హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల వరద పారుతోంది. గతేడాది సిటీ స్థిరాస్తి రంగంలోకి రూ.3,892 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వచ్చాయి. 2024లో వచ్చిన రూ.2,704 కోట్లతో పోలిస్తే ఇది 44 శాతం అధికం. 2025లో దేశంలోని 8 ప్రధాన మెట్రోల్లోకి 8,474.8 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 5 శాతం వాటాను హైదరాబాద్ కలిగి ఉందని కొల్లియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది.
– 2025 సంవత్సరం భారత స్థిరాస్తి రంగానికి బంగారంలాంటిది. గతేడాది దేశీయ రియల్ ఎస్టేట్‌లోకి 8.5 బిలియన్ డాలర్ల గరిష్ట పెట్టుబడులు వచ్చాయి. 2024తో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, సుంకాల పెంపు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత రియల్ ఎస్టేట్‌లోకి ఈ స్థాయిలో సంస్థాగత పెట్టుబడులు రావడం గమనార్హం.
విభాగాల వారీగా చూస్తే.. 2025లో అత్యధికంగా ఆఫీసు విభాగంలోకి పెట్టుబడులు వచ్చాయి. కార్యాలయ సముదాయంలోకి 4,534.6 మిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ రాగా.. ఆ తర్వాత నివాస విభాగంలోకి 1,566.9 మిలియన్ డాలర్లు, మిశ్రమ వినియోగ విభాగంలోకి 819.3 మిలియన్ డాలర్లు, పారిశ్రామిక, గిడ్డంగుల రంగంలోకి 734.2 మిలియన్ డాలర్లు, రిటైల్‌లోకి 380 మిలియన్ డాలర్లు, డేటా సెంటర్లు, సీనియర్ లివింగ్, హాలిడే హోమ్స్, స్టూడెంట్ హౌసింగ్ వంటి ప్రత్యామ్నాయ స్థిరాస్తి విభాగంలోకి 272.5 మిలియన్ డాలర్లు, హాస్పిటాలిటీ రంగంలోకి 167.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.


