మాంజా మెడ‌కు చుట్టుకుని తెగిన ర‌క్త‌నాళాలు..హెల్మెట్‌ పెట్టుకున్నా..! | Chinese manja slits throat a man riding two wheeler | Sakshi
Sakshi News home page

మాంజా మెడ‌కు చుట్టుకుని తెగిన ర‌క్త‌నాళాలు..హెల్మెట్‌ పెట్టుకున్నా..!

Dec 6 2025 2:15 PM | Updated on Dec 6 2025 2:31 PM

Chinese manja slits throat a man riding two wheeler

సంక్రాంతికి ఇంకా దాదాపు 40 రోజుల‌కు పైగా ఉన్నా ఇప్ప‌టి నుంచే మాంజా ప్రమాదాలు మొద‌లైపోయాయి. న‌గ‌రంలోని గుర్రంగూడ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రముఖ సంస్థ‌లో ప‌నిచేస్తున్నారు. ఆయ‌న ఇంటి నుంచి నాగోలు వైపు త‌న‌కు కాబోయే భార్య‌తో క‌లిసి బైకు మీద వెళ్తుండ‌గా ఉన్న‌ట్టుండి మెడ‌కు ఏదో ప‌ట్టుకున్న‌ట్లు అయ్యింది. తీరా చూస్తే.. అప్ప‌టికే మెడ తెగిపోయింది. అటుగా వెళ్తున్న మ‌రో వ్య‌క్తి అత‌డిని గ‌మ‌నించి వెంట‌నే స‌మీపంలో ఉన్న కామినేని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ కార్తీక్‌కు స‌త్వ‌రం చికిత్స అందించి ర‌క్త‌నాళాలు తిరిగి అతికించిన క‌న్స‌ల్టెంట్ కార్డియోథొరాసిక్ వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ రిషిత్ బ‌త్తిని ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

కార్తీక్ త‌న‌కు కాబోయే భార్య‌తో క‌లిసి వెళ్తుండ‌గా కామినేని ఫ్లై ఓవ‌ర్ ఎక్కిన కాసేప‌టికి అత‌డి మెడ‌కు మాంజా చుట్టుకుంది. హెల్మెట్ పెట్టుకున్నా కూడా మెడ భాగంలో అది గ‌ట్టిగా కోసుకుంది. దాంతో అత‌డి మెడ కండ‌రాల‌తో పాటు, పైవైపు ఉండే ర‌క్త‌నాళాలు కూడా తెగిపోయాయి. అయితే అదృష్ట‌వ‌శాత్తు లోప‌లి భాగంలో ఉండే ప్ర‌ధాన ర‌క్త‌నాళాలు గానీ, శ్వాస‌నాళం గానీ గాయ‌ప‌డ‌క‌పోవ‌డంతో అతడికి మ‌రీ ఎక్కువ‌గా ఇబ్బంది క‌ల‌గ‌లేదు. 

అయితే, ర‌క్త‌నాళం తెగ‌డంతో ర‌క్త‌స్రావం ఎక్కువ‌గా ఉంది. ఆస్ప‌త్రికి తీసుకురాగానే ముందు ఎమ‌ర్జెన్సీలో ర‌క్త‌స్రావం ఆపేందుకు ప్ర‌య‌త్నించారు. అది సాధ్యం కాక‌పోవ‌డంతో వెంట‌నే శ‌స్త్రచికిత్స చేయాల‌ని నిర్ణ‌యించాం. అర‌గంట‌లోపే శ‌స్త్రచికిత్స ప్రారంభించి అత‌డికి తెగిపోయిన ర‌క్త‌నాళాల‌ను తిరిగి అతికించ‌డంతో పాటు.. కండ‌రాన్ని కూడా కుట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయ‌గ‌లిగాం. మాంజాను చేత్తో తీయ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంతో అత‌డి చేతి వేళ్ల‌కు కూడా గాయాల‌య్యాయి. అత‌డితో పాటు వెన‌క కూర్చున్న యువ‌తికి మెడ ద‌గ్గ‌ర‌, కంటి ద‌గ్గ‌ర స్వ‌ల్ప గాయాలు మాత్ర‌మే కావ‌డంతో ఆమెకు ప్రాథ‌మిక చికిత్స చేశాం.

సంక్రాంతికి ఇంకా చాలా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే ప‌తంగులు ఎగ‌రేయ‌డం మొద‌లైంది. అయితే, అవి తెగిపోయిన‌ప్పుడు వాటికి వాడుతున్న మాంజాలు కూడా తెగిపోయి.. గాలికి వేలాడుతూ ఇలా రోడ్డు మీద వెళ్లేవాళ్ల ప్రాణాల మీద‌కు తెస్తున్నాయి. గాజు పూసిన మాంజాలు ఎక్కువ ప్ర‌మాదక‌రంగా ఉంటాయి. వీటి నియంత్ర‌ణ‌కు ఇప్ప‌టినుంచే అధికారులు ప‌టిష్ఠ‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలి. లేక‌పోతే ఇలాంటి ప్రాణాంత‌క ప్ర‌మాదాలు మ‌రిన్ని జ‌రిగే అవ‌కాశం ఉంటుంది అని డాక్ట‌ర్ రిషిత్ బ‌త్తిని తెలిపారు. ఈ శ‌స్త్రచికిత్స‌లో ఇంకా జూనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ కార్డియోథొరాసిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ స‌య్య‌ద్ మ‌ఝ‌ర్ అలీ, చీఫ్ కార్డియాక్ అనెస్థ‌టిస్ట్ డాక్ట‌ర్ సురేష్ కుమార్‌, క‌న్స‌ల్టెంట్ అనెస్థ‌టిస్ట్ డాక్ట‌ర్ ర‌వ‌ళి సాదె పాల్గొన్నారు.

కాపాడింది కూడా కామినేని వైద్యుడే
త‌న‌ను ఈ ప్ర‌మాదం నుంచి కాపాడి ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ది కూడా కామినేని ఆస్ప‌త్రికి చెందిన వైద్యుడేన‌ని బాధితుడు కార్తీక్ తెలిపారు. ‘‘నేను నాకాబోయే భార్య‌తో క‌లిసి నాగోలు వైపు వెళ్తున్నాను. 40 కిలోమీట‌ర్ల‌లోపు వేగంతోనే వెళ్తుండ‌గా ఉన్న‌ట్టుండి ఏదో కోసుకున్న‌ట్లు అనిపించింది. చెయ్యి పెట్టి చూసేస‌రికి హెల్మెట్ లోప‌ల నుంచి మాంజా క‌నిపించింది. అది త‌గిలిచెయ్యి కూడా కోసుకుపోయింది. వెంట‌నే బండి ప‌క్క‌కి తీసి ఆపేశాను. 

త‌ర్వాత మెడ‌ద‌గ్గ‌ర నొప్పి ఉంది ఏంటా అని చెయ్యి పెడితే చెయ్యి అంతా ర‌క్తం ఉంది. ఈలోపు అటుగా వ‌చ్చిన వైద్యుడు త‌న క‌ర్చీఫ్ ఇచ్చి అదిమిప‌ట్టుకోమ‌న్నారు. రెండు మూడు ఆటోలు ఆపినా ఆగ‌లేదు. దాంతో ఆయ‌న త‌న బండి మీద ద‌గ్గ‌ర్లో ఉన్న‌కామినేని ఆస్ప‌త్రికి  తీసుకెళ్లారు. 

అక్క‌డ ఎమ‌ర్జెన్సీలో అడ్మిట్ అయ్యాను. త‌ర్వాత అర‌గంట‌కు ఆప‌రేష‌న్ థియేట‌ర్‌కు తీసుకెళ్లారు. న‌న్ను ఆస్ప‌త్రిలో చేర్చింది కూడా ఒక వైద్యుడే అని త‌ర్వాత తెలిసింది. ఇంకా సంక్రాంతికి చాలా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే ఇలా మాంజాలు త‌గ‌ల‌డం మొద‌లైతే రోడ్ల మీద వెళ్లేవారికి చాలా ప్ర‌మాదం ’’ అని కార్తీక్ చెప్పారు.

(చదవండి: ఊపిరితిత్తుల కేన్సర్‌కి విలన్‌ ధూమపానం మాత్రమే కాదు..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement