ఆదాయంపై ప్రభావం ఉండదు
న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు 2025–26లో 7.5 శాతంగా ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక తెలిపింది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తన తొలి ముందస్తు అంచనాల్లో 7.4 శాతం ఉండొచ్చని అంచనా వేయడం తెలిసిందే. ఆర్‌బీఐ అంచనా అయితే 7.3 శాతంగా ఉంది. చారిత్రకంగా చూస్తే ఆర్‌బీఐ, ఎన్‌ఎస్‌వో అంచనాల మధ్య 30–30 బేసిస్ పాయింట్ల వ్యత్యాసం ఉంటుందని, కనుక 7.4 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని ఎస్‌బీఐ ఆర్థిక పరిశోధన విభాగం తన నివేదికలో పేర్కొంది.
‘‘ఎన్‌ఎస్‌వో ద్వితీయ ముందస్తు అంచనాలు, అదనపు డేటా, సవరణలు అన్నవి 2026 ఫిబ్రవరి 27న విడుదల కానున్నాయి. 2022–23ను బేస్ సంవత్సరంగా పేర్కొంటే ఈ గణాంకాలన్నీ మార్పునకు గురికావొచ్చు’’అని ఎస్‌బీఐ నివేదిక వివరించింది. ద్రవ్యలోటు గత నవంబర్ చివరికి రూ.9.8 లక్షల కోట్లు (బడ్జెట్ అంచనాల్లో 62.3 శాతం)గా ఉండడాన్ని ప్రస్తావించింది.
2025–26 బడ్జెట్‌లో అంచనాల కంటే పన్నుల ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ పన్నేతర ఆదాయం అధికంగా ఉందని.. కనుక మొత్తం మీద ఆదాయం ప్రభావితం కాకపోవచ్చని పేర్కొంది. వ్యయాలు కూడా తక్కువగా ఉన్నందున ద్రవ్యలోటు 15.85 లక్షల కోట్లకు పరిమితం కావొచ్చంటూ, బడ్జెట్ అంచనా రూ.15.69 లక్షల కోట్ల కంటే ఇది స్వల్ప అధికమేనని గుర్తు చేసింది. ద్రవ్యలోటు 4.4 శాతం వద్ద స్థిరంగా ఉండొచ్చని అంచనా వేసింది.


