
కొన్ని సంవత్సరాల క్రితం నగర శివార్లలో కొత్తగా ఏర్పడనున్న కాలనీలో ఒక భూమి కొని రిజిస్టర్ చేసుకున్నాను. కాలనీలో చాలామంది ఇళ్లు కూడా కట్టుకున్నారు. మేము ఇల్లు కడుతుంటే కొందరు స్థానికులు వచ్చి మా స్థలాన్ని వాళ్లకు అమ్మేయమని బలవంతపెట్టారు. ఇదేమిటని ప్రశ్నిస్తే ‘‘మీరు దళితులని తెలియక భూమిని అమ్మాము. మీవల్ల పక్క ప్లాట్లకు ధర తగ్గుతుంది. కాలనీలో మీరు ఒక్కరే దళితులు. ప్రస్తుత మార్కెట్ ధర ఇస్తాము వెళ్లిపొండి’’ అన్నారు. మేము వినలేదని, కక్ష సాధింపుగా మాది అక్రమ కట్టడం అంటూ అధికారులకు ఫిర్యాదు చేసి ఇబ్బంది పెడుతున్నారు. మున్సిపల్ అధికారులు కూడా వారితో కుమ్మక్కయ్యారు. మాకు అర్థంలేని నోటీసులు జారీ చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. మాకు తగిన సలహా ఇవ్వగలరు.
– వీరన్న స్వామి, హైద్రాబాద్
78 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కూడా కుల వివక్ష చూడటం, అందులోనూ హైదరాబాద్ వంటి మహా నగరాలలో కూడా వివక్ష ఇంకా ఉండటం బాధాకరం. ఇటీవలే మీ లాంటి ఒక కేసు చూశాను. మీరు ముందుగా పోలీసులని ఆశ్రయించి సదరు వ్యక్తులపై ఎస్.సి. ఎస్.టి. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయండి. అట్రాసిటీ చట్టంలోని సెక్షన్ 3 (జ)–(జ) ప్రకారం ఎస్.సీ – ఎస్.టి.ల ఆస్తిని గానీ, వారికి కేటాయించిన భూములను గానీ, నివాసముంటున్న స్థానాన్ని గానీ అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, లేదా అక్రమంగా వారి పేరు తొలగించడం
– అలాగే వారి సంపదలో, నీటి సరఫరాలో, వ్యవసాయ దిగుబడి మొదలగు అంశాలలో జోక్యం చేసుకోవడం, వారి ఆస్తులకు భంగం కలిగించడం వంటి చర్యలకు కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలు అధికార దుర్వినియోగం చేసే ప్రభుత్వ అధికారులకు కూడా వర్తిస్తాయి. అవసరమైతే, మీ హక్కులకు భంగం కలిగించే విధంగా మునిసిపల్ అధికారుల పాత్ర ఉంటే సదరు అధికారులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయవచ్చు.
ఎస్.సి. – ఎస్.టి. చట్టం చాలా పటిష్టమైనది. ఎన్నో తప్పులు – అందుకు తగ్గ కఠిన శిక్షలు ఉన్నాయి. కానీ పోలీసులు మాత్రం కేసు ఏదైనా, కేవలం ‘‘కులం పేరుతో దుర్భాషలాడారు’’ అని మాత్రమే కేసులు పెట్టడం సర్వసాధారణం ఐపోయింది. అది తప్పు. ఈ చట్టం ప్రకారం మీరు ఒక న్యాయ సలహాదారు/సామాజిక కార్యకర్తను మీ వెంట పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళవచ్చు. అది మీ హక్కు.
సరైన రీతిలో కేసు నమోదు చేస్తే మీకు ఖచ్చితమైన న్యాయం దొరుకుతుంది. క్రిమినల్ కేసులు మాత్రమే కాకుండా మునిసిపల్ అధికారులు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పారు కాబట్టి వారిపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయండి. మీ కేసుకు సంబంధించిన పత్రాలను పరిశీలించిన తర్వాత లాయర్ సలహా మేరకు సివిల్ కోర్టును ఆశ్రయించాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు.
– శ్రీకాంత్ చింతల హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)
(చదవండి: చిన్నారులకు వంశవృక్షం తెలియాలి..! కనీసం ఓ మూడు తరాలు..)