
హైదరాబాద్ : శీతాకాలం రాక ముందే హైదరాబాద్ నగరంలో సీజనల్ జ్వరాలు ఎక్కువవుతున్నాయి. వర్షాలు వచ్చి, తగ్గిన తర్వాత ఉన్న పొడి వాతావరణంలో పలు రకాల వైరస్‌లు పెరిగి అనేక జ్వరాలకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా డెంగ్యూ, ఇన్‌ఫ్లూయెంజా, చికన్ గున్యా లాంటి జ్వరాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటినుంచి నగరవాసులు తమను తాము కాపాడుకోవాలని.. వాటి లక్షణాలు గమనించుకుని జాగ్రత్త వహించాలని కామినేని ఆస్పత్రి జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎం. స్వామి అన్నారు.
“వర్షాలు వస్తూ, తగ్గుతూ ఉన్న ఈ తరుణంలో పలు రకాల జ్వరాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ఇన్‌ఫ్లూయెంజా, డెంగ్యూ, చికన్ గున్యా లాంటివి కనిపిస్తున్నాయి. వీటి లక్షణాలు కూడా ఇంతకుముందులా లేకుండా విభిన్నంగా కనిపించడం ఈసారి ప్రత్యేకత. డెంగ్యూలో మామూలుగా అయితే చేతులు, కాళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్లు పడిపోవడం లాంటివి ఉంటాయి. కానీ, ఈ సీజన్‌లో వస్తున్నవాటిలో ముందుగా విరేచనాలు అవుతున్నాయి. ఒకటి రెండురోజుల తర్వాత జ్వరం వచ్చి అప్పుడు ప్లేట్‌లెట్లు పడిపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. ఇన్‌ఫ్లూయెంజా కేసులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. వారానికి కనీసం ఐదు కేసుల వరకు ఒక్క కామినేని ఆస్పత్రికే వస్తున్నాయి. అలాగే చికన్ గున్యా కేసులూ విజృంభిస్తున్నాయి.
నగరంలో వాతావరణ మార్పులు, వర్షపునీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం లాంటివి ఈ జ్వరాల వ్యాప్తికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. దానికితోడు వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పటికే ఎలర్జీలు లేదా సీఓపీడీ (క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) లాంటివి ఉన్న వారికి అయితే సమస్య చాలా తీవ్రంగా వస్తోంది. నగర ట్రాఫిక్‌లో ఒక్కసారి అలా బయటకు వెళ్లి వస్తే వెంటనే తీవ్రమైన దగ్గు, ఆయాసం లాంటివాటితో వారు బాధపడుతున్నారు. తీవ్రమైన జ్వరంతో పాటు ఊపిరితిత్తుల సమస్య కూడా వారిని వేధిస్తోంది” అని డాక్టర్ ఎం.స్వామి తెలిపారు.
డాక్టర్ హరికిషన్ మాట్లాడుతూ, “ఈ సమస్యలన్నింటి నుంచి నగరవాసులు తమను తాము రక్షించుకోవాలి. అందుకు ముందుగా అసలు ఎలాంటి జ్వరం లేకముందే ఫ్లూ టీకాలు గానీ, క్వాడ్రలెంట్ టీకాలు (నాలుగు రకాల వైరస్‌లపై పోరాడేవి) గానీ తీసుకోవాలి. మామూలుగా అయితే వాటి సామర్థ్యం 6-8 నెలల పాటు పనిచేస్తుంది. కానీ, తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏడాది వరకు మళ్లీ టీకా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలకు వెళ్లడం మానుకోవాలి. ఇళ్లలోను, కార్యాలయాల్లోను ఎయిర్ ఫిల్టర్లు అమర్చుకోవడం మంచిది. రోజూ తప్పనిసరిగా ఆరేడు గ్లాసుల కాచి, చల్లార్చిన నీరు తాగాలి. నీరు బుడగలు వచ్చేవరకు కాచి, తర్వాత ఒక గంట చల్లార్చి వాటిని గాజు లేదా స్టీలు సీసాలో పోసుకుని తాగుతుండాలి. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వాడడం కూడా మానేయాలి. బయటి ఆహారం వీలైనంత వరకు మానుకోవాలి. ఇంట్లో వేడిగా చేసుకున్న, తాజా ఆహార పదార్థాలను మాత్రమే తినాలి. దానివల్ల గ్యాస్ట్రో ఎంటరైటిస్ రాకుండా ఉంటుంది. రద్దీ ప్రదేశాలకు వెళ్లడం వీలైనంత వరకు మానుకోవాలి. బయటకు వెళ్లినప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలి. ఏమైనా తినేముందు చేతులు శుభ్రం చేసుకోవాలి” అని చెప్పారు.
డాక్టర్ శ్రీకృష్ణ రాఘేవంద్ర, డాక్టర్ ప్రదీప్ కుమార్ పటేల్ మాట్లాడుతూ, “చాలామంది జ్వరం వచ్చినప్పుడు మొదటి రెండు మూడు రోజలు ఇంటివద్దే డోలో లాంటి టాబ్లెట్లు వేసుకుని తగ్గకపోతే అప్పుడు ఆస్పత్రికి వస్తున్నారు. దీనివల్ల తగిన పరీక్షలు చేయడానికి సమయం దాటిపోతుంది. అలా కాకుండా ఈ సీజన్‌లో వచ్చే జ్వరాలకు మాత్రం వీలైనంత వరకు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అప్పుడు లక్షణాలు చూసి, అవసరమైన రక్తపరీక్షలు చేయించి వాటికి తగిన మందులు ఇవ్వడానికి వీలుంటుంది. డెంగ్యూ, చికన్ గున్యా, ఇన్‌ఫ్లూయెంజా లాంటి వేర్వేరు రకాల సమస్యలకు వేర్వేరుగా మందులు వాడాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నగర పౌరుల ఆరోగ్యం భద్రంగా ఉంటుంది” అని సూచించారు.