బ్రహ్మాది దేవతలందరూ తమ కోర్కెలు తీరటానికి శివుని ధ్యానిస్తూ ఉంటారు. అటువంటి శివుడు రామాజ్ఞను పాలించే రామదాసుగా ఎలా అయ్యాడు? అని ‘పరాశర సంహిత’లో మైత్రేయ ముని పరాశర మహర్షిని అడిగినపుడు ఆ మహర్షి ఇలా చెప్పాడు: గార్ధభ నిస్స్వనుడనే రాక్షసుడు భయంకర రూపంతో దేవ దానవ యక్షాదులకు జయింప శక్యం కాని లోక కంటకుడయ్యాడు. అతడు పరమేశ్వర పరమ భక్తుడు. అతని బాధ పడలేక ఇంద్రాదులు బ్రహ్మ విష్ణువులతో కైలాసానికి వెళ్లారు. ఆ రాక్షసుని అంతం చేయమని ప్రార్థించారు.
శివుడు, ‘ఆ రాక్షసుడు నా నిజ భక్తుడు. నేనెలా చంపగలను?’ అన్నాడు. విష్ణువు కోపంతో ‘నేనూ నీ భక్తుణ్ణే కదా! నా కంటే అతడు ఇష్టుడా నీకు? అయితే నాకు నీ పట్ల గల దృఢమైన భక్తి కవచంగా ధరించి నేనే వానిని సంహరిస్తాను’ అన్నాడు. శివుడు ‘నువ్వు ఆ రాక్షసుని చంపితే నేను నీకు దాస్యం చేస్తాను’ అన్నాడు. అప్పుడు విష్ణువు ‘నేను అతనిని చంపలేకపోతే నీ దాసులకు దాసుడనై కైలాసశిఖరంపై గడుపుతాను’ అన్నాడు.
హరిహరులు పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. విష్ణువు మోహినీ రూపంలోకి మారి రాక్షసుని మోహ విభ్రాంతులకు గురి చేశాడు. రాక్షసుడు ఆ మాయలో పడి మోహినిని పట్టుకోవటానికి వెంటపడి భూమిపై పడ్డాడు. అప్పుడు విష్ణువు తోడేలు రూపంలో అతనిని తినివేశాడు. రాక్షస సంహారం తర్వాత శివుడు విష్ణువుతో ‘నేను నీకు దాసుణ్ణి’ అన్నాడు. విష్ణువు, ‘మేమంతా నీ అధీనులము. నీ మహిమ వల్లనే ఇతడు మరణించాడు. కాబట్టి, నేను ఇప్పుడు నిన్ను దాసునిగా స్వీకరించలేను. రావణ సంహారం కోసం రామునిగా అవతరించినపుడు, హనుమ రూపంలో దాసునిగా ఉండి నీ ప్రతిజ్ఞ నెరవేర్చుకో’ అని చెప్పాడు. అలా రామావతారంలో శివుడు హనుమంతుని రూపంలో రామదాసుగా, రామభక్తునిగా జనుల పూజలందుకున్నాడు. హరిహరులకు భేదం లేదు. వారి వాగ్వివాదాలు, ప్రతిజ్ఞలు లోక కల్యాణానికే!
– డా.చెంగల్వ రామలక్ష్మి


