
మా తల్లిదండ్రుల నలుగురు సంతానంలో నేను మూడవ వాడిని. వారు కొనుగోలు చేసిన ఆస్తులను మా నలుగురి పేరిట పెడుతూ వచ్చారు. మా అన్నయ్య ఒకరు దాదాపు 15 ఏళ్ల క్రితం, అతనికి 19 ఏళ్ళ వయసులో కనపడకుండా పోయారు. ఆయనకి మతిస్థిమితం లేదు. అప్పట్లో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాము. మా అన్నయ్య పేరు మీద ఉన్న ఆస్తులు పలు జిల్లాలలో ఉన్నాయి. అందులో నుంచి వచ్చే ఆదాయాన్ని మా అమ్మగారు తీసుకుంటున్నారు. ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మా తల్లిదండ్రుల పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ మిగిలిన ముగ్గురికి ఇవ్వాలని మా అమ్మగారు అనుకుంటున్నారు. కానీ కనపడకుండా పోయిన మా అన్నయ్య ఆస్తులను మాత్రం తన జీవితకాలం మొత్తం ఇవ్వను అంటున్నారు. ఒకవేళ తన పెద్ద కొడుకు తిరిగి వస్తే అతనికే చెందేలా చేస్తాను అంటున్నారు. ఆ ఆస్తుల్లో మాకు భాగం వుండదా?
– గౌతం, హైదరాబాద్
మీ అమ్మానాన్నల పేరుతో ఉండే ఆస్తులు వారు ఎవరికి కావాలంటే వారికి... ఏ ప్రాతిపదికన.. ఎంత ఇవ్వాలనేది వారి నిర్ణయం మాత్రమే! కనబడకుండా పోయిన మీ అన్నయ్య ఆస్తి కూడా మీ అమ్మానాన్నలు కలిసి సంపాదించారు అని చెప్తున్నారు కాబట్టి అందులో మీకు ఎటువంటి వాటా ఉండదు. ఏది ఏమైనా, కనపడకుండాపోయిన ఒక వ్యక్తి ఆస్తి తన ఫస్ట్ క్లాస్ లీగల్ హేర్ (అంటే, తన భార్య, సంతానం, తల్లి గారు)కు మాత్రమే ఉంటుంది.
మీ కేసులో, కనపడకుండా పోయిన తన కొడుకు ఆస్తిపై కేవలం మీ తల్లి గారికి మాత్రమే హక్కు ఉంది. ఒక వ్యక్తి ఏడు సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం కనపడకపోతే, భారతీయ సాక్ష్య అథినయం సెక్షన్ 111 (పూర్వం సెక్షన్ 108, ఇండియన్ ఎవిడెయాక్ట్) ప్రకారం చట్టం ఆ వ్యక్తిని ‘‘చట్టపరంగా మరణించిన వ్యక్తి’’గా పరిగణిస్తుంది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆస్తులు ఎలాగైతే పంచుతారో అలాగే ఈ ఆస్తులను కూడా పంచవలసి ఉంటుంది.
మీ తల్లిగారు బతికే ఉన్నారు కాబట్టి, తప్పిపోయిన అన్నయ్యకు పెళ్లి కాలేదు కాబట్టి, అలాగే ఆ ఆస్తి పూర్వీకుల నుంచి సంక్రమించినది కాదు కాబట్టి, ఆ ఆస్తి మీద పూర్తి హక్కు మీ అమ్మగారికి మాత్రమే ఉంటుంది. ముందుగా ఏదో ఒక ఆస్తి ఉన్న పరిధిలోని సివిల్ కోర్టును ఆశ్రయించి, కనబడకుండాపోయిన తన కొడుకును చట్టపరంగా మరణించిన (సివిల్ డెత్) వ్యక్తిగా పరిగణించాలి అని కోరుతూ, తన ఆస్తులు అన్నిటికీ కూడా తల్లిగారు మాత్రమే వారసురాలు అని కేసు నమోదు చేయాలి. సివిల్ కోర్టు నుంచి డిక్రీ పొందిన తర్వాత ఆ ఆస్తులను తన పేరుకు మార్చుకొని, తనకు కావలసిన సమయంలో లేదా ఒక వీలునామా ద్వారా ఆ ఆస్తులను ఎవరికి ఎలా పంచాలి అనే అంశంపై తన ఇష్టపూర్వక నిర్ణయం తీసుకోవచ్చు.
(చదవండి: మూడు నెలల్లో పదికిలోలు తగ్గి..మెడిసిన్ వాడకుండానే డయాబెటీస్ క్యూర్!)