నైపుణ్యాలు, బిజినెస్‌ ఎకోసిస్టమ్‌ పట్ల అంతర్జాతీయ కంపెనీల్లో విశ్వాసానికి నిదర్శనమన్నారు. కోవర్కింగ్‌ సెంటర్లలో ఫ్లెక్సిబుల్‌ వర్క్‌స్పేస్‌ను జీసీసీల కోసం తీసుకోవడం పెరిగినట్టు చెప్పారు. భారత్‌పై దీర్ఘకాల దృష్టితో యూఎస్, యూరప్, బ్రిటన్‌ కంపెనీలు జీసీసీల ఏర్పాటుకు ఆఫీస్‌ వసతులను లీజుకు తీసుకోవడం పెరిగినట్టు ‘స్పేస్‌వన్‌’ ప్రాపర్టీ యాక్విజిషన్‌ విభాగం డైరెక్టర్‌ సిజోజోస్‌ తెలిపారు.

ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

Advertisement
 
Advertisement
Advertisement