Cases registered
-
భారీగా బ్యాంకింగ్ మోసాలు..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాంకింగ్ మోసాల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు రూ. 21,367 కోట్ల విలువ చేసే మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. విలువపరంగా చూస్తే మోసాల పరిమాణం ఏకంగా ఎనిమిది రెట్లు పెరిగింది. దేశీయంగా బ్యాంకింగ్ తీరుతెన్నుల గురించి రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో 2023–24 ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రథమార్ధం వరకు ధోరణులను పొందుపర్చారు. దీని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కాలంలో రూ. 21,367 కోట్ల మొత్తానికి సంబంధించి 18,461 కేసులు నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో రూ. 2,623 కోట్లకు సంబంధించి 14,480 కేసులు వచ్చాయి. వ్యాపారాలకు రిసు్కలు మొదలుకుని కస్టమర్ల నమ్మకం దెబ్బతినడం వరకు ఈ మోసాల వల్ల వివిధ సవాళ్లు ఉంటున్నాయని నివేదిక పేర్కొంది. ఆర్థిక స్థిరత్వంపై వీటి ప్రభావం గణనీయంగా ఉంటుందని వివరించింది. నివేదికలోని మరిన్ని ముఖ్యాంశాలు.. → దశాబ్దకాలంలోనే అత్యంత తక్కువగా 2023–24లో ఫ్రాడ్ కేసులు వచ్చాయి. సగటు విలువ 16 ఏళ్ల కనిష్ట స్థాయిలో నమోదైంది. ఇక ఇంటర్నెట్, కార్డ్ ఫ్రాడ్ల విషయానికొస్తే.. విలువపరంగా చూస్తే 44.7 శాతంగా ఉండగా, కేసులపరంగా చూసినప్పుడు 85.3 శాతంగా ఉంది. → 2023–24లో మొత్తం ఫ్రాడ్ కేసుల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా 67.1 శాతంగా ఉంది. అయితే, విలువపరంగా చూస్తే మాత్రం ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా అత్యధికంగా నమోదైంది. విదేశీ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు మినహా అన్ని నియంత్రిత సంస్థలపై విధించిన పెనాల్టీలు రెట్టింపై రూ. 86.1 కోట్లకు చేరాయి. సహకార బ్యాంకులపై జరిమానాల పరిమాణం తగ్గింది. → బ్యాంకుల లాభదాయకత వరుసగా ఆరో ఏడాది 2023–24లోనూ మెరుగుపడింది. స్థూల మొండిబాకీలు 13 ఏళ్ల కనిష్టమైన 2.7 శాతానికి తగ్గాయి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నికర లాభం గత ఆర్థిక సంవత్సరం 32.8 శాతం పెరిగి రూ. 3,59,603 కోట్లకు చేరింది. ఏఐ వినియోగంపై ప్రత్యేక కమిటీ ఆర్థిక రంగంలో బాధ్యతాయుతంగా, నైతికంగా కృత్రిమ మేథను (ఏఐ) వినియోగించుకునేందుకు విధానాల రూపకల్పన కోసం రిజర్వ్ బ్యాంక్ ఎనిమిది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించింది. దీనికి ఐఐటీ బాంబే ప్రొఫెసర్ పుష్పక్ భట్టాచార్య సారథ్యం వహిస్తారు. తొలి సమావేశం అనంతరం ఆరు నెలల వ్యవధిలో కమిటీ తన నివేదికను సమరి్పస్తుందని ఆర్బీఐ పేర్కొంది. -
‘మొండితోక’ సోదరులపై కక్ష సాధింపు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గతంలో చోటుచేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీడియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరుడు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్ నిత్యం ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతున్నారు. అరుణ్‌కుమార్ శాసనమండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్రపన్నారు. దీంతో.. 2022 నవంబరు 4న చంద్రబాబు నందిగామలో పర్యటనలో రాళ్ల దాడి జరిగిందంటూ అప్పట్లో నానా హంగామా చేశారు.కానీ, అది వర్కవుట్ కాలేదు. రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా తాజాగా ఆ ఉదంతంలో ఆధారాల్లేకున్నా, పోలీసులు గతంలో నమోదుచేసిన సెక్షన్–324ను మార్చి కొత్తగా 120 (బి), 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలుగురు నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసులను అరెస్టుచేసి, ఆదివారం నందిగామ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి పోలీసుల తీరును తప్పుపడుతూ సెల్ఫ్ బెయిల్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో కక్షసాధించేందుకు మరిన్ని అరెస్టులు ఉంటాయని, మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని ఎల్లో మీడియాకు లీకులు ఇస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అది కట్టు కథే.. అప్పుడే బట్టబయలునిజానికి.. అప్పట్లో చంద్రబాబు పర్యటన అంతా పక్కాగా ప్రణాళికతో నిర్వహించారు. నాడు నందిగామలో రోడ్డుషో జరుగుతున్న దారిలో ఆయన భద్రతాధికారిపై ఎవరో రాయి విసిరారని రాద్ధాంతం చేశారు. ఇంతలో మధుబాబు అనే వ్యక్తి తనకు గాయమైందంటూ చంద్రబాబు వద్దకు రావడం, ఆ వెంటనే దాడి జరిగిందని చంద్రబాబు ప్రకటించడం జరిగిపోయింది. అయితే, పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదు. పైగా.. బాధితుడు దాడిపై కాలయాపన చేసి రెండోరోజు కానిస్టేబుల్‌తో ఫిర్యాదు పంపారు. పోలీసులు మెడికల్ టెస్ట్‌కు రమ్మని పిలిచినా రాలేదు. మధుబాబుకు గాయమైందని చెబుతున్న గడ్డం ప్రాంతంలో వాపులేదని ప్రాథమికంగా నిర్ధారించారు. అలాగే, కెమెరా ఫుటేజీ, డ్రోన్ విజువల్స్‌లో ఎక్కడా దాడి జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో చంద్రబాబు ఆరోపణ అవాస్తవమని తేలిపోయింది. అయినా ఇప్పుడు మొండితోక సోదరులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు కోసం, నాటి సంఘటనను మళ్లీ ఉపయోగించుకోవటం విస్మయానికి గురిచేస్తోంది. -
ఈ–చలానాల పేరిట రూ.కోట్లు కొట్టేశారు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పోలీసులు విధించే ఈ–చలానా వసూళ్లలో రూ.36.53 కోట్లను పక్కదారి పట్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటనపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని గుంటూరు రేంజి ఐజీ జి.పాలరాజు తెలిపారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ–చలానా వసూలుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే సంస్థ ఒక క్లోన్ అకౌంట్ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించామని, సంబంధిత వ్యక్తుల అన్ని ఖాతాలు సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇందులో గతంలో డీజీపీగా పనిచేసిన నండూరి సాంబశివరావు అల్లుడు అవినాశ్ కొమ్మిరెడ్డి, అతని సోదరి అక్షిత, మరికొందరి పాత్ర ఉన్నట్టు గుర్తించినట్టు వెల్లడించారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని, ప్రజల సొమ్ము ప్రభుత్వానికి రాకుండా చేసిన ఈ కేసులో ఉన్న ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. రూపాయికే టెండర్ వేసి.. రూ.కోట్లు కొల్లగొట్టారు మోటారు వాహనాలపై విధించే చలానాల వసూలుకు సంబంధించి 2015 నుంచి ‘కృష్ణా సొల్యూషన్స్’ అనే సంస్థ కొన్ని జిల్లాల్లో సేవలు అందిస్తోందని ఐజీ పాలరాజు చెప్పారు. ఈ అప్లికేషన్ వాడుతున్నందుకు ప్రతి చెల్లింపుదారు నుంచి రూ.5 చొప్పున యూజర్ చార్జీగా ఆ సంస్థ వసూలు చేస్తోందన్నారు, 2017 జూన్‌లో అప్పటి డీజీపీ నండూరి సాంబశివరావు ‘డేటా ఎవాన్ సొల్యూషన్స్’ అనే సంస్థ ఆధునికీకరించిన సాఫ్ట్వేర్ ఉందని, దీనిని కూడా ఉపయోగించమని సర్క్యులర్ ఇచ్చారని వివరించారు. దీంతో కృష్ణా సొల్యూషన్స్‌తో పాటు డేటా ఎవాన్ సొల్యూషన్స్ సేవలను కూడా వచ్చారన్నారు. 2018లో ఒక్కో జిల్లాలో ఒక్కో పద్ధతి వాడుతుండటంతో అన్నిచోట్ల ఒకే పద్ధతి ఉండాలనే ఉద్దేశంతో డేటా సొల్యూషన్స్ ఎంపిక కోసం ఓపెన్ టెండర్లు పిలిచామన్నారు. టెండర్ విలువ రూ.2 కోట్లుగా నిర్ణయించామని చెప్పారు. ఈ టెండర్లలో రెండు సంస్థలు పాల్గొన్నాయన్నారు. కృష్ణా సొల్యూషన్స్ రూ.1.97 కోట్లకు టెండర్ వేయగా.. డేటా ఎవాన్ సొల్యూషన్స్ కేవలం ఒక్క రూపాయికే టెండర్ వేసిందన్నారు. అదేమని అడగ్గా.. తాము ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున సేవగా చేయాలన్న ఉద్దేశంతో కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకుంటున్నామని, మిగిలిన రాష్ట్రాల్లో వచ్చిన డబ్బులతో సంస్థను నడుపుతామని చెప్పడంతో డేటా ఎవాన్ సంస్థకే టెండర్ కేటాయించినట్టు వివరించారు. అందరిపైనా కేసులు డేటా ఎవాన్ సొల్యూషన్‌తో పాటు రేజర్పీఈ అనే నకిలీ కంపెనీని సృష్టించి నగదు దారి మళ్లించిన వారందరిపైనా కేసులు నమోదు చేశామని ఐజీ తెలిపారు. తమ శాఖకు సాంకేతిక సహకారం అందిస్తున్న కొత్తపల్లి రాజశేఖర్‌ను అరెస్ట్ చేశామని, అతని బినామీ ఆస్తులను గుర్తిస్తున్నామని చెప్పారు. కంపెనీ డైరెక్టర్లు కొమ్మిరెడ్డి అవినాష్, అక్షిత, రవికిరణ్‌తో పాటు సాఫ్ట్‌వేర్‌ను ఎవరు నిర్వహించారో, ఎవరు సహకరించారో వారిని కూడా గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. త్వరలోనే ఈ కేసు విచారణ పూర్తిచేసి బాధ్యులందరినీ అరెస్ట్ చేస్తామని పాలరాజు స్పష్టం చేశారు. ఇలా కొట్టేశారు ఈ–చలానా అప్లికేషన్‌కు డబ్బులు వివిధ పేమెంట్ గేట్‌వేల ద్వారా వస్తాయని పాలరాజు చెప్పారు. పేటీఎం, ఏపీ ఆన్లైన్, మీసేవ, డెబిట్, క్రెడిట్ కార్డులు, వెబ్, రేజర్‌పే వంటి విధానాల్లో చలానా మొత్తాల చెల్లింపులు జరుగుతుంటాయని పేర్కొన్నారు. ఇలా వచ్చిన డబ్బులన్నీ డీజీ అకౌంట్‌కు అనుసంధానం అవుతాయన్నారు. చెల్లింపులు జరుగుతున్న తరుణంలో కొంత అవకతవకలు జరుగుతున్నట్టు తిరుపతి యూనిట్లో గుర్తించారన్నారు. ప్రతి రోజూ ఎంత వస్తుందన్నది డాష్‌బోర్డులో కనపడుతుందని, ప్రతినెలా 1వ తేదీన వసూలు చేసిన మొత్తం కొద్దిరోజుల తర్వాత చూస్తే తగ్గుతున్నట్టు గుర్తించడంతో విచారణ మొదలు పెట్టామన్నారు. దీనిపై లోతుగా విచారణ చేయడంతో పెద్దఎత్తున మోసం జరుగుతున్న విషయం వెలుగు చూసిందన్నారు. రేజర్‌పే ద్వారా వచ్చిన మొత్తాన్ని వేరే ఖాతాకు మళ్లించుకున్నట్టు గుర్తించామన్నారు. దీనికి సంబంధించి 2018లోనే ఒక క్లోనింగ్ ఖాతాను సృష్టించి.. దానిద్వారా డబ్బులను తమ ఖాతాలకు మళ్లించుకున్నారన్నారు. ఈ విధంగా పోలీసు శాఖకు రావాల్సిన రూ.36.53 కోట్లను వివిధ ఖాతాలకు మళ్లించినట్టు గుర్తించి వాటిని సీజ్ చేశామన్నారు. ఏ ఖాతాలకు మళ్లించారో ఆ ఖాతాల ద్వారా 2019 నుంచి కొనుగోలు చేసిన ఆస్తులను గుర్తించామని వివరించారు. -
సెంట్రల్ ఢిల్లీలో డ్రోన్ కలకలం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్రం జరుగుతున్న సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో ఓ డ్రోన్ ఎగరడంతో పోలీస్ అధికారులను చెమటలు పట్టించింది. ఆ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బర్త్‌డే పార్టీని షూట్ చేసేందుకు వాడిన డ్రోన్ అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని సంబంధీకుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. జీ20 సదస్సు నేపథ్యంలో అధికారులు ముందు జాగ్రత్తగా ఆగస్ట్ 29 నుంచి ఈ నెల 12 వరకు పలు భద్రతా చర్యలు ప్రకటించారు. పారా గ్లైడర్లు, బెలూన్లు, డ్రోన్ల వంటివి ఎగరేయడంపై నిషేధం కూడా అందులో ఉంది. ఇవేమీ పట్టించుకోకుండా సెంట్రల్ ఢిల్లీలోని షాది ఖాంపూర్‌కు చెందిన హర్మన్‌జీత్ సింగ్(29) బంధువు పుట్టిన రోజు వేడుకను తన నివాసం టెర్రస్‌పై ఏర్పాటు చేశాడు. దీనిని షూట్ చేసేందుకు డ్రోన్‌ను వాడాడు. జీ20 శిఖరాగ్రం జరుగుతున్న ప్రాంతంలో ఇది ఆకాశంలో ఎగురుతుండటం గమనించిన కంట్రోల్ స్టేషన్ అధికారులు, అక్కడి పోలీసులను అలర్ట్ చేశారు. వారు వెంటనే డ్రోన్‌ను వినియోగిస్తున్న హర్మన్‌జీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్లోని ఫుటేజీని పరిశీలించడగా అది బర్త్‌డే పార్టీకి సంబంధించిందేనని తేలింది. డ్రోన్‌ను స్వాధీనం చేసుకుని అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. -
ప్రతిపక్షాల ఆరోపణలు.. ఎంతమంది నేతలపై కేసులున్నాయో చెప్పిన ఈడీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్త.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ). విపక్ష నేతలనే ఈడీ లక్ష్యంగా చేసుకుంటోందన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో తమ కేసుల దర్యాప్తు తదితర వివరాలను సంస్థ తాజాగా ప్రకటించింది. తాము నమోదుచేసిన కేసుల్లో ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులు కేవలం 2.98 శాతమేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పష్టంచేసింది. అయితే మనీలాండరింగ్ చట్టం కింద నమోదైన ఈ 2.98 శాతం కేసుల్లో నేర నిరూపణ శాతం ఏకంగా 96 శాతం ఉండటం గమనార్హం. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్ చట్టం, పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం(ఎఫ్ఈఓఏ)ల కింద ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు నమోదైన మొత్తం కేసుల తాలూకు తాజా స్థితిగతులను ఈడీ విడుదలచేసింది. ఈడీ గణాంకాల ప్రకారం... ► మనీ లాండరింగ్ చట్టం అమల్లోకి వచ్చాక ఇప్పటిదాకా మొత్తంగా 5,906 ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్(ఈసీఐఆర్– ఎఫ్ఐఆర్ లాంటిదే)లు నమోదుకాగా వాటిలో ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై దాఖలైన కేసులు కేవలం 176 (2.98 శాతం) ఉన్నాయి. ► అన్నింటిపై కోర్టుల్లో మొత్తంగా 1,142 అభియోగ పత్రాలు నమోదుచేశారు. 513 మందిని అరెస్ట్‌చేశారు. కేవలం 25 కేసుల విచారణ పూర్తయింది. 24 కేసుల్లో నిందితులు దోషులుగా తేలారు. అంటే మొత్తంగా 45 మందిని కోర్టులు దోషులుగా నిర్ధారించింది. అంటే 96 శాతం నేరనిరూపణ జరిగింది. ► 5,906 కేసుల్లో 531 కేసులకు సంబంధించి మాత్రమే సోదాలు, ఆకస్మిక తనిఖీలు జరిగాయి. అంటే కేవలం 9 శాతం కేసుల్లోనే సోదాలు చేశారు. ► మొత్తం కేసుల్లో ఇప్పటిదాకా ఆస్తుల జప్తు/అటాచ్‌మెంట్‌కు సంబంధించి 1,919 ఉత్తర్వులను ఈడీ జారీచేసింది. రూ.1,15,350 కోట్ల ఆస్తులను జప్తుచేసింది. ► ఫెమా చట్టం కింద దాదాపు 34 వేల కేసులు నమోదయ్యాయి. ► ఎఫ్ఈఓఏ చట్టం కింద 15 మందిపై కేసులు నమోదుకాగా తొమ్మిది మందిని పరారైన నేరగాళ్లుగా ప్రకటించారు. -
కైటెక్స్ వాస్తు కోసం భూ సర్వే
గీసుకొండ: ఓ కంపెనీ అడిగిన మేర ప్రభుత్వం భూములు కట్టబెడుతున్న వైనం వివాదాస్పదమవుతోంది. వరంగల్ జిల్లాలోని గీసుకొండ– సంగెం మండలాల పరిధిలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో చిన్న పిల్లల గార్మెంట్లు తయారీకి కేరళకు చెందిన కైటెక్స్ కంపెనీని నెలకొల్పుతున్నారు. ఇప్పటికే పార్కులో కంపెనీకి 187 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. షెడ్ల నిర్మాణం జరుగుతుండగా ప్రహరీ గోడ వంకరగా ఉందని, వాస్తు సవరించుకోవడానికి మరో 13.29 ఎకరాలు కావాలని కంపెనీ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు సమ్మతించిన రెవెన్యూ యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమైంది. ఈ క్రమంలో శాయంపేటహవేలి పరిధిలో కేటాయించేందుకు రైతులకు నోటీసులు జారీ చేశారు. శనివారం ఉదయం అధికారులు సర్వేకు రాగా పోలీసులు రైతుల చేలవద్ద మొహరించారు. పోలీసులు, రెవెన్యూవర్గాలపై రైతుల ఆగ్రహం ఈ క్రమంలో పోలీసులు, రెవెన్యూ అధికారులపై రైతులు మండిపడ్డారు. సర్వేను నిలిపివేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పలువురు మహిళా రైతులు క్రిమిసంహారక మందు డబ్బాలను పట్టుకుని నిరసన తెలపగా వారిని పోలీసులు నివారించారు. ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు సంగెం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత రెవెన్యూ సిబ్బంది సర్వే పనులను కొనసాగించారు. ‘‘ఎకరా రూ.50లక్షలుంటే మాకు పది లక్షలే ఇచ్చారు’’ కేఎంటీపీ కోసం కొంత భూమిని ఇప్పటికే ఇచ్చామని, ఎకరానికి రూ.10 లక్షల చొప్పున చెల్లించిన ప్రభుత్వం ప్రతి ఎకరానికి వంద గజాల ఇంటి స్థలం, పార్కులో ఉద్యోగం ఇప్పిస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదని రైతులు వాదిస్తున్నారు. తమ దగ్గర కారుచౌకగా భూములను తీసుకుని కంపెనీలకు ఐదారు రెట్ల ధరలకు అమ్ముతోందని ఆరోపిస్తున్నారు. సారవంతమైన రెండు పంటలు పండే నీటి వసతి ఉన్న తమ భూములకు ఎకరానికి సుమారు రూ.50లక్షల మేర మార్కెట్ ధర ఉందన్నారు. ప్రభుత్వం ఇచ్చే ధర తమకు సమ్మతం కాదన్నారు. -
లాక్డౌన్ ఉల్లంఘనులపై కేసులు
సాక్షి, కర్నూలు: జిల్లాలో లాక్డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా షాపులను తెరిచిన దుకాణదారులు, ఇతర వ్యక్తులపై 28 కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై 800 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి అపరాధ రుసుములు విధించడంతో పాటు, 13 వాహనాలను సీజ్ చేశారు. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.8,160 నగదు, లిక్కర్ బాటిళ్లు, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
కోవిడ్ మృతులు 2,293
న్యూఢిల్లీ: దేశంలో మంగళవారం నాటికి కరోనా వైరస్‌తో 2,293 మంది మృతి చెందగా, మొత్తం కేసులు 70,756కు చేరుకున్నాయి. ఈ మహమ్మారితో 24 గంటల్లో 87 మంది చనిపోగా కొత్తగా 3,604 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ బారిన పడి ఇప్పటివరకు 22,454 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా రికవరీ రేటు 31.74 శాతంగా ఉందని పేర్కొంది. కోవిడ్ బాధిత మృతుల్లో 70 శాతం వరకు ఇతర అనారోగ్య సమస్యల వల్లే సంభవించాయని తెలిపింది. కేసులు రెట్టింపయ్యేందుకు 12.2 రోజులు దేశంలో కరోనా కేసులు రెట్టింపయ్యే సమయం 10.9 రోజుల నుంచి 12.2కు చేరుకుందని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. దేశంలోని 347 ప్రభుత్వ, 137 ప్రైవేట్ ల్యాబొరేటరీలకు రోజులో ఒక లక్ష కోవిడ్–19 పరీక్షలు జరిపే సామర్థ్యముందన్నారు. ఇప్పటి వరకు 17,62,840 పరీక్షలు జరగ్గా, మంగళవారం ఒక్కరోజే 86,191 నమూనాలను పరీక్షించారని ఆయన వెల్లడించారు. నర్సులు లేకుండా కోవిడ్‌పై గెలవలేం నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తలు సేవలందించకుంటే కోవిడ్ మహమ్మారిపై గెలుపు సాధించలేమని మంత్రి హర్షవర్ధన్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా వారి సేవలను మంత్రి కొనియాడారు. ‘ నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు లేకుండా కోవిడ్‌పై గెలుపు సాధించలేం. ఆరోగ్య కార్యకర్తలు, నర్సులకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాం’అని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ సర్వే దేశంలో కరోనా తీవ్రత ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) సర్వే చేపట్టనుంది. జనాభా ఆధారిత సెరో సర్వేను దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 69 జిల్లాల్లో చేపట్టనుంది. కోవిడ్–19 కేసుల ఆధారంగా నాలుగు రకాలుగా జిల్లాలను విభజించి 24 వేల మంది నుంచి వివరాలు సేకరించనుంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగిందీ లేనిదీ తెలుసుకునేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుందని ఓ అధికారి తెలిపారు. సెరో సర్వే అంటే ఒక సమూహంలోని వ్యక్తుల రక్తంలోని సీరంను పరీక్షించడం. ఈ వేసవిలో అసాధారణ పరిస్థితులు మే నెల అంటే భగ్గుమనిపించే ఎండలు..ఆపై ప్రాణాలు తీసే వడగాలులు..కానీ, ఈ ఏడాది మే నెల సగం పూర్తి కావొస్తున్నా వడగాలులు లేవు సరికదా అత్యధిక వర్షపాతం నమోదైంది. అందుకే ఇది అసాధారణ వేసవి అంటున్నారు వాతావరణ నిపుణులు. ఉత్తర, పశ్చిమ మైదాన ప్రాంతం, విదర్భ–మరాఠ్వాడా, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటి తీవ్రమైన ఎండలు కాస్తాయి. పశ్చిమ రాజస్తాన్లోనైతే అత్యధికంగా 50 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ, ఈసారి తీవ్రంగా ఎండలు కాసే చోట సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలకు నమోదయ్యే అవకాశాలున్నప్పటికీ మరీ ఎక్కువగా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు. ఏప్రిల్‌లో రెండు విడతలుగా వడగాలులు వీస్తాయి. కానీ, ఈ ఏడాది గుజరాత్లో మాత్రమే, అదీ కొద్దిపాటి వడగాలి వీచిందని పుణెలోని వాతావరణ విభాగం నిపుణులు తెలిపారు. మే నెలలో పశ్చిమం నుంచి రెండు సార్లు గాలులు వీయగా, త్వరలోనే మరో దఫా వచ్చే అవకాశాలున్నాయన్నారు. అయితే, ఈ నెల 16వ తేదీ తర్వాత దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసింది. -
‘2జీ’ జాప్యంపై సుప్రీం ఆగ్రహం
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రం కేసుల దర్యాప్తులో జాప్యాన్ని తప్పుపడుతూ సీబీఐ, ఈడీలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2జీ, అందులో భాగమైన ఎయిర్‌సెల్–మాక్సిస్ ఒప్పందంలో అవకతవకలపై దర్యాప్తును ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. ముఖ్యమైన ఇలాంటి కేసుల్లో ప్రజలకు వాస్తవాలు తెలియకుండా దాచిపెట్టకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ‘2జీ స్పెక్ట్రం, అనుబంధ కేసుల్లో దర్యాప్తు ముగించేందుకు ఎందుకింత జాప్యం జరుగుతోంది. 2010లో సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించింది. ఇంతవరకూ ఎందుకు విచారణ పూర్తి చేయలేదో చెప్పండి’ అని నిలదీసింది. కేసు దర్యాప్తు జాప్యం వెనుక ఏదైనా అదృశ్య శక్తి హస్తముందా? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. ‘ ఈ కేసుతో సంబంధమున్న అందరిపై కేసులు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ జరపండి. దర్యాప్తు తీరుపై అసంతృప్తిగా ఉన్నాం’ అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. ‘టెలికం మాజీ మంత్రి రాజాకి ప్రమేయమున్న 2జీ కేసులో నిందితుల్ని ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అదేవిధంగా ఇతర అనుబంధ కేసుల్లో నిందితులపై ఆరోపణల్ని కూడా కొట్టివేశారు. కేవలం మలేసియా వ్యాపారవేత్త టీ ఆనంద కృష్ణన్‌కు ప్రమేయమున్న ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తు మాత్రమే పెండింగ్‌లో ఉంది. అతను మలేసియాలో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో అతన్ని భారత్‌కు రప్పించలేకపోయాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా కోర్టు జోక్యం చేసుకుంటూ... కేసు దర్యాప్తు పురోగతిపై రెండు వారాల్లోగా స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఆదేశించింది. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వాదిస్తూ.. ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని ఇంతకముందే కోర్టు ఆదేశించిందని, అయితే కేసులోని ఒక నిందితుడి బెడ్రూంలో ఆ ఫైల్ ఉందని ఆరోపించారు. ఎయిర్‌సెల్–మాక్సిస్ కేసు నుంచి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్ పేర్లను ప్రత్యేక కోర్టు తప్పించినా.. ఒప్పందానికి ఎఫ్ఐపీబీ ఇచ్చిన అనుమతిపై మాత్రం సీబీఐ విచారణ కొనసాగుతోంది. -
కట్నం కేసులో బుక్కైన రెండు కుటుంబాలు
ఫరీదాబాద్: అదనపు కట్నం కోసం ఇద్దరు మహిళలను వేధిస్తున్న రెండు వేర్వేరు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయినట్టు పోలీసులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. హార్యానాలోని దయల్‌పూర్‌లో నివాసముంటున్న అన్సూ అనే మహిళకు గత జనవరి నెలలో ప్రవీణ్‌తో వివాహం అయింది. పెళ్లైనా నాటినుంచి కట్నం కోసం అత్తమామలు తనను వేధిస్తూ చిత్రహింసలకు గురిచేస్తున్నారంటూ ఆమె శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఆమె భర్త ప్రవీణ్ సహా అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దయల్‌పూర్‌లో గాంధీ కాలనీలో అదనపు కట్నం కోసం వేధిస్తున్న నలుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మిత్తు అనే మహిళ, తనను భర్త శ్యామ్, కుటుంబ సభ్యులు కలిసి అసభ్యంగా ప్రవర్తిస్తూ.. కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ రెండు ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు పేర్కొన్నారు.