ఢిల్లీ: రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు (బుధవారం) దేశ పౌరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. వికసిత్ భారత్ సాధనకు ప్రజలందరూ తమ విధులను నిబద్దతతో ఆచరించాలని పిలుపునిచ్చారు. ఓటుహక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకొని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. 18 ఏళ్లు దాటిన విద్యార్థులను సన్మానిస్తూ కాలేజీలు, పాఠశాలలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించాలని కోరారు.
బలమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి పౌరులందరూ తమ రాజ్యాంగ విధులను తప్పక నిర్వర్తించాలని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించడం ద్వారా భారత ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యతను ఆయన గుర్తు చేశారు. ఈ పవిత్రమైన రోజున, 18 ఏళ్లు నిండి, మొదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువతను పాఠశాలలు, కళాశాలలలో ప్రత్యేకంగా గౌరవించాలని ప్రధాని మోదీ సూచించారు. తద్వారా యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ బోధించిన ‘కర్తవ్యాల నిర్వహణ నుంచే హక్కులు ప్రవహిస్తాయి’ అనే సూత్రాన్ని ప్రధాని గుర్తుచేస్తూ, విధులను నెరవేర్చడమే సామాజిక, ఆర్థిక పురోగతికి అసలైన పునాది అని అన్నారు.
మనం తీసుకునే ప్రతి నిర్ణయం రాబోయే తరాల జీవితాలను రూపుదిద్దుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశం వికసిత్ భారత్ దార్శనికత వైపు దూసుకుపోతున్న ఈ సమయంలో, పౌరులంతా రాజ్యాంగ విధులను అత్యంత ప్రధానమైనవిగా భావించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతీ మనిషికి గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ అందించేందుకు రాజ్యాంగం అత్యంత ప్రాముఖ్యతనిస్తుందని అన్నారు. రాజ్యాంగం మనకు హక్కులతో సాధికారత కల్పిస్తున్నప్పటికీ, పౌరులుగా మన విధులను కూడా గుర్తు చేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని రూపొందించిన నిర్మాతలకు ఘన నివాళులర్పించారు. వారు అందించిన దార్శనికత, దూరదృష్టి వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.


