పీఎఫ్‌ భాగ్యం మరింత మందికి దక్కుకుందా? | Government Plans To Raise EPF Wage Limit, Bringing Millions Of Mid Income Employees Under Social Security Net | Sakshi
Sakshi News home page

పీఎఫ్‌ భాగ్యం మరింత మందికి దక్కుకుందా?

Jan 10 2026 1:33 PM | Updated on Jan 10 2026 2:07 PM

Government Weighs Proposal to Increase Mandatory EPF Wage Ceiling

దేశంలో ఉద్యోగుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. తప్పనిసరి ఉద్యోగ భవిష్య నిధి (EPF)కు వర్తించే వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇది కార్యరూపం దాలిస్తే, ఇప్పటివరకు ఈపీఎఫ్ పరిధికి బయట ఉన్న లేదా పరిమిత ప్రయోజనాలకే పరిమితమైన లక్షలాది ఉద్యోగులకు అదనపు భద్రత లభించే అవకాశముంది.

ఏమిటీ వేతన పరిమితి?

ప్రస్తుతం, ఒక ఉద్యోగి ప్రాథమిక జీతం డీఏతో కలిపి రూ .15,000 లేదా అంతకంటే తక్కువ ఉంటే మాత్రమే ఈపీఎఫ్ తప్పనిసరిగా వర్తిస్తోంది. ఆ పరిమితిని పెంచితే, మధ్యస్థ వేతనాలు (వేతన రూ.30 వేల వరకూ పెంచే అవకాశం) పొందే ఉద్యోగులు కూడా ఈపీఎఫ్ కవరేజీలోకి వస్తారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగం, ఎంఎస్ఎంఈలు, సేవారంగాల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రస్తుతం ఉన్న రూ .15 వేల గరిష్ట వేతన పరిమితి చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. 2014 సెప్టెంబర్లో దీన్ని నిర్ణయించారు. గత దశాబ్ద కాలంలో జీతాలు, జీవన ఖర్చులు గణనీయంగా పెరిగాయి. కానీ పీఎఫ్ పరిమితి మాత్రం మారకుండా అలాగే కొనసాగుతూ వస్తోంది.

వేతన పరిమితి పెంచితే ప్రయోజనాలు

  • వేతనంతో పాటు సంస్థ వాటా కూడా ఈపీఎఫ్‌లో జమ కావడంతో దీర్ఘకాలిక పొదుపు పెరుగుతుంది.

  • పదవీ విరమణ అనంతరం ఆర్థిక భద్రత మెరుగవుతుంది.

  • ఈపీఎస్ పరిధి విస్తరించడంతో పెన్షన్ ప్రయోజనాలు లభిస్తాయి.

  • ఈపీఎఫ్‌కు చెల్లించే మొత్తాలపై పన్ను రాయితీలు ఉంటాయి.

  • గృహ నిర్మాణం, వైద్యం, విద్య వంటి అవసరాలకు నిబంధనల ప్రకారం ఉపసంహరణ సౌకర్యం ఉంటుంది.

యాజమాన్యాలపై ప్రభావం

వేతన పరిమితి పెంపుతో యాజమాన్యాలపై చెల్లింపుల భారం కొంత పెరగవచ్చు. అయితే, ఉద్యోగుల నిలుపుదల (రిటెన్షన్) మెరుగవడం, సామాజిక భద్రతతో కూడిన స్థిరమైన వర్క్‌ఫోర్స్ ఏర్పడటం వంటి దీర్ఘకాలిక లాభాలు సంస్థలకు దక్కుతాయని నిపుణులు చెబుతున్నారు.

ప్రతిపాదనపై కార్మిక సంఘాలు, పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వం సంప్రదింపులు జరపనుంది. అన్ని వర్గాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే, దేశంలో సామాజిక భద్రతా వ్యవస్థకు ఇది మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement