సాక్షి, హనుమకొండ: జిల్లాలో దారుణం జరిగింది. సర్పంచ్ ఎన్నికల హామీల్లో భాగంగా వీధికుక్కలను హతమార్చి పాతిపెట్టిన సర్పంచ్‌లపై కేసులు నమోదు చేశారు. రెండు గ్రామాల్లో 120కి పైగా వీధి కుక్కల ప్రాణాలను గ్రామ పంచాయతీ సిబ్బంది బలి తీసుకున్నారు. వీధికుక్కలను చంపి పాతిపెట్టారు. శాయంపేట, ఆరేపల్లి రెండు గ్రామాల పరిధిలో ఘటన జరిగింది. ఇప్పటికే 120కి పైగా పాతిపెట్టిన వీధి కుక్కల కళేబరాలను పోలీసులు, వెటర్నరీ సిబ్బంది వెలికితీశారు.
వీధి కుక్కలకు పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు శాంపిల్స్ సేకరించారు. మొత్తం 9 మంది పై కేసులు నమోదు చేశారు. మరో వైపు కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతుందని.. ఆ వీధి కుక్కలకు స్కిన్ డిసీజ్ ఉండడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నామని గ్రామస్తులు అంటున్నారు. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.


