ఢిల్లీ: సంజీవ్ ఖిర్వార్.. సీనియర్ ఐఏఎస్ అధికారి. మూడేళ్ల కిందట తన పెంపుడు కుక్కల వ్యవహారంలో వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి. నాడు వాటి మార్నింగ్ కోసం ఏకంగా స్టేడియం ఖాళీ చేయించి వివాదంలో చిక్కుకున్నారాయన. ఈ ఘటన తర్వాత కేంద్రం ఆయన్ని బదిలీ చేసింది. అయితే అనూహ్యంగా ఆయన మళ్లీ సీన్‌లోకి వచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్‌ను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఉన్న కమిషనర్ అశ్వనీ కుమార్‌ను జమ్మూ కశ్మీర్‌కు బదిలీ చేశారు. త్వరలో ఢిల్లీ కార్పొరేషన్ బడ్జెట్ సమర్పణ ఉంది. సరిగ్గా దీని ముందరే.. ఖిర్వార్‌కు బాధ్యతలు అప్పజెప్పడం గమనార్హం. అదే సమయంలో ఆయన డాగ్ లవర్ కావడం ఇక్కడ మరో చర్చకు దారి తీసింది.
1994 బ్యాచ్ ఏజీఎంయూటీ కేడర్‌కి చెందిన ఖిర్వార్.. 2022లో ఢిల్లీ త్యాగరాజ్ స్టేడియంలో క్రీడాకారులను బయటకు పంపించి, తన పెంపుడు కుక్కను వాకింగ్ చేయించాడనే ఆరోపణలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయన ఢిల్లీ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన వల్ల తాము ఇబ్బంది పడ్డామని కొందరు అథ్లెట్లు ఆనాడు మీడియా ముందు వాపోయారు కూడా. అయితే తానే తప్పూ చేయలేదని.. తానొక శునక ప్రియుడ్ని అని ఆ టైంలో గర్వంగా ప్రకటించుకున్నారాయన.
ప్రస్తుతం వీధి కుక్కల అంశం ఢిల్లీతో పాటు దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. ఈ విషయంలో సుప్రీం కోర్టు విచారణ సైతం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఖిర్వార్ నేతృత్వంలో కార్పొరేషన్ కుక్కల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది.


