మా అమ్మగారు ఒక ప్రభుత్వ కార్పొరేషన్‌లో పనిచేసేవారు. ఇంకో 3 సంవత్సరాలు సర్వీసు ఉండగానే ఆమె చనిపోయారు. ఇది జరిగి కూడా 2 ఏళ్ళు కావస్తోంది. మా నాన్నగారు చిన్న వ్యాపారస్తులు. ఆయనకి 68 ఏళ్లు. మా అమ్మగారు పోయాక మనస్తాపంతో ఆయన వ్యాపారం సరిగా చేయలేక΄ోతున్నారు. రేపో మాపోవ్యాపారం మూతపడేలా ఉంది. నేను డిగ్రీ చదివాను కానీ నిరుద్యోగిని. అందువల్ల మా అమ్మగారి ఉద్యోగం నాకు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాను. ఇది జరిగి ఏడాదిపైనే అయినప్పటికీ ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే ఏదో ఒక కారణం చూపి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదు. మా అమ్మ గారి ఉద్యోగం నాకు వస్తుందా? –హరికృష్ణ, రాజమండ్రి
సానుభూతి లేదా కారుణ్య నియామకం (Compassionate Appointment) అనేది మానవతా దృక్పథంతో ఇచ్చే తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ, అది ఎవరి వారసత్వ హక్కు కాదని జస్టిస్ దీ΄ాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ద్విసభ్య సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలే ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. అంతేకాక, సానుభూతి నియామకాలలో పరిగణించవలసిన అంశాలను, 10 న్యాయ సూత్రాలను కూడా సూచించింది. అందులో భాగంగా చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు :
సానుభూతి నియామకం అనేది ప్రజా ఉ;eధికి (అందరికీ సమానంగా రావాల్సిన ఉద్యోగ అవకాశాలకు) ఒక మినహాయింపే తప్ప హక్కు కాదు.
సానుభూతి నియామకం కోసం ప్రభుత్వం లేదా ఆ యాజమాన్యం/సంస్థ చట్టబద్ధమైన – నిర్దిష్టమైన నియమాలు, ఆదేశాలు జారీచేయాలి. అవి లేకుండా నియామకం చేయడం చట్టవిరుద్ధం.
ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం లేదా ఆరోగ్య కారణాలతో పనిచేయలేకపోవడం (మెడికల్ అన్ ఫిట్) వల్ల కుటుంబం పడే ఆర్థిక సంక్షోభాన్ని తీరుస్తుందే తప్ప, ఇతర సందర్భాల్లో ఈ పథకం వర్తించదు.
ఇలాంటి నియామకాలు ఆలస్యం కాకుండా త్వరగా ఇవ్వాలి, ఎందుకంటే కుటుంబం ఎదుర్కొనే కష్టాలకు తక్షణ ఉపశమనమే దీని ఉద్దేశ్యం. ∙ఇది ‘‘సైడ్ డోర్ ఎంట్రీ’’గా పరిగణించబడుతుంది కాబట్టి, నియమాలను కఠినంగా అమలు చేయాలి.
ఇది శాశ్వత హక్కు కాదు. అభ్యర్థి సంబంధిత నియమాల్లో ఉన్న అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ∙కుటుంబం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా లేదా అన్నదే ప్రధానం. కుటుంబ పరిస్థితిని పరిగణించకుండా ఇచ్చే నియామకాలు చట్టబద్ధం కావు.
కారుణ్య నియామకం కోసం దరఖాస్తు ఆ ఉద్యోగి మరణం లేదా అశక్తత తర్వాత తక్షణమే ఇవ్వాలి. సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబానికి తక్షణ అవసరం లేదన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది.
నియమాలు అనుమతిస్తే తప్ప, చిన్నవాడైన అభ్యర్థి పెద్దవాడయ్యేవరకు ఉద్యోగాన్ని అలాగే ఉంచరాదు.
ఫ్యామిలీ పెన్షన్, ఆరోగ్య బీమా వంటి పెన్షన్ బెనిఫిట్ స్కీం కింద లభించే నెలవారీ చెల్లింపులు సానుభూతి నియామకానికి అడ్డం కావు.
పైన చెప్పిన నియామకాల్లో మీకు ప్రతికూలంగా ఏమీ లేవు. ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి, ఆ విషయాన్ని మీ దరఖాస్తులో ప్రస్తావించారనే అనుకుంటున్నాను. పైగా మీరు మీ అమ్మగారు మరణించిన వెంటనే దరఖాస్తు కూడా చేసుకున్నారు. పైన పేర్కొన్న నియమాలలో మీరు సరిపోకపోతే తప్ప, మీకు ఉద్యోగాన్ని తిరస్కరించే హక్కు ఆ సంస్థవారికి లేదు. ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే, త్వరితగతిన మీ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీరు హైకోర్టును ఆశ్రయించటం ఉత్తమం.
ఇదీ చదవండి: దిగుబడుల్లో అంతరాలెందుకు
శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.


