తెలంగాణ పల్లెల్లో మళ్లీ కొత్త పాలన మొదలైంది. ఊరూరా ఎన్నికల కోలాహలం ముగిసి, కొత్తగా ఎన్నికైన సర్పంచులు నియామక పత్రాలు అందుకుని గద్దెనెక్కారు. అయితే, కొంతమంది సర్పంచుల్లో ఈ విజయోత్సాహం వెనుక ఒక చేదు నిజం కూడా ఉంది. ఎన్నికల హోరాహోరీలో గెలుపు కోసం చాలా చోట్ల తాయిలాలు, నగదు ప్రవాహం రాజ్యమేలిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు కొత్త సర్పంచుల ముందున్న లక్ష్యం ఏమిటి? ఎన్నికల్లో ఖర్చు చేసిన పెట్టుబడిని రాబట్టుకునే మార్గాలను వెతకడమా? లేక పల్లె ప్రగతికి బాటలు వేయడమా? అనే సందిగ్ధం కొద్దిమందిలో నెలకొంది.
2018 తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం సర్పంచ్‌కు ఒక సామాన్య ప్రతినిధి హోదా నుంచి గ్రామ పాలకుడి స్థాయి అధికారాన్ని కట్టబెట్టింది. అధికారం అంటే ఆధిపత్యం కాదు.. పారిశుధ్యం, హరితహారం, మౌలిక వసతుల కల్పనలో చూపాల్సిన కార్యదక్షత. ఓటును కొనుక్కున్నామనే భావన పక్కన పెట్టి, గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా ప్రతి పైసాను అభివృద్ధికి వెచ్చించేలా సర్పంచులు అడుగులు వేయాల్సిన సమయం ఇది. పదవిని ఒక వ్యాపారంగా చూడకుండా, పల్లెను ఒక ఆదర్శంగా మార్చే బాధ్యతగా స్వీకరించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది.
తెలంగాణ రాష్ట్ర సామాజిక, ఆర్థిక వికాసానికి గ్రామాలు పట్టుకొమ్మలు. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామం ఒక స్వయం ప్రతిపత్తి గల యూనిట్‌గా పనిచేస్తుంది. ఈ వ్యవస్థలో సర్పంచ్ కేవలం ఒక ప్రతినిధి మాత్రమే కాదు, గ్రామ సర్వతోముఖాభివృద్ధికి సారథి.
పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచ్ విధులు
గ్రామసభ నిర్వహణ.. ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభను నిర్వహించి, ప్రజల అవసరాలను గుర్తించడం.
పారిశుధ్యం, ఆరోగ్యం.. గ్రామంలో చెత్త సేకరణ (తడి, పొడి చెత్త విభజన), మురుగు కాలువల శుభ్రత, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం సర్పంచ్ ప్రథమ కర్తవ్యం.
హరిత హారం.. గ్రామంలో నర్సరీల నిర్వహణ, నాటిన మొక్కల్లో కనీసం 85% బతికించాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉంటుంది.
ఆర్థిక నిర్వహణ.. పంచాయతీ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయడం, వార్షిక బడ్జెట్ ఆమోదించి, ఆడిటింగ్‌కు సహకరించడం.
మౌలిక సదుపాయాలు.. వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా, అంతర్గత రోడ్ల మరమ్మతులు పర్యవేక్షించడం.
ఎన్నికల ఖర్చు.. అభివృద్ధి కాంక్ష
ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భారీగా ఖర్చు చేశారనే వాదనలు ఉన్న మాట వాస్తవం. అయితే, ‘పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలి’ అనే ధోరణితో సర్పంచులు పనిచేస్తే, అది గ్రామానికి శాపంగా మారుతుంది. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అవినీతికి పాల్పడితే చట్టపరమైన చర్యలు (కలెక్టర్ ద్వారా తొలగింపు) ఎదుర్కోవాల్సి వస్తుందని గుర్తించాలి. రాజకీయ అధికారం అనేది కేవలం ఐదేళ్ల అవకాశం. ఈ సమయంలో సంపాదించిన సొమ్ము కంటే గ్రామంలో నిర్మించిన అభివృద్ధి చిహ్నాలు, ప్రజల గుండెల్లో సంపాదించుకున్న గౌరవం శాశ్వతంగా నిలిచిపోతాయి.
గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే మార్గాలు
కొత్తగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మార్చడానికి కొన్ని అంశాలపై దృష్టి సారించాలి. గ్రామ పంచాయతీ సేవలను ఆన్‌లైన్ చేయడం, ప్రతి పద్దును ప్రజల సమక్షంలో చర్చించి ఖర్చు చేయడం ద్వారా పారదర్శకతను పెంచవచ్చు. గ్రామ వనరుల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే మార్గాలను అన్వేషించాలి. పన్నుల వసూలులో క్రమశిక్షణ పాటించాలి. అంగన్‌వాడీలు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, స్వయం సహాయక సంఘాలకు తోడ్పాటు అందించాలి. ఏదైనా పని చేసే ముందు ప్రజల సలహాలను తీసుకోవడం వల్ల పనుల్లో నాణ్యత పెరుగుతుంది. జవాబుదారీతనం ఉంటుంది.
సర్పంచ్ పదవి అనేది కేవలం హోదా కాదు, అది ఒక గొప్ప సామాజిక బాధ్యత. ఎన్నికల్లోని ఖర్చును ఒక సామాజిక సేవగా భావించి, రాబోయే ఐదేళ్లు గ్రామ పురోభివృద్ధికి అంకితం కావాలి. పచ్చని చెట్లు, శుభ్రమైన వీధులు, విద్యావంతులైన యువత.. ఉన్న గ్రామమే నిజమైన బంగారు తెలంగాణకు పునాది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లాభపడటం కంటే ఒక తరాన్ని బాగు చేసే గ్రామ నాయకుడిగా ఎదగడమే సర్పంచుల అసలు విజయం.
ఇదీ చదవండి: టర్మ్ ఇన్సూరెన్స్.. డబ్బులు దండగా..!?


